విలేకరులతో మాట్లాడుతున్న జేడీఏ మాధవి శ్రీలత
88 వేల క్వింటాళ్ల విత్తనాలకు ప్రతిపాదనలు
సీజన్ ప్రారంభం కాగానే పంపిణీ
త్వరలో రూ.197.97కోట్ల ఇన్‌పుట్ సబ్సిడీ
భారీ వర్షాలకు 41,826 హెక్టార్లలో పంట నష్టం
జేడీఏ మాధవి శ్రీలత
నారాయణఖేడ్: రబీ సీజన్‌కు శాఖాపరంగా సన్నద్ధమైనట్టు వ్యవసాయ శాఖ జిల్లా సంచాలకులు మాధవి శ్రీలత తెలిపారు. గురువారం ఆమె నారాయణఖేడ్ వచ్చిన సందర్భంగా విలేకరులతో మాట్లాడారు. జిల్లాలో 88 వేల క్వింటాళ్ల వివిధ రకాల విత్తనాల కోసం ప్రభుత్వానికి ప్రతిపాదించామని, అవి త్వరలో రానున్నాయని చెప్పారు. ఇందులో భాగంగా 25 వేల క్వింటాళ్ల శనగ, 8 వేల క్వింటాళ్ల మొక్కజొన్న, 25 వేల క్వింటాళ్ల మినుము, 1,100 క్వింటాళ్ల జొన్న, 2 వేల క్వింటాళ్ల పెసర, 25 వేల క్వింటాళ్ల వరి, 2 వేల క్వింటాళ్ల వేరుశనగ విత్తనాలు ప్రతిపాదించినట్టు తెలిపారు.
30 శాతం సబ్సిడీపై విత్తనాలు
ఈ విత్తనాలను 30శాతం సబ్సిడీపై రైతులకు అందజేస్తామని జేడీ తెలిపారు. రబీ సీజన్‌లో సాధారణ సాగు విస్తీర్ణం పెరిగే అవకాశం ఉందన్నారు. 1.39 లక్షల హెక్టార్ల మేర సాగు కావాల్సి ఉంగా మరో 40 వేల హెక్టార్లు అదనంగా సాగయ్యేందుకు అవకాశం ఉన్నట్లు అంచనా వేస్తున్నామన్నారు. రబీ సీజన్ ప్రారంభం కాగానే విత్తనాలు, ఎరువులు సిద్ధంగా ఉంచుతామని, ప్రస్తుతం భూమిలో తేమ తగ్గాల్సి ఉందన్నారు.
ఖరీఫ్‌లో పంటలకు దెబ్బ
భారీ వర్షాల కారణంగా జిల్లాలో వివిధ రకాల పంటలు 41,826 హెక్టార్ల మేర నష్టం జరిగినట్టు ప్రాథమికంగా అంచనా వేసినట్టు జేడీ తెలిపారు. వరి 4,902 హెక్టార్లు, మొక్కజొన్న 1,539, జొన్న 377, పత్తి 16,827, చెరకు 251, కంది 2,587, పెసర 12, మినుము 742, సోయా 14,588 హెక్టార్లలో దెబ్బతిన్నట్టు ఆమె పేర్కొన్నారు. వర్షాలు, వరదల కారణంగా సోయా పంటకు ఎక్కువ నష్టం వాటిల్లిందన్నారు. వరి పొలాల్లో ఇసుక మేటలతో దెబ్బతిందని, మొక్కజొన్న కంకులు కోశాక తడిసి మొలకలు వచ్చాయన్నారు. కందికి ఎక్కువగా నష్టం జరగలేదన్నారు. పంటనష్టాలపై క్షేత్రస్థాయి సర్వే నిర్వహిస్తున్నామని, నివేదిక రాగానే ప్రభుత్వానికి ప్రతిపాదిస్తామని చెప్పారు.
చిన్నశంకరంపేటలో అత్యధిక వర్షం
జిల్లాలో అత్యధికంగా చిన్నశంకరంపేట మండలంలో వర్షపాతం నమోదైందని జేడీ తెలిపారు. మండలంలో 779 మి.మీ సాధారణం కాగా 1,362 మి.మీ. కురిసిందన్నారు. జిల్లాలోని రైతులకు త్వరలో ఇన్‌పుట్ సబ్సిడీ రానుందన్నారు. రూ.197.97 కోట్లు రావాల్సి ఉందన్నారు. జిల్లాలో అత్యధికంగా వర్షపాతం సెప్టెంబర్‌లో నమోదైందని, ఆగస్టులో లోటు ఉందన్నారు. విలేకరుల సమావేశంలో అగ్రోస్ ఆర్‌ఎం వెంకన్న పాల్గొన్నారు.