B.sridhar
-
ఎన్నికలు సమర్థవంతంగా నిర్వహించాం
సాక్షి, రంగారెడ్డి: మహాయజ్ఞంలాంటి సార్వత్రిక ఎన్నికలను సమర్థవంతంగా నిర్వహించినందుకు ఎన్నికల అధికారులు, స్వచ్ఛంద సంస్థల కార్యకర్తలు, ఓటర్లకు జిల్లా కలెక్టర్ బి. శ్రీధర్ కృతజ్ఞతలు తెలిపారు. సోమవారం నగరంలోని ఓ హోటల్లో సార్వత్రిక ఎన్నికలపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రంగారెడ్డి జిల్లాలో ఎన్నికలు నిర్వహించడమంటే అటు హైదరబాద్‌తో కలిపి రెండు జిల్లాల్లో ఎన్నికలు నిర్వహించడంతో సమానమన్నారు. 2 వేల మంది కళాశాల విద్యార్థులతో పోలింగ్ కేంద్రాల వెబ్‌కాస్టింగ్ నిర్వహించామని, 5 వేల మంది ఎన్ఎస్ఎస్ వలెంటీర్లను ఎన్నికల నిర్వహణకు వినియోగించుకున్నామన్నారు. దాదాపు 35 వేల మంది సిబ్బందితో జిల్లాలో సార్వత్రిక ఎన్నికలను సమర్థవంతంగా నిర్వహించినట్టు పేర్కొన్నారు. ఇదే స్ఫూర్తితో ఈనెల 16న ఓట్ల లెక్కింపును విజయవంతం చేయాలని అధికారులను కోరారు. ఎన్నికల తనిఖీల్లో భాగంగా జిల్లాలో రూ. 22 కోట్ల నగదును స్వాధీనం చేసుకున్నట్టు చెప్పారు. ఓటింగ్ శాతాన్ని పెంచేందుకు ఎన్నో అవగాహన కార్యక్రమాలు నిర్వహించి 2009 పోలింగ్ శాతానికి చేరువగా వచ్చామని కలెక్టర్ పేర్కొన్నారు. సైబరాబాద్ పోలీసు కమిషనర్ సి. వి ఆనంద్ మాట్లాడుతూ రెండు నెలలుగా మున్సిపల్, ప్రాదేశిక, పంచాయితీ, సార్వత్రిక ఎన్నికల బందోబస్తును సమర్థవంతంగా నిర్వహించామన్నారు. సమావేశంలో జేసీలు చంపాలాల్, ఎం. వి రెడ్డి, సైబరాబాద్ జాయింట్ కమిషన్ గంగాధర్, వికారాబాద్ సబ్ కలెక్టర్ ఆమ్రపాలి, డీఆర్వో వెంకటేశ్వర్లు, రిటర్నింగ్, సహాయ రిటర్నింగ్ అధికారులు పాల్గొన్నారు. -
స్ట్రాంగ్‌రూంల భద్రతపై నిర్లక్ష్యం వద్దు
అనంతగిరి, న్యూస్‌లైన్: ఈవీఎంలు భ ద్రపరిచిన స్ట్రాంగ్‌రూంల వద్ద భద్రత ఏర్పాట్లపై నిర్లక్ష్యం వహించకూడదని, వాటిపై నిరంతర పర్యవేక్షణ తప్పనిసరిగా చేపట్టాలని, లాగ్‌బుక్‌లు, సీసీ టీవీలపై రిటర్నింగ్ అధికారుల పర్యవేక్షణ ఉండాలని జిల్లా కలెక్టర్ బి.శ్రీధర్ అధికారులకు సూచించారు. శనివారం వికారాబాద్ మహావీర్ వైద్య కళాశాలలోని పరిగి, తాండూరు, వికారాబాద్‌కు సంబంధించిన స్ట్రాంగ్‌రూంలను ఆయన పరిశీలించారు. మొత్తం ఎంతమంది పోలీసులతో భద్రత ఏర్పాట్లను చూస్తున్నారని ఆయన పోలీస్ అధికారులను ప్రశ్నించారు. స్ట్రాంగ్‌రూంల వద్ద కళాశాల నిర్మాణ పనులకు సంబంధించిన మెటీరియల్ ఎందుకు ఉందని.. దాన్ని వెంటనే ఇక్కడి నుంచి తొలగించాలని ఆయన అధికారులను ఆదేశించారు. స్ట్రాంగ్‌రూం సమీపంలో ఎలాంటి వస్తువులు ఉంచకూడదని ఆదేశించారు. స్ట్రాంగ్‌రూం భద్రత విషయంలో ఇన్చార్జి అధికారి ఎవరని ఆయన పోలీసులను ప్రశ్నించారు. ఇక్కడ ఎస్ఐ ఉన్నాడని.. ప్రస్తుతం ఆయన బయటికి వెళ్లాడని వికారాబాద్ సీఐ లచ్చిరాం నాయక్ బదులిచ్చారు. ఇన్చార్జిగా ఎవరినైతే నియమించామో ఆ అధికారి ఇక్కడే ఉండాలి కదా అని కలెక్టర్ పేర్కొన్నారు. లాగ్‌బుక్ ఎక్కడ ఉందని ఆరా తీయగా ఎవరూ సరైన సమాధానం ఇవ్వకపోవడంతో అధికారులపై శ్రీధర్ ఆగ్రహం, అసహనం వ్యక్తం చేశారు. స్ట్రాంగ్‌రూంల వద్ద గట్టి భద్రత ఉండాలని అడిషనల్ఎస్పీ వెంకటస్వామిని ఆయన ఆదేశించారు. ఈ సందర్భంగా స్ట్రాంగ్ రూం భద్రతపై రిటర్నింగ్ అధికారులకు, పోలీస్ సిబ్బందికి పలు సూచనలు చేశారు. స్థానిక పోలీస్ శాఖ నుంచి ముఖ్య ద్వారం వద్ద భద్రత పటిష్టం చేయాలని, స్థానిక సివిల్ పోలీస్ అధికారిని ఇక్కడ ఇన్చార్జిగా నియమించాలని కలెక్టర్ ఆదేశించారు. అనంతరం సీసీ టీవీలు ఏర్పాటు చేసిన కంట్రోల్ రూంను, కౌంటింగ్ హాల్‌ను పరిశీలించారు. కౌంటింగ్ రోజు మీడియా సెంటర్‌ను ఏర్పాటు చేయాలన్నారు. లోపలికి ఎవరూ రాకుండా గట్టి భద్రత చేపట్టాలన్నారు. కలెక్టర్ వెంట సబ్ కలెక్టర్ ఆమ్రపాలి, పరిగి రిటర్నింగ్ అధికారి సంధ్యారాణి, చేవేళ్ల ఆర్డీఓ చంద్రశేఖర్‌రెడ్డి, అడిషనల్ ఎస్పీ వెంకటస్వామి, డీఎస్పీ నర్సింలు, ఆయా నియోజకవర్గాల అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులు ఉన్నారు. -
సిద్ధంగా ఉన్నాం..
సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: తొలి విడత మండల/జిల్లా ప్రాదేశిక ఎన్నికల నిర్వహణకు సర్వంసిద్ధం చేశామని కలెక్టర్ బీ.శ్రీధర్ వెల్లడించారు. ఆదివారం 16 మండలాల జెడ్పీటీసీ, 303 గ్రామాల్లో ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు జరుగుతాయని తెలిపారు. ఈ ఎన్నికల్లో 9 ల క్షల మంది ఓటు హక్కు వినియోగించుకోనున్నారని పేర్కొన్నారు. శుక్రవారం జిల్లా పరిషత్ కార్యాలయంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో జెడ్పీ సీఈఓ చక్రధర్‌రావుతో కలిసి కలెక్టర్ మాట్లాడారు. రెండు దశల్లో జరిగే ప్రాదేశిక ఎన్నికల్లో 188 మంది జెడ్పీటీసీ, 20,436 మంది మండల ప్రాదేశిక స్థానాలకు పోటీ పడుతున్నట్లు చెప్పారు. ఇప్పటికే బ్యాలెట్ పత్రాల ముద్రణ పూర్తయిందని, బ్యాలెట్ బాక్సులను కూడా సిద్ధం చేశామని తెలిపారు. శనివారం పోలింగ్ సిబ్బందికి వీటిని అందజేయనున్నట్లు వివరించారు. ఓట్ల లెక్కింపును సార్వత్రిక ఎన్నికల అనంతరం నిర్వహించాలని సుప్రీంకోర్టు ఆదేశించినందున.. పోలింగ్ అనంతరం బ్యాలెట్ బాక్సులను డివిజన్/నియోజకవర్గాల్లో ఏర్పాటు చేసే స్ట్రాంగ్‌రూమ్‌లలో భద్ర పరుచనున్నట్లు పేర్కొన్నారు. భద్రతా కారణాల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు కలెక్టర్ వెల్లడించారు. గట్టి పోలీసు బందోస్తు ప్రాదేశిక ఎన్నికల్లోఅవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా గట్టి పోలీసు బందోబస్తును ఏర్పాటు చేస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు. ఎన్నికల నేపథ్యంలో మద్యం దుకాణాలను ఏడో తేదీ వరకు మూసివేయాలని ఆదేశించినట్లు పేర్కొన్నారు. ఓటింగ్‌లో అక్రమాలను పసిగట్టేందుకు వెబ్ క్యాస్టింగ్, వీడియో చిత్రీకరణ జరుపుతున్నట్లు చెప్పారు. ప్రజాస్వామ్య స్ఫూర్తిని చాటండి ఓటు హక్కును వినియోగించుకొని ప్రజాస్వామ్య స్ఫూర్తిని చాటాలని కలెక్టర్ శ్రీధర్ పిలుపునిచ్చారు. ఓటును సద్వినియోగం చేసుకోవాలని, రాజ్యాంగం ప్రసాదించిన ఈ హక్కును మద్యం, ధనం, కానుకలు, ఇతర ప్రలోభాలకు లొంగి దుర్వినియోగం చేసుకోవద్దని కోరారు. కొత్త ఓటర్లకు గుర్తింపు కార్డులను వారి ఇంటివద్దే అందజేస్తున్నట్లు చెప్పారు. ప్రాదేశిక ఎన్నికల నేపథ్యంలో స్థానికంగా సెలవు ఇచ్చే అంశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తోందని స్పష్టం చేశారు. 