కర్నూలు(అగ్రికల్చర్): ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలకు అధికారంలోకి రాగానే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పెడార్థం తీస్తున్నారు. తమ పార్టీని గెలిపిస్తే వ్యవసాయ రుణాలతో పాటు డ్వాక్రా రుణాలను మాఫీ చేస్తానన్న ఆయన.. మూడు నెలల కాలయాపన తర్వాత కొర్రీలు వేస్తున్నారు. మెలికలు పెడుతూ రుణ మాఫీకి పలువురిని దూరం చేస్తున్నారు. బ్యాంకుల నుంచి రుణాలు తీసుకున్న గడువును డిసెంబర్ 31, 2013 నాటికే పరిమితం చేయడం పట్ల తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది.
2013-14 రబీ సీజన్‌కు సంబంధించి జనవరి, ఫిబ్రవరి, మార్చి నెలల్లో వేలాది మంది రైతులు రుణాలు తీసుకున్నారు. బాబు తీరుతో జిల్లాలో దాదాపు 25వేల మందికి రైతులకు మాఫీ వర్తించని పరిస్థితి నెలకొంది. తెలంగాణ తరహాలోనే ఇక్కడా ఈ ఏడాది మార్చి 31లోపు తీసుకున్న రుణాలన్నింటినీ మాఫీ చేయాలనే డిమాండ్ తెరపైకి వస్తోంది. ఇదిలాఉంటే కుటుంబంలోని సభ్యులంతా అన్ని బ్యాంకుల్లో తీసుకున్న రుణాలు వడ్డీతో కలిపి రూ.1.50 లక్షలు మాత్రమే మాఫీ చేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది.
ఆ మేరకు ఈనెల 14న జీవో నెంబర్ 174 జారీ చేసింది. ఈ మొత్తంతో రైతు కుటుంబాలకు చేకూరే ప్రయోజనం అంతంతమే అనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. వ్యవసాయ రుణాల మాఫీ మార్గదర్శకాలు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలకు అనుగుణంగా లేవని రైతులు అగ్గి మీద గుగ్గిలం అవుతున్నారు. ఇక మహిళల డ్వాక్రా రుణాలన్నింటినీ మాఫీ చేస్తానని ఎన్నికల సందర్భంగా ప్రకటించిన చంద్రబాబు.. రుణాలను చెల్లించొద్దని కూడా నమ్మబలికారు.
ఆయన మాటలతో గత ఏప్రిల్ నుంచి మహిళలు రుణాలను చెల్లించడం మానేశారు. అధికారంలోకి రాగానే డ్వాక్రా రుణాల మాఫీ లేదని.. సంఘానికి రూ.లక్ష రివాల్వింగ్ ఫండ్ మాత్రమే ఇస్తామని ప్రకటించడం మహిళలను నిరాశకు గురిచేస్తోంది. ఈ లక్ష కూడా ఎప్పుడిస్తారనే విషయంలో స్పష్టత కరువైంది. ముఖ్యమంత్రి ప్రకటనే తరువాయి.. మహిళల నుంచి వడ్డీ, అసలు వసూలు చేయాలని సెర్ఫ్ ఆదేశించింది. ఇప్పటికే ఐకేపీ సిబ్బంది మహిళలపై ఒత్తిళ్లు తీసుకొస్తుండటం గమనార్హం.
చెప్పిందొకటి.. చేసిందొకటి
Published Mon, Aug 18 2014 2:31 AM | Last Updated on Tue, Aug 14 2018 4:39 PM
Advertisement
Advertisement