
వర్షాలు పడడం లేదు. ఏం చేయలేం. ఈ ఏడాదికి ఇంతే.. సోమశిలలో నీరు తక్కువగా ఉంది. ఉన్న దాంట్లో సర్దుకోండి. ఇది పాలక పక్షం తీరు. నీటి కేటాయింపులు మొదలుకొని సాగు విస్తీర్ణం వరకు అన్నీ ఈ ఏడాది గణనీయంగా తగ్గిపోయాయి. లక్షల ఎకరాలకు నీరు ఇవ్వాల్సిన అధికార గణం తక్కువ ఎకరాలకు నీటి కేటాయింపులు ప్రకటించారు. అదేమని సభలో ప్రశ్నిస్తే జిల్లాకు భారీ వర్ష సూచనలు ఉన్నాయి. వర్షం పడితే వాటితో ఈ ఏడాది గట్టెక్కేద్దామంటూ పాలకుల జవాబు. గురువారం జరిగిన సాగునీటి సలహా మండలి సమావేశం ఊహలు, ఆశలు, నామమాత్రపు కేటాయింపులతో ముగిసింది.
సాక్షి ప్రతినిధి, నెల్లూరు: రబీ సీజన్ రైతుల ఆశలకు అధికారులు పాలకులు గేట్లు వేశారు. రబీ సీజన్ ప్రారంభమై నెల రోజులు గడిచిపోయింది. వానలు లేవు.. సోమశిలలో ఉన్న నీటిని ఎప్పుడు విడుదల చేస్తారా అని ఎదురు చూస్తున్న రైతాంగాన్ని ఉస్సూరుమనిపించారు. జిల్లాలో గతేడాది 50.02 టీఎంసీల నీటిని సోమశిల నుంచి విడుదల చేసి 4.98 లక్షల ఎకరాలకు సాగునీరు ఇచ్చారు. అయితే ఈ ఏడాది పరిస్థితి పూర్తిగా ఇందుకు భిన్నంగా ఉంది. సోమశిలలో నీటి నిల్వ తక్కువగా ఉందని 31 టీఎంసీల నీటిని 3.21 లక్షల ఎకరాలకు ఇస్తామని ప్రకటించారు. 2015 నుంచి కరువు కోరల్లో జిల్లా కొట్టుమిట్టాడుతోంది. ముఖ్యంగా ఈ ఏడాది అయితే జిల్లాలోని 46 మండలాలను ప్రభుత్వం కరువు మండలాలుగా ప్రకటించారు. ఇలాంటి తరుణంలో రైతులు అందరు సోమశిల సాగునీటిపైనే ఆశలు పెంచుకున్నారు. మరో వైపు 63 శాతం లోటు వర్షపాతం నమోదు కావటంతో సోమశిల నీరే ఆధారంగా జిల్లాలో లక్షల ఎకరాల్లో సాగు జరగాల్సి ఉంది.
అయితే అధికారులు ముందు చూపు లేకపోవటం గతంలో సోమశిలకు వచ్చిన వరద నీటిని కండలేరుకు వదిలి అక్కడి నుంచి చెన్నై, చిత్తూరు జిల్లాలకు తాగునీటి అవసరాలకు తరలించడం వంటి పరిణామలతో ఈ ఏడాది సోమశిలలో నీటి లభ్యత తగ్గిపోయింది. ప్రతి ఏడాది రబీ సీజన్ ప్రారంభానికి ముందే సాగునీటి సలహా మండలి సమావేశం నిర్వహించి, నీటి కేటాయింపులు ప్రకటించగానే దానికి అనుగుణంగా సాగు విస్తీర్ణం ఉండేది. అక్టోబర్‌లో ముగించాల్సి ఉన్న సాగునీటి సమావేశాన్ని నవంబర్‌లో ఏర్పాటు చేశారు. జిల్లాలో ఇప్పటికే రబీ సీజన్ కూడా ప్రారంభం అయింది. ఈ క్రమంలో శుక్రవారం నుంచి నీరు విడుదల చేస్తామని ప్రకటించారు. సోమశిల రిజర్వాయర్‌లో ప్రస్తుతం అధికారిక లెక్కల ప్రకారం 42 టీఎంసీల నీరు ఉంది. డెడ్ స్టోరేజ్ లెవల్, తాగునీటి అవసరాలకు పోనూ 31 టీఎంసీల నీరు విడుదల చేస్తామని ప్రకటించారు. ఇందులో డెల్టాలో 1.91 లక్షల ఎకరాలకు ఉత్తర, దక్షిణ కనుపూరు, కావలి పరిధిలో ఉన్న ఆయకట్టులో 50 శాతం అయకట్టుకు మాత్రమే నీరిస్తామని ప్రకటించారు. కండలేరులో ఉన్న 13 టీఎంసీల నీటిని మనుబోలు, గూడూరు, సూళ్లూరుపేట, వెంకటగిరి నియోజకవర్గాలతో పాటు తిరుపతి, చెన్నై తాగునీటి అవసరాలకు కేటాయిస్తామని ప్రకటించారు.