21 పంచాయతీలకు ఎన్నికలు శివార్లలోని 21 పంచాయతీలకు ఈ నెల 13న జరిగే ఎన్నికలకు పకడ్బందీ ఏర్పాట్లు చేసినట్లు కలెక్టర్ తెలిపారు. బ్యాలెట్ బాక్సుల కొరతను అధిగమించేందుకు కర్ణాటక నుంచి 500 బాక్సులను తెప్పించినట్లు చెప్పారు. బ్యాలెట్ పత్రాల ముద్రణ కూడా పూర్తయిందన్నారు. ఉద్యోగుల కొరత ఉంది పోలింగ్ విధుల నిర్వహణకు సరిపడా ఉద్యోగులను సమకూర్చుకోవడం కష్టంగా మారిందని అన్నారు. సాధారణ ఎన్నికలకు 33 వేల మంది సిబ్బంది అవసరం కాగా, ఇప్పటివరకు 19వేల మంది ఉద్యోగుల వివరాలను మాత్రమే సేకరించామని తెలిపారు. మిగతా వారిని సమీకరించేందుకు జీహెచ్ఎంసీ కమిషనర్ నేతృత్వంలోని కమిటీ పనిచేస్తున్నదన్నారు. హైదరాబాద్‌లోని వివిధ సంస్థల ఉద్యోగులను రంగారెడ్డి జిల్లా ఎన్నికల నిర్వహణకు వినియోగించుకోవాలని నిర్ణయించినట్లు చెప్పారు. 11 వేల మంది ఉపాధ్యాయులను ఎన్నికల విధులకు వాడుకోవాలని నిర్ణయించామని, వారి సహకారం అభినందనీయమన్నారు. ప్రాదేశిక పోలింగ్ నిర్వహణకు 11,248 మంది ఉద్యోగులను వినియోగిస్తున్నట్లు చెప్పారు. -
7 అభ్యంతరాలూ తిరస్కరణ
సాక్షి, రంగారెడ్డి జిల్లా: ప్రాదేశిక స్థానాల నామినేషన్ల తిరస్కరణకు సంబంధించి వచ్చిన ఏడు అభ్యంతరాలనూ తోసిపుచ్చినట్టు కలెక్టర్ శ్రీధర్ వెల్లడించారు. తిరస్కరణకు గురైన నామినేషన్లకు సంబంధించి దా ఖలైన అప్పీళ్లను కలెక్టర్ ఆదివారం అభ్యర్థుల సమక్షంలో విచారించారు. పూడూరు జెడ్పీటీసీకి మేఘమాల దాఖలు చేసిన నామినేషన్‌ను ప్రతిపాదించిన వ్యక్తి చిరునామా పూడూరుగా కాకుండా పరిగి అని పేర్కొన్నందున నామినేషన్ తిరస్కరించినట్టు కలెక్టర్ తెలిపారు. వికారాబాద్ జెడ్పీటీసీకి నామినేషన్ వేసిన చాకలి నర్సింహులు, యాచారం స్థానానికి నామినేషన్ వేసిన గడ్డం శీనులు డిక్లరేషన్‌పై సంతకం చేయనందున, మంచాల సీటుకు నామినేషన్ దాఖలు చేసిన ప్రభాకర్ నామినేషన్ పత్రంపై సంతకం చేయనందున తిరస్కరణకు గురయ్యాయన్నారు. ఇక తాండూరు జెడ్పీటీసీ స్థానానికి దాఖలైన రెండు నామినేషన్లను ఓటరు జాబితాలో వారి పేర్లు లేనందున తిరస్కరించినట్టు ఆయా అభ్యర్థుల సమక్షంలో జిల్లా కలెక్టర్ వెల్లడించారు. -
ప్రతి పైసా లెక్కిస్తాం
సాక్షి, రంగారెడ్డి జిల్లా: ఎన్నికల సందర్భంగా అభ్యర్థులు ఖర్చుచేసే ప్రతిపైసా లెక్కకొస్తుందని కలెక్టర్ బీ.శ్రీధర్ స్పష్టం చేశారు. ఈ ఖర్చు ను లెక్కించేందుకు ప్రత్యేకంగా నిఘా వ్యవస్థ ఏర్పాటు చేశామన్నారు. మంగళవారం కలెక్టరేట్లో ఎన్నికల వ్యయ పర్యవేక్షణపై అధికారులకు శిక్షణ ఇచ్చారు. ఎన్నికల కమిషన్ నిబంధనలకనుగుణంగా వ్యయ పరిశీ లన జరగాలని, ఇందుకోసం ఏర్పాటుచేసిన బృందాలు సమన్వయం తో పనిచేయాలని సూచించారు. రవాణా ఖర్చు రూ.50వేలు మించిన అభ్యర్థులు తప్పనిసరిగా లిఖితపూర్వక డాక్యుమెంట్లు సమర్పించాలని, లేకుంటే డబ్బును సీజ్‌చేసి తగిన చర్యలు తీసుకోనున్నట్లు చెప్పారు. ఎన్నికల్లో అధిక ఖర్చును నియత్రించాలన్న ఎన్నికల కమిషన్ నిబంధనలపై ప్రజలు స్పందించాలన్నారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్లు చంపాలాల్, ఎంవీరెడ్డి, డ్వామా పీడీ చంద్రకాంత్‌రెడ్డి పాల్గొన్నారు. -
కోడ్ ఉల్లంఘిస్తే కఠిన చర్యలు
సాక్షి, రంగారెడ్డి జిల్లా: ఎన్నికల నియమావళిని పకడ్బందీగా అమలు చేయాలని కలెక్టర్ బీ.శ్రీధర్ సంబంధిత అధికారులను ఆదేశించారు. కోడ్‌ను ఉల్లంఘించినట్లైతే వారి వివరాలను 24గంటల్లోగా నివేదిక రూపంలో అందిస్తే తగిన చర్యలు తీసుకుంటామన్నారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలుపై శుక్రవారం కలెక్టరేట్లో మండల పరిషత్ అభివృద్ధి అధికారులు, నియోజకవర్గ స్థాయి అధికారులకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఎన్నికల నియమావళి అధికారులుగా ఎంపీడీఓ, నియోజకవర్గ స్థాయి అధికారులను నియమించామన్నారు. ఉద్యోగులు, అభ్యర్థులు, పార్టీల నేతలు కోడ్ ఉల్లంఘించిట్లు ఫిర్యాదులొస్తే 24 గంటల్లోగా నిర్ధారించి నివేదిక ఇవ్వాల్సి ఉంటుందన్నారు. ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చినందున ప్రభుత్వ నిధులతో కొనసాగుతున్న పనులు మాత్రమే చేపట్టాలని, కొత్త మంజూరులు, పనులు చేపట్టవద్దన్నారు. ప్రభుత్వ గెస్ట్‌హౌజ్‌లు ఎవరికీ కేటాయించవద్దని ఆదేశించారు. శిక్షణ తరగతులకు హాజరుకాని అధికారులపై కఠిన చర్యలు తీసుకోనున్నట్లు స్పష్టం చేశారు. కార్యక్రమంలో జేసీలు చంపాలాల్, ఎంవీరెడ్డి తదితరులు పాల్గొని అధికారులకు సూచనలిచ్చారు. -
‘చార్ధామ్’ బాధితులకు ఎక్స్‌గ్రేషియా
సాక్షి, రంగారెడ్డి జిల్లా : ఉత్తరాఖండ్‌లో చార్ధామ్ యాత్రకు వెళ్లి వరదల్లో ప్రాణాలు కోల్పోయిన జిల్లావాసుల కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం సీఎం రిలీఫ్ ఫండ్ కింద ఆర్ధిక సహాయం విడుదల చేసిందని కలెక్టర్ బి.శ్రీధర్ ఒక ప్రకటనలో తెలిపారు. ఒక్కొక్కరికి రూ.5లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా ఇవ్వనున్నట్లు చెప్పారు. అదేవిధంగా ఉత్తరాఖండ్ ప్రభుత్వం 23మంది మృతులకు గాను ఒక్కో కుటుంబానికి రూ.3.5లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా ఇచ్చిందన్నారు. కలెక్టర్ శ్రీధర్ గురువారం కలెక్టరేట్లోని కోర్టు హాలులో బాధిత కుటుంబాలకు చెక్కులు పంపిణీ చేశారు. -
