దోమ/ షాబాద్, న్యూస్‌లైన్: బోర్లలో, బావుల్లో సమృద్ధిగా నీరుంది. దీంతో రైతులు పెట్టుబడికి అప్పులు చేసి సాగు మొదలుపెట్టారు. కానీ అప్రకటిత విద్యుత్ కోతలు వారిని నిలువునా ముంచుతున్నాయి. వేసవి ప్రారంభం కాకముందే సరఫరా వేళలను తగ్గించారని, ఆరు గంటలు ఇస్తామని మూడు గంటలు కూడా ఇవ్వడంలేదని రైతులు ఆరోపిస్తున్నారు. దోమ మండల పరిధిలోని ఆయా గ్రామాల రైతులు రబీ సీజన్‌లో వరి, వేరుశనగ తదితర పంట లను అధిక విస్తీర్ణంలో సాగు చేశారు. ముఖ్యంగా వరి నీరందక ఎండుముఖం పడుతోంది. పలు గ్రామాల్లో వేరుశనగ పంటకు కూడా చివరి విడత తడి పెట్టా ల్సి ఉంది. విద్యుత్ కోతల కారణంగా ఈ పంటలు ఎండే పరిస్థితి ఏర్పడింది.
అర్ధరాత్రి సరఫరా
అధికారులు బోరుబావులకు ఇస్తున్న కొద్దిపాటి విద్యుత్‌ను కూడా రాత్రి వేళ ఇస్తున్నారు. దోమ సబ్‌స్టేషన్ కింద నాలుగు ఫీడర్లు ఉండగా ఊట్‌పల్లి, నాచారం ఫీడర్ల పరిధి గ్రామాలకు రాత్రి 9 - 12 గంటల మధ్య, తిరిగి ఉదయం 6 - 9గంటల మధ్య ఇస్తున్నారు. ఇక పాలేపల్లి, బాస్పల్లి ఫీడర్ల కింది పంట లకు తెల్లవారుజామున 3- 6 గంటల మధ్య, తిరిగి ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12గంటల మధ్య విద్యుత్ సరఫరా చేస్తున్నారు. దిర్సంపల్లి, గుండాల్ సబ్‌స్టేషన్ల పరిధిలో ఉన్న ఫీడర్ల కింది పంటలకూ ఇదే తరహా వేళలు. అయితే పేరుకు మాత్రమే ఆరు గంటలని చెబుతున్న అధికారులు పగలు, రాత్రి కలిపి మొత్తం మూడు గంటలే విద్యుత్ సరఫరా చేస్తున్నారు. అది కూడా నిరంతరంగా కాదు.
విద్యార్థులకు, చిరువ్యాపారులకూ ఇబ్బందే
విద్యుత్ కోతలతో రైతులే కాకుండా విద్యార్థులు, చిరువ్యాపారులు సైతం ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇంటర్, టెన్త్ పరీక్షలు దగ్గరపడుతుండడం, విద్యుత్ కోతలు రోజురోజుకూ అధికమవుతుండడంతో పరీక్షల ప్రిపరేషన్‌కు ఆటంకం ఏర్పడుతోంది. ఉదయం వేళల్లో గంటల తరబడి కోతలు విధిస్తుండడంతో జిరాక్స్ సెంటర్లు, సామిల్లులు, మెకానిక్ దుకాణాల నిర్వాహకులు ఇబ్బంది పడుతున్నారు.
లోఓల్టేజీతో కాలిపోతున్న మోటార్లు
షాబాద్ మండలంలో లోఓల్టేజీ సమస్య రైతులను వేధిస్తోంది. తరచూ మోటార్లు కాలి పోతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇచ్చే కొద్దిపాటి కరెంట్‌తో రెండు మడులు తడుపుకుందామంటే లో ఓల్టేజీతో మోటార్లు కాలిపోతున్నాయంటున్నారు. నెల రోజుల్లో రెం డు బోరుమోటార్లు కాలిపోయాయని, మరమ్మతు చేయించడానికి రూ.10 వేల వరకు ఖర్చు చేశానని షాబాద్ మండల కేంద్రానికి చెందిన రాములు చెప్పాడు.
విద్యుత్ కోతలు
Published Thu, Feb 6 2014 11:58 PM | Last Updated on Tue, Sep 18 2018 8:28 PM
Advertisement
Advertisement