సాక్షి, రంగారెడ్డి జిల్లా: అన్నదాతకు కరెంటు సెగ తగిలింది. వరినాట్లు వేసిన క్షణంలోనే కరెంటు కోతలు మొదలు కావడం తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. గత ఖరీఫ్ సీజన్‌లో భారీ వర్షాలతో రైతాంగం తీవ్ర నష్టాల పాలైనప్పటికీ.. ప్రస్తుతం పరిస్థితులు ఆశాజనకంగా ఉండడంతో ఉత్సాహంగా సాగు పనులకు ఉపక్రమించారు. భూగర్భజలాలు సంతృప్తికరంగా ఉండడంతో ఈ దఫా వరిసాగుపై అన్నదాతలు దృష్టి సారించారు. అయితే నాట్లు పూర్తయిన సమయంలోనే కరెంటు కష్టాలు మొదలు కావడం రైతులకు కునుకులేకుండా చేస్తోంది.
వాస్తవానికి ఈ సమయంలో నీటి అవసరం పెద్దగా ఉండదు. కానీ అవసరం మేరకు మడిని తడిపేందుకు సైతం కరెంటు సక్రమంగా అందకపోవడంతో రైతులు గందరగోళంలో పడ్డారు. జిల్లాలో 93వేల వ్యవసాయ కనెక్షన్లు ఉన్నాయి. మరో 20వేల అనధికార కనెక్షన్లు ఉన్నట్లు ట్రాన్స్‌కో అధికారుల లెక్కలు చెబుతున్నాయి. జిల్లాలో వ్యవసాయరంగానికి సగటున 3.7మిలియన్ యూనిట్ల విద్యుత్ సరఫరా చేయాల్సి ఉంది.
కాగా, ఉత్పత్తిలో నెలకొన్న సమస్యతో 3 మిలియన్ యూనిట్ల కరెంటు సరఫరా చేస్తున్నట్లు ట్రాన్స్‌కో వర్గాలు చెబుతున్నాయి. అయితే తక్కువ వినియోగం ఉన్న సమయంలోనే విద్యుత్ సమస్యలు తలెత్తడం రైతాంగానికి శాపంగా మారింది. మరో పక్షం రోజులు దాటితే ఎండల తీవ్రత మొదలుకానుంది. దీంతో విద్యుత్ వినియోగం ఆకస్మికంగా పెరిగే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో వ్యవసాయ సరఫరాపై తీవ్ర ప్రభావం పడనుంది.
భారీగా సాగు..
గతేడాది జిల్లాలో భారీ వర్షాలే కురిశాయి. చెరువులు, కుంటలు నీటితో కళకళలాడి భూగర్భజలాలు కూడా సంతృప్తికర స్థాయిలో వృద్ధి చెందాయి. దీంతో పంటల సాగుకు రైతుల్లో ధీమా పెరిగింది. ఈ నేపథ్యంలో జిల్లాలో విస్తారంగా పంటలు సాగయ్యాయి. మెట్ట పంటలతో పాటు వరిసాగు కూడా అనూహ్యంగా పెరుగుతూ వస్తోంది. ప్రస్తుత రబీ సీజన్లో జిల్లాలో వరి సాగు సాధారణ విస్తీర్ణం 15,255 హెక్టార్లుగా వ్యవసాయ శాఖ అంచనాలు రూపొందించింది.
ఇప్పటివరకు 7,455 హెక్టార్లలో సాగవ్వాల్సి ఉండగా.. 8,117 హెక్టార్లలో సాగైనట్లు అధికారుల నివేదికలు చెబుతున్నాయి. అయితే గతేడాది ఈ సమయంలో కేవలం 2,425 హెక్టార్లలో మాత్రమే వరి పంట సాగైంది. సీజన్ చివరినాటికి జిల్లాలో సాధారణం కంటే ఎక్కువ విస్తీర్ణంలో వరి సాగయ్యే అవకాశం ఉందని అధికారులు అబిప్రాయపడుతున్నారు.
చేతులు కాలకముందే..
భూగర్భజలాలు సంతృప్తికరంగా ఉండడంతో వరిసాగు విస్తీర్ణం భారీగా పెరుగుతోంది. ఇప్పటికే తీవ్రనష్టాల్లో మునిగిన రైతును ఆదుకునేందుకు యంత్రాంగం ప్రత్యేక చొరవ తీసుకోవాల్సిన అవసరం ఉంది. వరి సాగు విస్తీర్ణం తీరును అంచనా వేసి అవసరమైన మేర కరెంటు సరఫరా చేస్తే రైతులకు ఇబ్బందులు కలగవంటూ కలెక్టర్ బి.శ్రీధర్ ఇప్పటికే వ్యవసాయ, ట్రాన్స్‌కో అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అయితే ఆయా శాఖలు ఏమేరకు చర్యలు తీసుకుంటాయో చూడాలి.
కోతలు మొదలు
Published Fri, Jan 24 2014 11:20 PM | Last Updated on Tue, Sep 18 2018 8:28 PM
Advertisement