మోటార్లు కట్టడి చేస్తేనే నీరు
అక్రమ మోటార్ల ద్వారా జిల్లాలో నీటిని తోడేస్తుంటారు. ముఖ్యంగా కావలి కెనాల్ పరిధిలో 48 వేల అనధికార మోటార్లు, కనుపూరు కెనాల్ కింద 32 వేల అనధికార మోటార్ల ద్వారా నీటిని కొందరు తోడేస్తున్నారు. జలవనరుల శాఖ, రెవెన్యూ అధికారులకు ప్రతి మో టారుకు 10 వేల చొప్పున వసూలు చేసి చూసీచూడనట్లుగా వ్యవహరిస్తున్నారు. దీంతో చివరి భూముల రైతులకు నీరు అందని పరిస్థితి.
రైతు సంఘ నాయకులకుఅవకాశం కల్పించాలి
నెల్లూరు(పొగతోట): జిల్లా సాగు నీటి సలహా మండలి (ఐఏబీ)లో రైతు సంఘాల నాయకులకు మాట్లాడే అవకాశం ఇవ్వాలని మాజీ ఎమ్మెల్యే కాటంరెడ్డి విష్ణువర్ధన్‌రెడ్డి డిమాండ్ చేశారు. గురువారం ఐఏబీ సమావేశంలో జిల్లా ఇన్‌చార్జి మంత్రి ఎన్.అమర్‌నాథ్‌రెడ్డికి విష్ణువర్ధన్‌రెడ్డి, రైతు సంఘాల నాయకుడు బెజవాడ గోవిందరెడ్డి, రైతు నాయకులు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా విష్ణు మాట్లాడుతూ ఐఏబీ సమావేశంలో రైతు సంఘాల నాయకులకు మాట్లాడే అవకాశం కల్పిస్తే క్షేత్రస్థాయిలో సమస్యలు వెలుగులోకి వస్తాయన్నారు. రైతులు పడుతున్న ఇబ్బందులు, కష్టాలు తెలుసుకునే అవకాశం ఉందన్నారు. క్షేత్రస్థాయిలో సమస్యలను పరిష్కరించగలిగితే రైతులకు మేలు చేసిన వారవుతారన్నారు. సాగునీరు అందక చివరి భూముల రైతులు నానా ఇబ్బందులు పడుతున్నారన్నారు. రైతులు ఇబ్బందులు పడకుండా వీలైనంత నీటిని అధిక ఎకరాలకు కేటాయించాలన్నారు. నీటిని విడుదల చేయని ప్రాంతాల రైతులకు అవగాహన కల్పించాలన్నారు. మంచి నీటికి ప్రజలు ఇబ్బందులు పడకుండా ప్రత్యేక చర్యలు చేపట్టాలన్నారు. భూగర్భ జలాలు అభివృద్ధి చెందేలా చెరువులకు నీటిని విడుదల చేయాలని కోరారు.
Comments
Please login to add a commentAdd a comment