‘ఎన్నికల టీం’పై కసరత్తు
సాక్షి, రంగారెడ్డిజిల్లా ప్రతినిధి : సార్వత్రిక ఎన్నికల నిర్వహణకు జిల్లా యంత్రాంగం సన్నద్ధమవుతోంది. సజావుగా ఎన్నికలు జరపడానికి సమర్థ అధికారులను రంగంలోకి దించేందుకు కసరత్తు ముమ్మరం చేసింది. ఎన్నికల కమిషన్ మార్గదర్శకాలను కచ్చితంగా అమలు చేసేందుకు వీలుగా జిల్లా స్థాయి అధికారులను నోడల్ ఆఫీసర్లుగా నియమిస్తోంది. ఇందులో భాగంగా గురువారం నోడల్ అధికారులతో కలెక్టర్ బి.శ్రీధర్ ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు. నోటిఫికేషన్ వెలువడింది మొదలు.. ఫలితాలు ప్రకటించేవరకు ఈ అధికారులు పూర్తిస్థాయిలో ఎన్నికల విధుల్లో నిమగ్నం కావాల్సివుంటుంది. మరో వారం రోజుల్లో తహసీల్దార్ల బదిలీల ప్రక్రియ ముగియనుండడంతో అప్పటిలోగా కొత్త టీమ్‌ను సిద్ధం చేయాలని కలెక్టర్ భావిస్తున్నారు. నోడల్ ఆఫీసర్లకు సహా యకులుగా కలెక్టరేట్లోని వివిధ సెక్షన్ల సూపరింటెండెంట్లను నియమించనున్నారు. నిబంధనలు కఠినం ఎన్నికల్లో మద్యం, ధన ప్రవాహన్ని అరికట్టేందుకు కేంద్ర ఎన్నికల సంఘం నిబంధనలను కఠినతరం చేసింది. నియమావళిని తూ.చ. తప్పకుండా పాటించేందుకు వీలుగా మార్గదర్శకాలను రూపొందించడమే కాకుండా.. అమలుకు మరింత మంది అఖిల భారత సర్వీసుల అధికారులను ఎన్నికల విధుల్లో వినియోగించుకోవాలని నిర్ణయించింది. వచ్చే ఎన్నికలను సమర్థవంతగా నిర్వహించేందుకు వివిధ స్థాయిల్లో అధికారుల బృందాలను నియమిస్తోంది. ఇప్పటివరకు అభ్యర్థులు సమర్పించే ఎన్నికల ఖర్చుపై నిఘా వహించే పరిశీలకులు ఈసారి మాత్రం వ్యయంపై ప్రత్యేకంగా దృష్టి సారించనున్నారు. అభ్యర్థులు ఇచ్చే కాకిలెక్కలే కాకుండా ‘షాడో’ రిజిస్టర్‌ను నిర్వహించనున్నారు. ప్రతిరోజు మండలాల నుంచి వచ్చే వీడియో క్లిప్పింగ్స్ ఆధారంగా అభ్యర్థుల ఖర్చుపై అంచనాలు రూపొందించేందుకు జిల్లా/అసెంబ్లీ స్థాయిలో వీడియో వ్యూయింగ్ టీంను ఏర్పాటు చేయనున్నారు. ఈ బృందం అభ్యర్థుల వ్యయాన్ని లెక్కగట్టనుంది. ఈ వివరాలను ‘షాడో’ రిజిస్టర్లో పొందుపరుస్తారు. దీన్ని పరిగణనలోకి తీసుకొని అభ్యర్థుల వ్యయంపై ఒక నిర్ధిష్ట అభిప్రాయానికి వస్తారు. పరిశీలకుడికి సహకరించేందుకు వీడి యో వ్యూయింగ్ టీం, అకౌంటింగ్ టీం, కంట్రో ల్ రూమ్, మీడియా సర్టిఫికేషన్ మానిటరింగ్ కమిటీ, ఫ్లైయింగ్ స్క్వాడ్స్, నిఘా బృందాలను ఏర్పాటు చేస్తున్నారు. గతంతో పోలిస్తే ఈసారి నిఘాను పెంచేందుకు రెట్టింపు స్థాయిలో ఉద్యోగులను ఎన్నికల విధులకు ఉపయోగించుకోవాలని ఈసీ నిర్ణయించింది. సార్వత్రిక ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించేందుకు ఎలక్షన్ కమిషన్ కొత్త నియమావళిని రూపొందించింది. దీనిపై ఐఏఎస్, ఐపీఎస్, ఐఆర్ఎస్ అధికారులకు అవగాహన కల్పించేం దుకు ఫిబ్రవరి 5న జూబ్లీహాల్లో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసింది. దీనికి కేంద్ర ఎన్నికల కమిషన్ డిప్యూటీ కమిషనర్ హాజరుకానున్నారు. ఈసీ నిబంధనలను కఠినతరం చేయాలని నిర్ణయించిన నేపథ్యంలో అందుకనుగుణంగా క్షేత్రస్థాయిలో జిల్లా యంత్రాంగం ఏర్పాట్లు చేస్తోంది. ఈ మేరకు సమర్థ అధికారులతో కూడిన కొత్త జట్టు ఎంపికపై జిల్లా కలెక్టర్ బి.శ్రీధర్ కసరత్తు చేస్తున్నారు. -
స్వయం ఉపాధికి ప్రోత్సాహం
సాక్షి, రంగారెడ్డి జిల్లా: నిరుద్యోగ యువతను స్వయం ఉపాధి వైపు ప్రోత్సహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సరికొత్త కార్యక్రమాన్ని చేపట్టిందని కలెక్టర్ బి.శ్రీధర్ పేర్కొన్నారు. స్వయం ఉపాధి యునిట్లపై ఇప్పటివరకిచ్చిన రాయితీని రెట్టింపు చేస్తూ నిర్ణయం తీసుకుందన్నారు. దీంతో జిల్లాలోని 17,994 మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, వికలాంగ నిరుద్యోగులు దాదాపు రూ.80కోట్ల మేర లబ్ధి పొందనున్నట్లు తెలిపారు. ఆదివారం గచ్చిబౌలిలోని సైబరాబాద్ పోలీసు కమిషనరేట్ పరేడ్ గ్రౌండ్స్‌లో జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో 65వ గణతంత్ర దినోత్సవం నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన కలెక్టర్ జాతీయపతాకాన్ని ఆవిష్కరించి, పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం జిల్లాలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను వివరిస్తూ కలెక్టర్ ప్రసంగించారు. అవి ఆయన మాటల్లోనే... భూమిలేని నిరుపేదలకు సాగుభూమి కల్పించే భూపంపిణీ కార్యక్రమంలో భాగంగా జిల్లాలో 666మంది పేదలకు 1,106 ఎకరాల భూమిని పంపిణీ చేసి పట్టా సర్టిఫికెట్లు అందజేశామన్నారు. అదేవిధంగా ఇప్పటివరకు జిల్లాలో 2లక్షల మంది పేదల సొంతింటి కల నెరవేర్చేందుకు ఉచితంగా ఇళ్ల స్థలాలు పంపిణీ చేశామన్నారు. ఇందిరమ్మ ఇళ్ల పథకంలో మూడు విడతల కింద 2,63,820 మంది పేదలకు ఇళ్లు మంజూరు చేశామన్నారు. ఈ ఆర్థిక సంవత్సరం ఖరీఫ్, రబీ సీజన్లలో రైతులకు పావలా వడ్డీపై రూ.537కోట్ల పంట రుణాలు విడుదల చేశామని కలెక్టర్ తెలిపారు. పేద రైతులకు 74వేల వ్యవసాయ కనెక్షన్లు ఉచితంగా ఇచ్చామన్నారు. 