సాక్షి, నెల్లూరు: భూదందా కేసులో మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి చుట్టూ ఉచ్చు బిగించుకుపోతుంది. టీడీపీ ఐదేళ్ల పాలనలో సోమిరెడ్డి తనకున్న రాజకీయ పరపతిని అడ్డుపెట్టుకుని ఎన్నో అరాచకాలకు పాల్పడ్డాడు. ప్రతిపక్షపార్టీ నేతలు, కార్యకర్తలపై తప్పుడు కేసులు పెట్టించాడు. సహజవనరులను దోచుకుని రూ.కోట్లకు పడగలెత్తాడు. ఆయన అరాచకాలను ప్రశ్నించిన అప్పటి ప్రతిపక్ష శాసనసభ్యుడిగా ఉన్న కాకాణి గోవర్ధన్‌రెడ్డిపై అక్రమ కేసులు నమోదు చేయించి ఇబ్బందిపడేలా చేశాడు.
ఐదేళ్ల కాలంలో వైఎస్సార్‌సీపీని టార్గెట్ చేసి నేతలను, కార్యకర్తలను పోలీస్ కేసులతో భయపెట్టి నరకం చూపించిన సోమిరెడ్డిపై ఎట్టకేలకు భూ దందా కేసు నమోదైంది. ఆయన చేసిన దందాపై గత పాలనలో పోలీసులు ఫిర్యాదు కూడా స్వీకరించేందుకు వెనకాడారు. బాధితులు కోర్టును ఆశ్రయించి కేసు నమోదుకు ఆదేశాలు ఇప్పించడంతో మాజీ మంత్రిపై కేసు నమోదైంది. గత నెల 27వ తేదీన పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన వెంకటాచలం పోలీసులు విచారణ నిమిత్తం సోమవారం విచారణాధికారి ముందు హాజరు కావాలని సమన్లు జారీ చేశారు.
అధికారం అడ్డుపెట్టుకుని అరాచకాలు
2014లో సర్వేపల్లి నియోజకవర్గ ప్రజలు ఓటమి పాలుచేసినా టీడీపీ గద్దెనెక్కడంతో తన పరపతితో ఏకంగా సోమిరెడ్డి మంత్రి పదవి చేజిక్కించుకున్నాడు. మంత్రి పదవిని అడ్డుపెట్టుకుని అరాచకాలకు పాల్పడ్డాడు.. ప్రతిపక్షపార్టీ నేతలు, కార్యకర్తలను టార్గెట్ చేసి పోలీసులు చేత భయపెట్టి వారికి చుక్కలు చూపించాడు. ఆయన మంత్రి కావడంతో అటు అధికార యంత్రాంగం కూడా తప్పులు చేసేందుకు కూడా వెనకాడలేదు. సోమిరెడ్డి చెప్పిందే వేదం అన్నట్లుగా అధికార దుర్వినియోగం జరిగింది. అందులో భాగంగా వెంకటాచలం మండలం ఇడిమేపల్లిలో పామర్రు పిచ్చిరెడ్డికి సర్వే నంబర్ 58–1లో 8.89 ఎకరాలు, 58–3 లో 4.41 ఎకరాలు మొత్తం కలిపి 13.71 ఎకరాలు భూమి ఉంది. ఇందులో 10.94 ఎకరాలు పంపకాల విషయంలో వివాదం జరిగి మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమెహన్‌రెడ్డి వద్దకు పంచాయతీకి వెళ్లింది.
దీంతో సోమిరెడ్డి వారి పంచాయతీ తీర్చకపోగా విలువైన ఆ భూమిని కాజేసేందుకు కుట్రపన్నాడు. వెంటనే స్థానిక రెవెన్యూ అధికారులపై ఒత్తిడి తెచ్చి లేని రికార్డులను సృష్టించి సర్వే నంబర్ 58–3లో 2.36 ఎకరాల భూమిని తన పేరుతో రిజిస్టర్ చేయించుకున్నారు. ఆ భూమిని చెన్నై నగరానికి చెందిన మేఘనాథన్, ఏఎంజయంతిలకు విక్రయించి సొమ్ము చేసుకున్నాడు. ఈ విషయం తెలుసుకున్న బాధితుడు ఏలూరు రంగారెడ్డి అప్పట్లొనే న్యాయస్థానాన్ని ఆశ్రయించాడు. ఎట్టకేలకు భూ దందాకు సహకరించిన వారిపై కేసులు నమోదు చేయాలని న్యాయస్థానం ఇటీవల ఆదేశాలిచ్చింది. దీంతో వెంకటాచలం పోలీసులు గత నెల్లో మాజీ మంత్రి సోమిరెడ్డితో పాటు వీఆర్ మేఘనాథన్, ఏఎం జయంతి, సర్వేయర్ సుబ్బరాయుడుపై 471,468,447,427,397 సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు.
నేడు పోలీసులు ముందు హాజరు
మాజీ మంత్రి సోమిరెడ్డి భూదందాపై కేసు నమోదు చేసిన వెంకటాచలం పోలీసులు విచారణ వేగవంతం చేశారు. సోమిరెడ్డికి సహకరించిన పలువురు అధికారులను ఇప్పటికే విచారణ చేసినట్లు తెలుస్తోంది. ఆ విచారణలో కూడా సోమిరెడ్డి ఒత్తిడితోనే రికార్డులు మార్పిడి చేయాల్సి వచ్చిందని వారు తెలిపినట్లు సమాచారం. దీంతో ఈ కేసులో ప్రధాన నిందితుడైన మాజీ మంత్రి సోమిరెడ్డికి కూడా పోలీసులు రెండు సమన్లు జారీ చేశారు. ఆ భూమి నీకెలా వచ్చింది. అందుకు సంబంధించిన పూర్తి రికార్డులు తీసుకురావాలని, అలాగే సోమవారం విచారణాధికారి ముందు హాజరయిపూర్తి ఆధారాలు చూపించాలంటూ పోలీసులు సమన్లు ఇవ్వడంతో సోమవారం మధ్యాహ్నం పోలీసులు ముందు మాజీ మంత్రి సోమిరెడ్డి హాజరయ్యే అవకాశం ఉంది. ఈ కేసులో పోలీసులు సైతం మాజీ మంత్రి చీటింగ్‌పై పక్కా ఆధారాలు సేకరించి ఉచ్చు బిగించేలా చేస్తుండడంతో మాజీ మంత్రి గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. అయితే ఈ కేసును టీడీపీ పెద్దలు రాజకీయం చేయడం గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment