సాక్షి ప్రతినిధి, నెల్లూరు: భూ దందా కేసును ఎదుర్కొంటున్న మాజీమంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి పోలీసు విచారణకు హాజరుకాకుండా ఆఖరి క్షణంలో అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. ఈ వ్యవహారంలో పోలీసుల ఎదుట హాజరై అన్ని వివరాలు చెబుతానని నోటీసులు అందుకున్న సోమిరెడ్డి తన తరఫున న్యాయవాదులను పంపించి, విచారణకు డుమ్మా కొట్టారు. గత ప్రభుత్వ హయాంలో మంత్రిగా ఉన్నప్పుడు తన అధికారాన్ని అడ్డం పెట్టుకొని వేరే వారి భూమిని తన భూమిగా చూపించి ఇతరులకు విక్రయించారు. ఈ క్రమంలో భూ యజమానులు న్యాయస్థానాన్ని ఆశ్రయించడంతో పోలీసులను కేసు నమోదు చేసి విచారించాల్సిందిగా కోర్టు ఆదేశించింది. దీంతో వెంకటాచలం పోలీసులు కేసు నమోదు చేసి విచారణకు హాజరు కావాల్సిందిగా సోమిరెడ్డికి సమన్లు జారీ చేయడం రాజకీయంగా కలకలం రేపింది.
రెండు సమన్లు అందుకుని..
వెంకటాచలం మండలం ఇడిమేపల్లిలో సర్వే నంబరు 58–3లో 2.41 ఎకరాల భూమిని సోమిరెడ్డి తన రాజకీయ పలుకుబడితో రికార్డులు తారుమారు చేశారని బాధితుడు ఏలూరు రంగారెడ్డి న్యాయస్థానాన్ని ఆశ్రయించడంతో సోమిరెడ్డిపై వెంకటాచలం పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైన విషయం తెలిసిందే. ఈ కేసుకు సంబంధించి విచారణాధికారి వద్దకు హాజరు కావాలని ఒక సమను, ఆ భూమికి సంబంధించి మీ వద్దనున్న డాక్యుమెంట్లు సమర్పించాలని మరో సమనును ఈ నెల 6వ తేదీన వెంకటాచలం ఎస్సైషేక్ కరీముల్లా అల్లీపురంలోని ఆయన నివాసంలో సోమిరెడ్డికి అందజేశారు. ఇప్పటికిప్పుడు విచారణకు హాజరుకాలేనని డాక్యుమెంట్లు అన్నీ తీసుకుని సోమవారం విచారణకు విచారణకు హాజరై అన్ని విషయాలు వెల్లడిస్తానని సోమిరెడ్డి పోలీసులకు చెప్పి నోటీసులు తీసుకున్నారు.
ఆఖరి క్షణంలో హైడ్రామా
ఈ క్రమంలో సోమవారం సోమిరెడ్డి విచారణకు హాజరు అవుతారని టీడీపీ శ్రేణులు భారీ ప్రచారం చేసి, ఆయకు మద్దతుగా జన సమీకరణ చేయాలని భావించారు. భూ వివాదం కేసుకు సంబంధించి విచారణధికారి నెల్లూరు రూరల్ సీఐ రామకృష్ణ వద్దకు సోమిరెడ్డి హాజరు కావాల్సి ఉండగా ఆయన డుమ్మా కొట్టారు. సోమవారం మధ్యాహ్నం 3 గంటలకు సోమిరెడ్డి వెంకటాచలం పోలీస్‌స్టేషన్‌కు చేరుకుని సీఐ వద్దకు హాజరై అన్నీ డాక్యుమెంట్లు సమర్పిస్తారని ప్రచారం చేశారు. సోమిరెడ్డి హాజరైతే ఏం జరుగుతుందోనని ముందుగానే ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియా వెంకటాచలం పోలీస్‌స్టేషన్ వద్దకు చేరుకుంది.
మరో గంటలో వస్తారని ప్రచారం చేశారు. ఇంతలో సోమిరెడ్డి విచారణకు హాజరు కాకుండా వేరే ఊరెళ్లి పోవడం తీవ్ర చర్చగా మారింది. చివరకు 6 గంటల సమయంలో సోమిరెడ్డి తరఫున ఇద్దరు న్యాయవాదులు వడ్డే శ్రీనివాసరావు, చలపతి సీఐ రామకృష్ణ వద్దకు హాజరై పలు డాక్యుమెంట్లను అందజేశారు. రాత్రి 8 గంటల వరకు సీఐతో చర్చించారు. డాక్యుమెంట్లు ఇచ్చినట్లు రసీదు ఇవ్వమని న్యాయవాదులు కోరడంతో ఇచ్చేందుకు వీలుకాదని సీఐ రామకృష్ణ చెప్పడంతో ఇచ్చిన డాక్యుమెంట్లను వెనక్కి తీసుకుని వెళ్లిపోయారు.
సోమిరెడ్డి ఎక్కడ
భూదందా కేసును ఎదుర్కొంటున్న సోమిరెడ్డి ఆఖరి క్షణంలో అజ్ఞాతంలోకి వెళ్లిపోవడం, తన న్యాయవాదులను పోలీసుల వద్దకు పంపడంతో రాజకీయంగా చర్చకు దారితీసింది. ఇప్పటికే ఆయన ముందుస్తు బెయిల్ కోసం కోర్టును సైతం ఆశ్రయించడం, విచారణకు డుమ్మా కొట్టడం చూస్తే ఆయన వద్ద ఆధారాలు లేకపోవడంతోనే అదృశ్యమైపోయారని సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతం ఎక్కడ ఉన్నాడో తెలియని పరిస్థితి.
Comments
Please login to add a commentAdd a comment