రబీకి పూర్తిగా నీరు | Difference between Kharif crops and Rabi crops | Sakshi
Sakshi News home page

రబీకి పూర్తిగా నీరు

Published Mon, Nov 10 2014 1:03 AM | Last Updated on Sat, Sep 2 2017 4:09 PM

రబీకి పూర్తిగా నీరు

రబీకి పూర్తిగా నీరు

 ఏలూరు :రానున్న రబీ సీజన్‌లో పంటలకు నూరుశాతం సాగునీరు అందించాలని జిల్లా నీటిపారుదల సలహామండలి (ఐఏబీ) సమావేశం తీర్మానించింది. గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని సాధ్యాసాధ్యాలను మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులు సమగ్రంగా చర్చించి నీరందించడానికి ముందుకు వచ్చారు. జిల్లా పరిషత్ సమావేశం మందిరంలో ఐఏబీ సమావేశం కలెక్టర్ కాటంనేని భాస్కర్ అధ్యక్షతన ఆదివారం సాయంత్రం జరిగింది. ఇందులో ప్రజాప్రతినిధులు కూలంకషంగా చర్చించాకే పూర్తి ఆయకట్టుకు 4.60 లక్షల ఎకరాలకు సాగునీటిని ఎట్టి పరిస్థితుల్లోను ఇచ్చి తీరాలని తీర్మానించారు. ఇంకా పలు తీర్మానాలను కూడా సమావేశంలో ఆమోదించారు.  అయితే జిల్లాకు చెందిన మంత్రులు పీతల సుజాత, పైడికొండల మాణిక్యాలరావులు కొన్ని విషయాల్లో భిన్నంగా స్పందించినప్పటికీ చివరకు అందరికీ న్యాయం చేసే నిర్ణయాలనే ఆమోదించారు. చేపల చెరువుల రైతులకు
 
 ముందుగానే నీరందించాలని, డి సెంబర్ 31 నాటికి నాట్లు పూర్తి చేయాలని, మార్చి నెలాఖరు నాటికి పంటలు పూర్తిస్థాయిలో చేతికొచ్చేలా రైతులకు అవగాహన కల్పించే దిశగా వివిధ శాఖల అధికారుల సమన్వయంతో వ్యవహరించాలని నిర్ణయించారు. మార్చి నెలాఖరు నుంచి కాల్వలు కట్టేసే కాలం నుంచి జూన్ 15లోగా డెల్టా ఆధునికీకరణ పనులను వేగవంతం చేసేలా చర్యలు తీసుకోవాలని తీర్మానించారు. నీటి యాజమాన్య పద్ధతులను అవలంబించడానికి, నీటి సరఫరా పర్యవే క్షించడానికి తాత్కాలిక ప్రాతిపదికన నాలుగు నెలలకు లస్కర్లను నియమించాలని, అవసరమైన చోట్ల షట్టర్లకు మరమ్మతు చేయాలని నిర్ణయించారు.
 
 సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను కలెక్టర్ కాటంనేని భాస్కర్ వివరిస్తూ రెవెన్యూ, పోలీస్, వ్యవసాయ, మత్స్యశాఖ, ఇరిగేషన్‌శాఖలు సంయుక్తంగా రబీ నీటి సరఫరాలో పకడ్బందీగా వ్యవహరించాలని ఆదేశించారు. లస్కర్లను స్థానికంగా ఉన్నవారినే నియమించేలాగా, కృష్ణా డెల్టాకు సాగునీటిని పూర్తిస్థాయిలో ఇచ్చేలా ఆ జిల్లాలో జరిగే సమావేశంలో తగు నిర్ణయం తీసుకునేలా ప్రతిపాదిస్తూ తీర్మానం చేశారు. సీజన్‌లో ప్రతి వారం నీటి సరఫరా, ఇతర సమస్యలపై అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహిస్తామన్నారు. ఈ సమావేశంలో ఎంపీలు గోకరాజు గంగరాజు, మాగంటిబాబు, ఎమ్మెల్యేలు బడేటి కోటరామారావు (బుజ్జి), పులవర్తి అంజిబాబు, నిమ్మల రామానాయుడు, జేసీ టి.బాబూరావునాయుడు, డీఆర్వో కె.ప్రభాకర్‌రావు, ఇరిగేషన్ ఈఈలు జి. శ్రీనివాస్, ఎం.రామ్‌ప్రసాద్, ఆర్డీవోలు పాల్గొన్నారు.
 
 మాకు తెలియకుండా ప్రతిపాదనలా?
 చింతమనేని ఫైర్
 జిల్లాలో 1406 చిన్నతరహా చెరువులను రూ.160కోట్లతో అభివృద్ధి చేయాలన్న అంశంపై ఎమ్మెల్యేలకు తెలియకుండా ప్రతిపాదనలను ఎలా పంపుతారని ఇరిగేషన్ ఎస్‌ఈ డోల తిరుమలరావుపై ప్రభుత్వ విప్ చింతమనేని ప్రభాకర్ మండిపడ్డారు. దీనిపై ఎస్‌ఈ వివరణ ఇస్తూ వారంలోగానే ప్రతిపాదనలను ఇవ్వాలని కోరడంతో దానికి అనుగుణంగా అంచనాలను వేసి పంపామని చెప్పారు. దీనిపై విప్ వాదన పెంచుతుండడంతో కల్పించుకున్న మంత్రి పీతల సుజాత వారిద్దరినీ వారించారు. పంపేముందే చెప్పలేని అధికారులు సమావేశం ముందు అయినా పరిస్థితిని వివరించి ఉంటే వాదన జరిగేది కాదని, ఇక ముందైనా ఎమ్మెల్యేలతో చర్చించాక పంపాలని ఆమె సూచించారు.
 
 సమస్యలపై ఎమ్మెల్యేలు ఏకరువు
 ఉంగుటూరు ఎమ్మెల్యే గన్ని వీరాంజనేయులు మాట్లాడుతూ గుండుగొలను- బాదంపూడిల మధ్య పాడైన షట్టర్లను యుద్దప్రాతిపదికన బాగు చేయాలన్నారు. ఉండి ఎమ్మెల్యే వేటుకూరి శివ రామరాజు మాట్లాడుతూ నీటి సంఘాలకు ఎన్నికలు జరపాలని, నీటితీరువా వసూళ్లను స్థానికంగా ఇరిగేషన్‌శాఖ ఆధ్వర్యంలో ఖర్చు పెట్టేలా తీర్మానాలు చేయాలన్నారు. నిడదవోలు ఎమ్మెల్యే బి శేషారావు మాట్లాడుతూ ప్రతి చిన్నపనికి ఇరిగేషన్‌శాఖ సీఈ స్థాయిలోకి ప్రతిపాదనలు పంపినా మోక్షం కలగడం లేదని, ఆపరేషన్, నిర్వహణ గ్రాంట్ మన దగ్గరే ఉండేలా చూడాలన్నారు.
 
 కొవ్వూరు ఎమ్మెల్యే కెఎస్ జవహర్ తన నియోజకవర్గంలో కాల్వలు, డ్రెయిన్ల అబివృద్ధి విషయంలో చిన్నచూపు చూస్తున్నారన్నారు. జెడ్పీ చైర్మన్ ముళ్లపూడి బాపిరాజు, గోపాలపురం ఎమ్మెల్యే మొడియం శ్రీనివాస్‌లు  మాట్లాడుతూ తాడిపూడి ఎత్తిపోతల పథకం కింద 1.54 లక్షల ఎకరాలు నీరందిస్తున్న మాట వాస్తవం కాదంటూ అక్కడి ఎస్‌ఈ ఎన్వీ రమణను నిలదీశారు. దీనిపై గ్రామం, మండల వారీగా ఇస్తున్న నీటి వివరాలను తనకు సమర్పించాలని కలెక్టర్ ఎస్‌ఈని ఆదేశించారు. ఇరిగేషన్ ఛీప్ ఇంజనీర్ మాట్లాడుతూ లస్కర్లను తాత్కాలిక పద్ధతిలో తీసుకునేందుకు తూర్పు, పశ్చిమగోదావరి జిల్లాల్లోని సమస్యలను మంత్రి దేవినేని ఉమ దృష్టికి తీసుకెళ్లామన్నారు. తాత్కాలికంగా వీరితో పనిచేయిస్తామని, శాశ్వత ప్రాతిపదికన అయితే సీఎంకు పంపాల్సి ఉంటుందన్నారు. ఇరిగేషన్ ఎస్‌ఈ డోల తిరుమలరావు మాట్లాడుతూ నీటికొరత వల్ల ఎర్రకాల్వ కింద 16 వేల ఎకరాలు, తమ్మిలేరులో 4,500 ఎకరాలకు సాగునీరు ఇవ్వలేమన్నారు.
 
 శ్రద్ధ వహిస్తే పూర్తి ఆయకట్టుకు నీరివ్వగలం
 మంత్రి మాణిక్యాలరావు
 జిల్లాలో నీటి లభ్యత తక్కువగా ఉన్న రోజుల్లోనే పూర్తిస్థాయిలో నీరిచ్చిన సందర్భాలున్నాయి. లస్కర్లను ఏర్పాటు చేసి షట్లర్లకు మరమ్మతులు చేస్తే నీటి వృథాను అరికట్టవచ్చు. నీటి పంపిణీ విధానంలో మార్పులు చేయాల్సి ఉంది. మెరక భూములకు ఆయిల్ ఇంజిన్లు పెట్టి నీరు తోడాలి. ఈ విషయలో నీటి సంఘాల మాజీ అధ్యక్షులు, సభ్యుల సలహాలను తీసుకోవాలి. నాట్లను డిసెంబర్ 31నాటికి పూర్తి చేసేలా రైతుల్లో విస్త­ృత ప్రచారం చేయాలి. చేపల చెరువుల రైతులకు నీరిచ్చేది లేనిదీ ముందుగానే తెలపాలి. ఈ విషయాలపై అందరు శ్రద్ధ తీసుకుంటే పూర్తి ఆయకట్టుకు సాగునీరందించడం కష్టం కాదు.
 
 రబీ పంటకు శివారు ప్రాంతాల్లో వంతులవారీ విధానం
 మంత్రి పీతల సుజాత
 జిల్లాలో రబీ పంటకు పూర్తిస్థాయిలో నీరందిస్తామని సీఎం చంద్రబాబు, ఇరిగేషన్ మంత్రి దేవినేని ఉమలు హామీ ఇచ్చారు. శివారు ప్రాంతాల్లో నీటి ఎద్దడి తలెత్తితే వంతుల వారీ విధానంలో సరఫరా చేయాలి. పంటలు ఎండిపోయే పరిస్థితి రాకుండా సీలేరు జలాలను మళ్లించి రక్షించి తీరుతాము. తమ్మిలేరు, ఎర్ర కాల్వల కింద సాగుకు నీరివ్వాలి. మైనర్ ఇరిగేషన్ చె రువుల అభివృద్ధికి వాటర్ కన్జర్వేషన్ నిధులను సమీకరించాలి. ఆర్‌డబ్ల్యూఎస్, పబ్లిక్ హెల్త్ అధికారులు కాల్వలు నీరు కట్టేసేలోగానే అన్ని మంచినీటి చెరువులను పూర్తిస్థాయిలో నింపుకునేలా చర్యలు చేపట్టాలి. డె ల్టా ఆధునికీకరణ కింద చేపట్టే పనులను పూర్తిస్థాయిలో అందరి ప్రజాప్రతినిధులకు వివరాలను సమర్పించాలి. ధవళేశ్వరం ర్యాంపుల్లో పూడికతీతలను అక్కడి ఎస్‌ఈ పర్యవేక్షించాలి.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement