రబీపైనే ఆశలు | farmers ready to rabi crop cultivation | Sakshi
Sakshi News home page

రబీపైనే ఆశలు

Published Thu, Jan 16 2014 4:22 AM | Last Updated on Sat, Sep 2 2017 2:38 AM

farmers ready to rabi crop cultivation

వరంగల్ సిటీ, న్యూస్‌లైన్: ప్రస్తుత రబీ సీజన్‌లో వివిధ పంటల సాగు ముమ్మరంగా సాగుతోంది. ఖరీఫ్‌లో పంటలకు తీవ్ర నష్టం జరగడంతో రైతులు ఇప్పుడు రబీనే నమ్ముకున్నారు. చెరువుల్లో నీటి నిల్వలు తగినంత ఉన్నందున ఎక్కువగా వరిసాగు వైపు మొగ్గు చూపుతున్నారు. కొంత మంది రైతులు మొక్కజొన్న సాగుకు ప్రాధాన్యమిస్తున్నారు. ఖరీఫ్‌లో పంట చేతికొచ్చిన సమయంలో వరుసగా వచ్చిన తుపాన్‌లతో రైతులు విలవిలలాడారు.

 వరి, పత్తి, మొక్కజొన్న తదితర పంటలు దెబ్బతిని రూ.686 కోట్ల మేరకు రైతులు నష్టపోయినట్లు వ్యవసాయ శాఖ ప్రాథమిక అంచనా వేసింది. ఆ నష్టాల నుంచి కోలుకునేందుకు రైతులు రబీకి సిద్ధమవుతున్నారు. లక్నవరం, రామప్ప, పాకాల, మల్లూరు, చలివాగు ప్రాజెక్టుల్లో నీటి నిల్వలు తగినంత ఉన్నాయి. ఎస్సారెస్పీ నుంచి కూడా నీటి విడుదలతో రబీలో పంటల సాగుకు ఢోకాలేదని భావిస్తున్నారు. జిల్లాలో సాధారణ వర్షపాతం 915.8 మిల్లీ మీటర్లు కాగా, ఈ సారి 1225.9 మిల్లీ మీటర్లుగా నమోదుకావడంతో భూగర్భజలాలు పెరిగాయి.

 ఇప్పటి వరకు ఎరువుల కొరత లేనప్పటికీ, రుణ ప్రణాళిక అమలుకు అధికారులు చర్యలు చేపట్టడంలో నిమగ్నమయ్యారు. బోర్లు, బావులపై ఆధారపడి నారు పోసిన వారు నాట్లు వేసేందుకు దుక్కులు సిద్ధం చేసుకుంటున్నారు. కొన్ని చోట్ల నాట్లు కూడా వేస్తున్నారు. వచ్చేనెల మొదటి వారం వరకు నాట్లు ఊపందుకోనున్నాయి.

 వరిసాగుకే ప్రాధాన్యత
 ఆరుతడి పంటలు సాగు చేయూలని వ్యవసాయూధికారులు చె బుతున్నప్పటికీ రైతులు మాత్రం వరి సాగుకే సిద్ధమవుతున్నా రు. గత ఏడాది రబీలో 70,651 హెక్టార్ల విస్తీర్ణంలో వరి సాగరుుంది. ఈ సారి లక్ష హెక్టార్ల వరకు సాగు విస్తీర్ణం పెరుగుతుం దని అంచనా. ఇప్పటికే బోర్లు, బావుల కింద వెయ్యి హెక్టార్ల మేరకు వరి నాట్లు వే శారు. చెరువులు, మధ్యతరహా ప్రాజెక్టుల కింద నీరు విడుదల కాగానే నాట్లు వేసేందుకు సిద్ధమవుతున్నారు.

 వరి తర్వాత రైతులు ఎక్కువగా మొక్కజొన్నకు ప్రాధాన్యమిస్తున్నారు. మెట్టపంటగా తక్కువ మోతాదు నీటితో రెండు మూడు తడులతో ఈ పంట చేతికొచ్చే అవకాశం ఉంది. ఈ రబీలో ఇప్పటికే జిల్లాలో 13,600 హెక్టార్లలో మొక్కజొన్న సాగు చేపట్టారు. మొత్తం ఈ పంట 50వేల హెక్టార్లలో సాగు చేస్తారని వ్యవసాయ అధికారులు అంచనా వేస్తున్నారు. గత ఏడాది రబీలో 40,600 హెక్టార్ల విస్తీర్ణంలో మొక్కజొన్న సాగు చేశారు.

 ఎరువులున్నాయి...
 రబీకి సంబంధించి అవసరమైన ఎరువులు అందుబాటులో ఉండే విధంగా చర్యలు చేపట్టారు. రబీలో యూరియా కొరత లేకుండా జాగ్రత్త వహిస్తున్నారు. అక్టోబర్, నవంబర్, డిసెంబర్ నెలల్లోనే ఎరువులు జిల్లాకు చేరుకునే విధంగా చర్యలు చేపట్టారు. ఇప్పటి వరకు యూరియా 52,692 మెట్రిక్ టన్నులు, డీఏపీ 4,862 మెట్రిక్ టన్నులు, కాంప్లెక్సు ఎరువులు 26,606 మెట్రిక్ టన్నులు పంపిణీ చేశారు. ఇక పొటాష్ ఎరువులు జిల్లాకు చేరుకోవాల్సి ఉంది. రూ.540 కోట్లతో రబీ రుణ ప్రణాళిక రూపొందించారు. ఇప్పటి వరకు రూ.110 కోట్ల రుణాలు అందించినట్లు అధికారులు చెబుతున్నారు.  

 రబీలో సమస్యలు తలెత్తకుండా చర్యలు : జేడీఏ రామారావు
 రబీలో రైతాంగానికి సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకుంటున్నామని వ్యవసాయ శాఖ జాయింట్ డెరైక్టర్ జి.రామారావు చెప్పారు. రుణ ప్రణాళిక అమలుకు చర్యలు తీసుకుంటున్నామని, ఎరువులు, విత్తనాల కొరత లేదన్నారు. ఆరుతడి పంటలు వేయాలని రైతులకు సూచించారు. ఈ మేరకు అధికారులను అప్రమత్తం చేశామన్నారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement