రబీ సీజన్ కోసం వ్యవసాయ శాఖ అధికారులు సబ్సిడీ వేరుశనగ విత్తనాల కోటాను మండలాల వారీగా కేటాయించారు.
తాండూరు: రబీ సీజన్ కోసం వ్యవసాయ శాఖ అధికారులు సబ్సిడీ వేరుశనగ విత్తనాల కోటాను మండలాల వారీగా కేటాయించారు. బహిరంగ మార్కెట్‌లో వేరుశగన విత్తనం ధర కన్నా సబ్సిడీ విత్తనం ధర అధికంగా ఉండటంతో కొనుగోలుకు రైతులు పెద్దగా ఆసక్తి చూపడం లేదు. దీనికి తోడు రైతులకు అవసరమైన సమయంలో విత్తనం అందుబాటులో లేకపోవడం ఇందుకు మరో కారణం.
ఈ ఏడాది సెప్టెంబర్‌లో ఇక్కడ మోస్తరుగా వర్షాలు పడ్డాయి. భూమి తడిగా ఉండటంతో రైతులు వేరుశనగ పంట సాగుకు సిద్ధమయ్యారు. ఈ క్రమంలో డీసీఎంఎస్‌కు సబ్సిడీ విత్తనాలు ఇంకా రాలేదు. దాంతో రైతులు మహబూబ్‌నగర్‌తోపాటు కర్ణాటక తదితర బయట ప్రాంతాల నుంచి విత్తనాన్ని కొనుగోలు చేసి, పంట సాగు చేశారు. వ్యవసాయ శాఖ మాత్రం గత అక్టోబర్ 13వ తేదీ నుంచి డీసీఎంఎస్‌లో సబ్సిడీ విత్తనాలను అందుబాటులోకి తీసుకువచ్చింది. తాండూరు ప్రాంతంలో సుమారు నాలుగు వేల ఎకరాల్లో రైతులు వేరుశనగ పంటను సాగు చేస్తున్నారు.
కోట్‌పల్లి, మంబాపూర్, యాలాల మండలాల్లో ఈ పంటను అధికంగా సాగు చేస్తారు. అప్పటికే చాలా మంది రైతులు విత్తనాలను ఇతర జిల్లాల నుంచి కొనుగోలు చేసి పంట సాగు చేశారు. ఫలితంగా సబ్సిడీ విత్తనాలు వచ్చినా కొనుగోలుకు రైతులు ముందుకు రావడం లేదు. సబ్సిడీ వేరుశనగ అసలు ధర క్వింటాలుకు రూ.6వేలు కాగా సబ్సిడీ రూ.2వేలు మినహాయించి రైతులు క్వింటాలుకు రూ.4వేలు చెల్లించాల్సి ఉంటుంది. అయితే రైతులకు బయట మార్కెట్‌లో రూ.3500-రూ.3700లకే వేరుశనగ విత్తనాలు లభిస్తుండడంతో వారు అటు వైపు మొగ్గుచూపారు.
సబ్సిడీ విత్తనం పాతది అయినందుకే కొనుగోలుకు ఆసక్తి కనబర్చలేదనే అభిప్రాయం పలువురు రైతుల్లో వ్యక్తమవుతోంది. నెల రోజులు అవుతున్నా వచ్చిన విత్తనాల కోటాలో అరకొరగానే అమ్మకాలు జరిగాయి. మిగితా నిల్వలు గోదాంకే పరిమితమయ్యాయి. ఎక్కువ కాలం నిల్వ ఉంటే విత్తనాలకు పురుగు పట్టి నష్టం జరిగే ప్రమాదం ఉంది. మరి అధికారులు విత్తనాలను ఏం చేస్తారో చూడాలి.
273 క్వింటాళ్లే అమ్మకం..
తాండూరు నియోజకవర్గంలోని తాండూరు, యాలాల,బషీరాబాద్,పెద్దేముల్ మండలాలకు మొత్తం 4,900 క్వింటాళ్ల విత్తనాల కోటాను వ్యవసాయ శాఖ కేటాయించిందని తాండూరు డీసీఎంఎస్ మేనేజర్ షరీఫ్ చెప్పారు. ఇందులో 809 క్వింటాళ్ల కోటా ఈ ఏడాది అక్టోబర్ రెండో వారంలో డీసీఎంఎస్ గోదాంకు వచ్చిందని వివరించారు. కోటా వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు వివిధ గ్రామాల చెందిన రైతులు 273 క్వింటాళ్ల విత్తనాలను కొనుగోలు చేశారని ఆయన చెప్పారు. మిగితా విత్తనాలు గోదాంలో నిల్వ ఉన్నాయి.