మాఫీ డేస్ వచ్చేనా... | Days to forgive myself ... | Sakshi
Sakshi News home page

మాఫీ డేస్ వచ్చేనా...

Published Thu, May 29 2014 11:17 PM | Last Updated on Mon, Oct 1 2018 2:03 PM

మాఫీ డేస్ వచ్చేనా... - Sakshi

మాఫీ డేస్ వచ్చేనా...

  •      2,10,881 మంది రైతుల ఎదురుతెన్నులు
  •      జిల్లాలో మాఫీ చేయాల్సింది రూ.1046 కోట్లు
  •      సాధ్యం కాదంటున్న బ్యాంకర్లు
  •      చెల్లించాలని రైతులపై ఒత్తిడి
  •      నోటీసులు జారీ చేస్తున్న అధికారులు
  •      అన్నదాతలకు నరకయాతన
  •  విశాఖ రూరల్, న్యూస్‌లైన్ : తెలుగుదేశం పార్టీ ఎన్నికల హామీ అయిన రుణ మాఫీ అమలవుతుందా? గద్దెనెక్కేశాం కదా అని హామీని గాలికొదిలేస్తుందా? ప్రస్తుత పరిస్థితుల్లో వేల కోట్ల రుణాలను రద్దు చేసే అవకాశముందా? రాష్ట్ర పరిస్థితి తెలుసుకోకుండానే చంద్రబాబు హామీ ఇచ్చేశారా? లేదా రైతులను మభ్య పెట్టి ఓట్లను రాబట్టుకోవడానికి తప్పుడు హామీలు గుప్పించారా? ఇలా అనేక సందేహాలు అన్నదాతల మెదళ్లను తొలిచేస్తున్నాయి.

    మూడేళ్లుగా ప్రకృతి విపత్తులతో పంటలు నష్టపోయిన రైతులకు రుణ మాఫీ హామీ కొండంత బలాన్నిచ్చింది. టీడీపీకి అధికారం కట్టబెట్టాక ఇప్పుడు దీనిపై రోజుకో ప్రకటనలు చేస్తుండడం పట్ల రైతుల్లో ఆందోళన నెలకొంది. రుణాలను రద్దు చేస్తారన్న ఆశతో రైతులు అప్పులు చెల్లించలేదు. గతేడాది ఖరీఫ్, రబీ సీజన్‌లలో బ్యాంకర్లు మొత్తంగా రూ.1046 కోట్లను రైతులకు రుణంగా ఇచ్చాయి.

    ఈమేరకు రుణ మాఫీ సాధ్యం కాదని,  ఇప్పటి వరకు దానిపై ఎటువంటి నిర్ణయం జరగలేదని,యథావిధిగా చెల్లించాలని రైతులపై ఒత్తిడి తీసుకువస్తున్నాయి. దీంతో రుణ మాఫీ అవుతుందో లేదో తెలియక.. పంట నష్టాలతో పెట్టుబడులు రాక.. తీసుకున్న రుణాలను తిరిగి చెల్లించలేక రైతులు నరకయాతనకు గురవుతున్నారు
     
    రుణమాఫీతో 2,10,881 మందికి లబ్ధి :
     
    గత ఖరీఫ్‌లో జిల్లాలో రూ.600 కోట్లు రుణాలు  లక్ష్యంగా నిర్దేశించారు. 1,32,375 మందికి లక్ష్యాన్ని మించి రూ.640 కోట్లు అందజేశారు.  రబీ 2013-14 సీజన్‌కు రూ.200 కోట్లు లక్ష్యంగా పెట్టుకోగా 14,548 మందికి రూ.104 కోట్లు అప్పులిచ్చారు. జిల్లాలో గతేడాది 3729 మంది కౌలు రైతులకు రుణ అర్హత కార్డులు ఇచ్చినప్పటికీ కేవలం 287 మందికి రూ.56.1 లక్షలను మాత్రమే పంట రుణాల కింద ఇచ్చారు.

