ఎన్నికల నియమావళిని పకడ్బందీగా అమలు చేయాలని కలెక్టర్ బీ.శ్రీధర్ సంబంధిత అధికారులను ఆదేశించారు.
సాక్షి, రంగారెడ్డి జిల్లా: ఎన్నికల నియమావళిని పకడ్బందీగా అమలు చేయాలని కలెక్టర్ బీ.శ్రీధర్ సంబంధిత అధికారులను ఆదేశించారు. కోడ్‌ను ఉల్లంఘించినట్లైతే వారి వివరాలను 24గంటల్లోగా నివేదిక రూపంలో అందిస్తే తగిన చర్యలు తీసుకుంటామన్నారు.
ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలుపై శుక్రవారం కలెక్టరేట్‌లో మండల పరిషత్ అభివృద్ధి అధికారులు, నియోజకవర్గ స్థాయి అధికారులకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు.
ఎన్నికల నియమావళి అధికారులుగా ఎంపీడీఓ, నియోజకవర్గ స్థాయి అధికారులను నియమించామన్నారు. ఉద్యోగులు, అభ్యర్థులు, పార్టీల నేతలు కోడ్ ఉల్లంఘించిట్లు ఫిర్యాదులొస్తే 24 గంటల్లోగా నిర్ధారించి నివేదిక ఇవ్వాల్సి ఉంటుందన్నారు. ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చినందున ప్రభుత్వ నిధులతో కొనసాగుతున్న పనులు మాత్రమే చేపట్టాలని, కొత్త మంజూరులు, పనులు చేపట్టవద్దన్నారు. ప్రభుత్వ గెస్ట్‌హౌజ్‌లు ఎవరికీ కేటాయించవద్దని ఆదేశించారు. శిక్షణ తరగతులకు హాజరుకాని అధికారులపై కఠిన చర్యలు తీసుకోనున్నట్లు స్పష్టం చేశారు. కార్యక్రమంలో జేసీలు చంపాలాల్, ఎంవీరెడ్డి తదితరులు పాల్గొని అధికారులకు సూచనలిచ్చారు.