సన్న బియ్యం..ధర భారం
కొత్తగూడెం: ఖరీఫ్ కలిసి వచ్చేలా లేదు..రబీ సీజన్‌లో రైతుల వద్ద ఉన్న ధాన్యం పూర్తిగా నిండుకున్నాయి. ఇక బియ్యం ధరలకు రెక్కలు వస్తున్నాయి. వారం రోజుల వ్యవధిలోనే క్వింటాల్‌కు రూ.200 మేరకు బియ్యం ధరలను వ్యాపారులు పెంచేశారు. ఖరీఫ్‌లో వర్షాలు సక్రమంగా కురవకపోతే ఈ రెండు నెలల్లో కిలో బియ్యం ధర రూ.70కి చేరవచ్చని వ్యాపారులు అంటున్నారు. జిల్లాలోని రైస్ మిల్లుల వద్ద స్టాక్ లేకపోవడం, నల్లగొండ జిల్లా నుంచే అధికంగా బియ్యం ఇక్కడకు సరఫరా అవుతుండటంతో అక్కడి బడా వ్యాపారులు ఇష్టారాజ్యంగా ధరలు పెంచుతున్నారు.
గత ఏడాది డిసెంబర్ నెలలో ఖరీఫ్ సీజన్‌కు సంబంధించిన బియ్యం మార్కెట్‌లోకి వచ్చాయి. అప్పటి వరకు సన్నబియ్యం మొదటిరకం రూ.40ల వరకు ఉన్న ధరను రూ.38కి తగ్గించి వేశారు. ఆ తర్వాత ఫిబ్రవరి నెల నుంచి బియ్యం ధరలు ఎగిసి పడుతున్నాయి. జిల్లాలోని మిల్లుల్లో స్టాక్ అయిపోవడం, గత ఏడాది ఖరీఫ్ సీజన్‌కు సంబంధించిన ధాన్యం ఎక్కువగా నల్లగొండ జిల్లాలోని మిర్యాలగూడ, కోదాడకు చెందిన వ్యాపారులు అధికంగా కొనుగోలు చేయడంతో ప్రస్తుతం ఆ జిల్లా నుంచే బియ్యం ఎక్కువగా జిల్లా మార్కెట్‌కు వస్తున్నాయి. అక్కడకు చెందిన బడా వ్యాపారులు ప్రస్తుత పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని ధరలను ఏకపక్షంగా పెంచేస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదనే విమర్శలున్నాయి.
ఏడునెలల్లో రూ.12 పెంపు..
గత ఏడాది వర్షాలు సకాలంలో కురవడం, ఖరీఫ్‌లో సాంబమసూరి ధాన్యం దిగుబడి ఎక్కువగా ఉండటంతో డిసెంబర్‌లో రూ.38 ఉన్న కిలో బియ్యం ఇప్పుడు రూ.50కి చేరింది. రైతుల వద్ద ధాన్యం పూర్తిగా అయిపోవడం, వ్యాపారులు కొనుగోలు చేసిన ధాన్యం సైతం చివరి దశకు చేరుకోవడంతో అమాంతం ధర పెరిగిపోయింది. బియ్యం ధరలు ఇలాగే పెరుగుతూ పోతే తమ పరిస్థితి ఏమిటని పేద, మధ్యతరగతి వర్గాలు ఆందోళన చెందుతున్నాయి. నల్లగొండ జిల్లా నుంచి మాత్రమే బియ్యం దిగుమతి ఉండటంతో వ్యాపారులు ధరలు పెంచి విక్రయాలు చేస్తున్నారు. అదే మన జిల్లాలో అందుబాటులో ఉంటే ఒకటి, రెండు రూపాయలైనా తక్కువగా ఉండేదని పలువురు అంటున్నారు. ఒకవేళ వర్షాలు వస్తే ఖరీఫ్ సీజన్ ముగిసే సమయానికి కాని ధాన్యం అందుబాటులోకి రాదు. లేనిపక్షంలో ఈ బియ్యం ధరలకు అడ్డూఅదుపు ఉండదని వాపోతున్నారు.
రైస్‌మిల్లులకూ గడ్డుకాలం..
దళారులంతా నల్లగొండ జిల్లాలోని రైస్ మిల్లులకు ధాన్యం విక్రయించారు. స్థానికంగా ఉన్న రైస్ మిల్లుల్లో స్టాక్ లేదు. మిల్లులు మూసుకోవాల్సిన పరిస్థితి వచ్చేసింది. జిల్లాలోని తల్లాడలో 12 పారా బాయిల్‌రైస్ మిల్లులు ఉండగా అందులో నాలుగు మిల్లులు ఇప్పటికే మూత పడ్డాయి. కొత్తగూడెంలో ఎనిమిది రైస్ మిల్లులు ఉండగా అందులో నాలుగు మిల్లులు, పాల్వంచలో రెండు మిల్లులు మూతపడ్డాయి. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే మరిన్ని మిల్లులు మూతపడే అవకాశాలు లేకపోలేదు.
అధికారులు స్థానికంగా ఉన్న మిల్లులకు ధాన్యం తరలించేందుకు చర్యలు చేపట్టడంలో విఫలం కావడంతోనే ఈ పరిస్థితి వచ్చిందని పలువురు ఆరోపిస్తున్నారు. నల్లగొండ జిల్లా దళారులు ఇష్టారాజ్యంగా ధాన్యం కొనుగోలు చేసినా అధికారులెవరూ పట్టించుకోకపోవడం మరో కారణంగా చెప్తున్నారు. గత ఏడాది బియ్యం ధరలు పెరగడంతో హడావిడిగా కౌంటర్లు ఏర్పాటు చేసిన అధికారులు రూ.30లకే సన్నబియ్యాన్ని అందించారు. బయట మార్కెట్‌లో ధరలు ఎక్కువగా ఉండటం, కౌంటర్ల ద్వారా విక్రయించేందుకు తగ్గించిన ధర ప్రకారం తమకు బియ్యం ఇవ్వకపోవడంతోనే నష్టపోవాల్సి వచ్చిందని వ్యాపారులు పేర్కొంటున్నారు. తమకు కూడా సబ్సిడీ ఇస్తే ఈ పరిస్థితి వచ్చి ఉండేదికాదని వ్యాపారులు అంటున్నారు.
పెరిగిన బియ్యం ధరలివే...
బియ్యం ప్రస్తుతం కేజీ రూ.50 వరకు ఉంది. గత ఆరు నెలల కాలంలో రూ.22 వరకు బియ్యం ధర పెరగడం విశేషం.