    గతేడాది నుంచి ఇప్పటి వరకు పావలా వడ్డీ కింద 7505 రైతులకు రూ.2.65 కోట్లు అందజేశారు. దీంతో పాటు లక్షలోపు రుణం తీసుకొని సకాలంలో చెల్లించిన వారిలో 56,166 మంది రైతులకు రూ.11.73 కోట్లను వడ్డీ లేని రుణాలుగా బ్యాంకుల ద్వారా అందించారు. గతేడాది వరుసగా తుపాన్లు, అల్పపీడనం రావడంతో పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. దీంతో రైతులు పూర్తిగా నష్టపోయారు. ఫలితంగా 10 శాతం మంది రైతులు కూడా రుణాలు చెల్లించలేకపోయారు.
     
    రుణాలు చెల్లించకపోతే నోటీసులు

    తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు ఎన్నికలకు మూడు నెలల ముందు చేపట్టిన పాదయాత్ర నాటి నుంచి రైతుల రుణాలను మాఫీ చేస్తామంటూ హామీలు గుప్పించారు. ఎన్నికల్లో విజయం సాధించాక తొలి సంతకం రుణమాఫీ ఫైలుపైనే చేస్తానని అనేకసార్లు ప్రకటించారు. అసలు ఆ హామీ ఆచరణయోగ్యమో? కాదో? అన్న విషయాన్ని పక్కనపెడితే ఆ ప్రకటన రైతుల్లో ఆశలు రేకెత్తించాయి.

    కానీ ప్రస్తుతం చంద్రబాబు ఆ హామీపై భిన్నమైన ప్రకటనలు చేస్తుండడంతో రైతుల్లో మళ్లీ భయాందోళనలు నెలకొన్నాయి. ఇదిలా ఉంటే సకాలంలో రుణాలు చెల్లించని పక్షంలో నోటీసులు జారీ చేస్తామని బ్యాంకర్లు చెబుతున్నారు. ఇప్పటి వరకు రుణమాఫీపై నిర్ణయం జరగలేదని, ఎటువంటి మార్గదర్శకాలు లేవని యథావిధిగా రుణాలు చెల్లించాల్సిందేనని బ్యాంకులు తెగేసి చెబుతున్నాయి.

    ఈ నెల 8వ తేదీన ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేసే రోజున రుణమాఫీ ఫైలుపై సంతకం చేస్తారో లేదో తేలిపోనుంది. కరువు, వరదలతో పెట్టుబడులు కూడా కోల్పోయిన తమను రుణమాఫీతో ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు.
     
     వెంటనే అమలు చేయాలి
     రుణమాఫీ పథకాన్ని వెంటనే అమలు చేయాలి. ఎన్నికలలో ఇచ్చిన హామీ మేరకు టీడీపీ ప్రభుత్వం రైతు రుణాలను మాఫీ చేయాలి. ప్రకటన కోసం వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్నాం. ఖరీఫ్ సాగుకు పెట్టుబడులు లేక దిక్కుతోచని స్థితిలో ఉన్నాం. ప్రస్తుతం బ్యాంక్‌లలో ఉన్న రుణాలన్నింటిని మాఫీ చేస్తేనే రైతులు ఆర్థికంగా నిలదొక్కుకొని పంటలు సాగు చేసుకునే అవకాశం ఉంటుంది.
     - అప్పలస్వామి నాయుడు, రైతు, వెంకుపాలెం
     
     మాఫీ చేస్తేనే బతుకు
     నాది అచ్యుతాపురం మండలం పెదపాడు. సహకార బ్యాంకులో రూ. 5వేలు, ఇతర బ్యాంకుల్లో రూ.25 వేలు వ్యవసాయ రుణంగా తీసుకున్నాను. వడ్డీతో రూ. 70వేలు అయింది. రానున్న ఖరీఫ్‌కు పెట్టుబడి లేదు. అప్పు తీరిస్తేనే బ్యాంకర్లు మళ్లీ రుణం ఇస్తామంటున్నారు. టీడీపీ రుణమాఫీ హామీ అమలవుతుందోలేదో? పాత రుణాలు మాఫీ అయి కొత్తగా రుణాలు ఇస్తేనే బతుకు. లేదంటే కష్టమే.      
     - బండి అప్పారావు
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement