
ఆగస్టు 15 నుంచి ఫుల్ కరెంట్!
♦ వ్యవసాయానికి 24 గంటల విద్యుత్ సరఫరా
♦ తొలుత ఒక జిల్లాలో అమలు
♦ క్రమంగా మిగతా జిల్లాలకు..
సాక్షి, హైదరాబాద్: స్వాతంత్య్ర దినోత్సవం కానుకగా ఆగస్టు 15 నుంచి వ్యవసాయానికి 24 గంటల విద్యుత్ సరఫరాను రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించబోతోంది. ఒక జిల్లాలో ప్రయోగాత్మకంగా మొదలుపెట్టి.. తర్వాత మిగతా జిల్లాలకూ విస్తరించనుంది. రబీ సీజన్ ప్రారంభమయ్యే అక్టోబర్‌లోగా రాష్ట్రవ్యాప్తంగా వ్యవసాయానికి 24 గంటల విద్యుత్ సరఫరా చేయనుంది. ఈ మేరకు ట్రాన్స్‌కో, డిస్కంలు ఏర్పాట్లు చేస్తున్నాయి.
శరవేగంగా ఏర్పాట్లు..
గతంలో పంటలకు గరిష్టంగా ఏడు గంటల విద్యుత్ సరఫరా చేసేవారు. రాష్ట్ర ప్రభుత్వం ఏడాది కాలంగా పగటి పూటే 9 గంటల విద్యుత్ సరఫరా చేస్తోంది. తాజాగా సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు.. వచ్చే రబీ నుంచి విద్యుత్ సరఫరాను 24 గంటలకు పెంచేందుకు ట్రాన్స్‌కో, డిస్కంలు ఏర్పాట్లు చేస్తున్నాయి. రూ.1,000 కోట్ల వ్యయంతో కొత్త లైన్లు, సబ్‌స్టేషన్లు, ట్రాన్స్‌ఫార్మర్లు, ఇతర మౌలిక సదుపాయాలను సిద్ధం చేస్తున్నాయి. టీఎస్‌ఎస్పీడీసీఎల్, టీఎస్‌ఎన్పీ డీసీఎల్ తొలుత తమ పరిధిలోని ఒక్కో పాత జిల్లా పరిధిలో ఆగస్టు 15 నుంచి పంటలకు 24 గంటల విద్యుత్‌ను సరఫరాను ప్రారంభించనున్నాయి.
రాష్ట్రంలో 23 లక్షల వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లుండగా.. 24 గంటల సరఫరాతో విద్యుత్ డిమాండ్ బాగా పెరుగుతుందని అంచనా. 24 గంటల సరఫ రాతో వ్యవసాయ విద్యుత్ డిమాండ్ 5 వేల మెగావాట్లకు పెరుగుతుందని.. మొత్తంగా రాష్ట్ర విద్యుత్ డిమాండ్ 10,000 మెగావా ట్లను మించనుందని డిస్కంలు అంచనా వేశాయి. ఈ మేరకు విద్యుత్‌ను సమీకరణకు చర్యలు తీసుకుంటున్నాయి. ఇక వ్యవసాయ విద్యుత్ సరఫరాను 24 గంటలకు పెంచితే డిస్కంలపై అదనంగా ఏటా రూ.1,000 కోట్ల భారం పడుతుందని అధికారులు భావిస్తు న్నారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ సబ్సిడీల రూపంలో ఈ భారాన్ని భరించనుంది.