ఒంగోలు టౌన్, న్యూస్‌లైన్: వర్షాభావ పరిస్థితులకు తోడు, ప్రభుత్వ నిర్లక్ష్యం జిల్లా రైతాంగాన్ని ఇక్కట్ల పాలు చేస్తోంది. ఖరీఫ్ సీజన్ అంతంతమాత్రంగానే ముగిసిపోయింది. కనీసం రబీలోనైనా సంప్రదాయ పంటలు వేసుకుందామనుకున్న రైతులకు తీవ్ర నిరాశే మిగిలింది. ప్రభుత్వం వ్యవసాయానికి 7 గంటలు ఉచిత విద్యుత్ ఇస్తామని చెప్పి..పట్టుమని 3 గంటలు కూడా సజావుగా ఇవ్వకపోవడంతో రైతులు తీవ్ర ఇక్కట్లు పడుతున్నారు. దీంతో పంటలు బతికించుకునేందుకు రైతులు భగీరథ యత్నమే చేస్తున్నారు. జిల్లాలో వ్యవసాయ విద్యుత్ కోసం రైతులు పడుతున్న ఇక్కట్లను ‘న్యూస్‌లైన్’ బృందం ఆదివారం పరిశీలించింది.
అర్ధరాత్రి పొలాల్లో రైతుల పాట్లు:
వ్యవసాయానికి ఇచ్చే విద్యుత్‌ను రెండు దఫాలుగా ఇస్తామని చెప్పినా సమయపాలన లేక పోవడంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. అర్ధరాత్రి ఇచ్చే విద్యుత్ కోసం పొలాల గట్ల వెంట పడిగాపులు కాస్తున్నారు.
ఇంజన్లు, జనరేటర్లే ఆధారం...
విద్యుత్‌ను అధికారులు చెప్పినంత సమయం ఇవ్వకపోవడంతో జిల్లా రైతాంగం మొత్తం ఇంజన్లు, జనరేటర్ల మీదే ఆధారపడుతున్నారు. విద్యుత్ మోటార్లున్నా..కరెంటు లేకపోవడంతో అద్దెకు ఇంజన్లు, జనరేటర్లు తెచ్చుకోవాల్సిన పరిస్థితి. వీటికి తోడు దూర ప్రాంతాల నుంచి నీరు తరలించేందుకు కిలోమీటర్ల దూరం పైపులు వాడాల్సి వస్తోంది. పంటను ఒకసారి తడుపుకునేందుకు రూ 5 వేలు దాటుతోంది. ఇంజన్లు, జనరేటర్లు, పైప్‌లు సప్లయి చేసే షాపు యజమానులకు మంచి గిరాకీ సీజన్‌గా మారింది.
రబీలో ప్రధానంగా వరి సాగు చేస్తారు. 2 లక్షల ఎకరాలకుపైగా వేయాల్సి ఉంటే వర్షాభావ ం వల్ల అది కాస్తా లక్ష ఎకరాలకు దిగజారిపోయింది. వరితో పాటు పొగాకు, మొక్కజొన్న, శనగ, మిరప, పొద్దుతిరుగుడు, పత్తి, కంది, వేరుశనగ, కూరగాయల రకాలతో పాటు అనేక రకాల పంటలు పండిస్తున్నారు.
గిద్దలూరు నియోజకవర్గ పరిధి లో 5 గంటలు మాత్రమే వ్యవసాయానికి విద్యుత్ సరఫరా చేస్తున్నారు. రాచర్ల, అర్థవీడు మండలాల్లో పరిస్థితి మరీ దారుణంగా ఉంది. విద్యుత్ లైన్లలో సరఫరా సరిగా లేదని సిబ్బంది చెప్పడంతో రాచర్లలో శనివారం రైతులు ఆందోళన చేపట్టారు. మిరప, పొద్దుతిరుగుడు, పత్తి, మొక్కజొన్న పంటల రైతులు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు.
మార్కాపురం పరిధిలో అర్ధరాత్రులు 2 గంటలు, పగలు 3 గంటలు మాత్రమే విద్యుత్ సరఫరా ఇస్తున్నారు. తర్లుపాడు, పొదిలి, కొనకనమిట్ల, మార్కాపురం ప్రాంతాల్లో 500 అడుగుల లోతులో బోర్లు వేయాల్సిన పరిస్థితి.
యర్రగొండపాలెం ప్రాంతంలో విద్యుత్ సక్రమంగా ఇవ్వడం లేదని రైతులు ఇటీవల ఆందోళనలు కూడా చేపట్టారు.
కనిగిరి ప్రాంతంలో ప్రధానంగా వరి, పొగాకు పంటలను కాపాడుకునేందుకు రైతులు ఎకరాకు రూ 4 నుంచి రూ 5 వేలు ఖర్చు చేస్తున్నారు. విద్యుత్ 3 నుంచి 4 గంటలకు మించి ఇవ్వడం లేదు.
కందుకూరు ప్రాంతంలోని ఉలవపాడులో అర్ధరాత్రులు కేవలం అరగంట మాత్రమే ఇచ్చి నానా ఇబ్బందులు పెడుతున్నారు. గుడ్లూరులో రాత్రులు గంట మాత్రమే ఇస్తున్నారు. మొత్తం రెండు దఫాలుగా కాకుండా మూడు దఫాలుగా విద్యుత్ సరఫరా చేస్తున్నారు. ఎక్కువగా ఈ ప్రాంతంలో పొగాకు సాగు చేపట్టారు.
దర్శి ప్రాంతంలో వ్యవసాయానికి 5 గంటలలోపే విద్యుత్ ఇస్తున్నారు. వరి చివరి దశకు చేరుకుంది. నీటితడులు లేకపోతే ఇప్పటి వరకు చేసిన శ్రమ, ఖర్చు వృథా అయినట్లే. సాగర్ నీళ్లు సక్రమంగా రాకపోవడంతో మరీ ఇబ్బందులు పడుతున్నారు.
అద్దంకి ప్రాంతంలో కూడా సాగర్ నీళ్లు అందడం లేదు. ఇక్కడ వరికి, మొక్కజొన్నకు నీటి అవసరం అధికం కావడంతో కిలోమీటర్ల కొద్దీ పైప్‌లు వేసి నీటిని ఇంజన్లు, జనరేటర్లతో తరలించుకుంటున్నారు.
సంతనూతలపాడు ప్రాంతంలో 5 వేల మోటార్లుంటే సక్రమంగా విద్యుత్ రాకపోవడంతో తరచూ కాలిపోతున్నాయి. దీంతో ఇది అదనపు ఖర్చుగా మారింది. డీజిల్ ధర కూడా దాదాపు లీటరు రూ 58.75 కావడంతో భారాన్ని తట్టుకోలేకపోతున్నారు. అర్ధరాత్రులు విద్యుత్ ఫీజులు పోవడమే కాకుండా, తీరా సిద్ధమయ్యే సరికి కరెంట్ పోవడం పరిపాటిగా మారింది. ఇక్కడ కేవలం 2 నుంచి 3 గంటలు మాత్రమే విద్యుత్ ఇస్తున్నారు.
ఉచిత విద్యుత్ సక్రమంగా ఇచ్చి ఆదుకోలేని ప్రభుత్వం
Published Mon, Jan 6 2014 3:44 AM | Last Updated on Tue, Sep 18 2018 8:38 PM
Advertisement