కరువు కోరల్లో రబీ
– దెబ్బ మీద దెబ్బ...
– 11 వేల హెక్టార్లకు పరిమితమైన పంటలు
– 9 వేల హెక్టార్లతో ఆగిపోయిన పప్పుశనగ
– వందేళ్ల 'అనంత' చరిత్రలో ఇదే తొలిసారి
ఖరీఫ్ పంటలను అత్యంత దారుణంగా దెబ్బతీసిన వరుణుడు రబీని కూడా వదలలేదు. మరింత కసిగా కరువు కోరల్లోకి నెట్టేశాడు. అది కూడా అనంతపురం జిల్లా వందేళ్ల చరిత్రలో ఎపుడూ లేనంతగా శాసించాడు. ఫలితంగా ఖరీఫ్ కష్టాల నుంచి ఇంకా తేరుకోని రైతులకు రబీ ఆశలు కూడా గల్లంతయ్యాయి. దెబ్బ మీద దెబ్బ పడటంతో రైతులు కోలుకోవడం కష్టంగా మారింది.
జిల్లా వ్యాప్తంగా ఈ రబీలో అన్ని పంటలూ కలిపి 1,30,965 హెక్టార్ల విస్తీర్ణంలో సాగులోకి రావాల్సి ఉండగా ప్రస్తుతానికి 11 వేల హెక్టార్లకు పరిమితమైపోయింది. అందులో ప్రధానపంట పప్పుశెనగ 77,564 హెక్టార్లలో సాగులోకి రావచ్చని అంచనా వేయగా 9 వేల హెక్టార్లకు పరిమితమైంది. పప్పుశనగ సాగుకు అక్టోబర్ నెల సరైన సమయం కాగా నవంబర్ 15 వరకు వేసుకున్నా ఫరవాలేదని శాస్త్రవేత్తలు, అధికారులు భరోసా ఇచ్చినా ఫలితం లేకుండా పోయింది. 35 మండలాల్లో పప్పుశనగ పంట వేయాల్సి ఉండగా ఐదారు మండలాల్లో మాత్రమే అరకొర తేమలో పంట వేశారు.
వేసిన ప్రాంతాల్లో పంట దిగుబడులు రావడం కష్టమంటున్నారు. అక్టోబర్, నవంబర్‌లో కూడా వర్షం జాడ కనిపించకపోవడంతో రబీ అంచనాలు పూర్తిగా తారుమారయ్యాయి. నవంబర్ 15 నుంచి డిసెంబర్ 15 వరకు వేరుశనగ సాగు అనుకూలమని చెబుతున్నారు. 20 వేల హెక్టార్లలో వేరుశనగ సాగవుతుందని అంచనా వేయగా.. భూగర్భజలాలు అడుగంటిపోవడంతో అది కూడా అరకొరగా సాగయ్యే పరిస్థితి నెలకొంది. ఇక 10 వేల హెక్టార్ల అంచనాతో ఉన్న వరి సాగు మరింత దయనీయంగా మారింది. ప్రస్తుతానికి జొన్న 1100 హెక్టార్లలో వేశారు. మొక్కజొన్న, ఉలవ, పొద్దు తిరుగుడు, రాగి, కుసుమ, పత్తి తదితర పంటలు కూడా వందలోపు హెక్టార్లకే పరిమితమయ్యాయి.
దెబ్బతీసిన వర్షాలు
అక్టోబర్‌లో 110.7 మి.మీ సగటు వర్షపాతం నమోదు కావాల్సి ఉడగా నెలంతా కలిపి కేవలం 7.1 మి.మీ నమోదైంది. అంటే ఏకంగా 94 శాతం తక్కువగా వర్షాలు కురవడంతో రబీ ముందుకు సాగలేదు. నవంబర్‌లో కూడా 34.7 మి.మీ సగటు నమోదు కావాల్సి ఉండగా ప్రస్తుతానికి కేవలం 1 మి.మీ మాత్రమే నమోదైంది. జూన్, జూలై మినహా ఆగస్టు నుంచి నవంబర్ వరకు తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొనడంతో ఇప్పటివరకు 462.8 మి.మీ గానూ 265.4 మి.మీ వర్షపాతం నమోదైంది. మొత్తం మీద 43 శాతం తక్కువగా వర్షాలు కురిశాయి. గతంలో ఎపుడూ ఇంత దయనీయమైన పరిస్థితిని చూడలేదని అధికారులు, రైతులు చెబుతున్నారు.
పాలకులు చిన్నచూపు
ప్రకృతి కరుణించినా పాలకులు సహకరించకపోవడంతో ఈ ఏడాది 'అనంత' వ్యవసాయం పెనుసంక్షోభంలో కూరుకుపోయింది. పెట్టుబడుల కోసం అప్పులు చేసిన రైతులకు పంట సర్వనాశనం కావడంతో కోలుకోవడం కష్టంగానే కనిపిస్తోంది. 6.09 లక్షల హెక్టార్లలో వేసిన వేరుశనగ, మరో 1.50 లక్షల హెక్టార్లలో సాగైన ఖరీఫ్ పంటలు దారుణంగా దెబ్బతినడంతో రూ.వేలాది కోట్లు మట్టిలో కలిసిపోయాయి.
ఇక గతేడాది ఖరీఫ్ పంట నష్టానికి సంబంధించి రావాల్సిన ఇన్‌పుట్ సబ్సిడీ నయాపైసా విడుదల కాకపోవడం, రూ.105 కోట్ల ప్రీమియం చెల్లించినా కేవలం 24 మండలాల రైతులకు నామమాత్రంగా రూ.109 కోట్లు వాతావరణ బీమా పరిహారం మంజూరు కావడంతో రైతు ఇంట విషాద ఛాయలు నెలకొన్నాయి. వర్షాలు ముఖం చాటేయడంతో 29 వేల హెక్టార్లలో మల్బరీ, 1.71 లక్షల హెక్టార్లలో విస్తరించిన పండ్లతోటలు కూడా చాలా వరకు దెబ్బతినే పరిస్థితి నెలకొంది. రక్షకతడుల పేరిట హడావిడి చేసిన రాష్ట్ర ప్రభుత్వం 'అనంత'మైన కష్టాలకు ఇపుడు భరోసా కల్పించే చర్యలు చేపట్టకపోవడంతో రైతుల దుస్థితి దయనీయంగా మారింది.