400కేవీ సామర్థ్యం గల 3సబ్స్టేషన్లు, 132కేవీ సామర్థ్యంగల 2సబ్స్టేషన్లు, 220కేవీ సామర్థ్యం గల ఒక సబ్‌స్టేషన్, 33 కేవీ సామర్థ్యం గల 9సబ్స్టేషన్లు కొత్తగా నిర్మించామన్నారు. ఆడపిల్లల బంగారు భవిష్యత్తు కోసం అమలుచేస్తున్న బంగారు తల్లి పథకంతో జిల్లాలో 42వే ల కుటుంబాలకు లబ్ధి చేకూరిందన్నారు. స్త్రీనిధి పథకంలో భాగంగా ఈ ఆర్థిక సంవత్సరంలో 24వేల మంది మహిళలకు రూ.41కోట్ల రుణాలు అందించామన్నారు. అభయహస్తం పథకంతో జిల్లాలో 10వేల మంది సభ్యులకు ప్రతి నెల రూ.500 చొప్పున పింఛన్లు పంపిణీ చేస్తున్నామన్నారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్లు చంపాలాల్, ఎంవీరెడ్డి, ఎస్పీ రాజకుమారి, డీసీపీ కాంతిలాల్ రాణా తదితరులు పాల్గొన్నారు. -
కోతలు మొదలు
సాక్షి, రంగారెడ్డి జిల్లా: అన్నదాతకు కరెంటు సెగ తగిలింది. వరినాట్లు వేసిన క్షణంలోనే కరెంటు కోతలు మొదలు కావడం తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. గత ఖరీఫ్ సీజన్లో భారీ వర్షాలతో రైతాంగం తీవ్ర నష్టాల పాలైనప్పటికీ.. ప్రస్తుతం పరిస్థితులు ఆశాజనకంగా ఉండడంతో ఉత్సాహంగా సాగు పనులకు ఉపక్రమించారు. భూగర్భజలాలు సంతృప్తికరంగా ఉండడంతో ఈ దఫా వరిసాగుపై అన్నదాతలు దృష్టి సారించారు. అయితే నాట్లు పూర్తయిన సమయంలోనే కరెంటు కష్టాలు మొదలు కావడం రైతులకు కునుకులేకుండా చేస్తోంది. వాస్తవానికి ఈ సమయంలో నీటి అవసరం పెద్దగా ఉండదు. కానీ అవసరం మేరకు మడిని తడిపేందుకు సైతం కరెంటు సక్రమంగా అందకపోవడంతో రైతులు గందరగోళంలో పడ్డారు. జిల్లాలో 93వేల వ్యవసాయ కనెక్షన్లు ఉన్నాయి. మరో 20వేల అనధికార కనెక్షన్లు ఉన్నట్లు ట్రాన్స్‌కో అధికారుల లెక్కలు చెబుతున్నాయి. జిల్లాలో వ్యవసాయరంగానికి సగటున 3.7మిలియన్ యూనిట్ల విద్యుత్ సరఫరా చేయాల్సి ఉంది. కాగా, ఉత్పత్తిలో నెలకొన్న సమస్యతో 3 మిలియన్ యూనిట్ల కరెంటు సరఫరా చేస్తున్నట్లు ట్రాన్స్‌కో వర్గాలు చెబుతున్నాయి. అయితే తక్కువ వినియోగం ఉన్న సమయంలోనే విద్యుత్ సమస్యలు తలెత్తడం రైతాంగానికి శాపంగా మారింది. మరో పక్షం రోజులు దాటితే ఎండల తీవ్రత మొదలుకానుంది. దీంతో విద్యుత్ వినియోగం ఆకస్మికంగా పెరిగే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో వ్యవసాయ సరఫరాపై తీవ్ర ప్రభావం పడనుంది. భారీగా సాగు.. గతేడాది జిల్లాలో భారీ వర్షాలే కురిశాయి. చెరువులు, కుంటలు నీటితో కళకళలాడి భూగర్భజలాలు కూడా సంతృప్తికర స్థాయిలో వృద్ధి చెందాయి. దీంతో పంటల సాగుకు రైతుల్లో ధీమా పెరిగింది. ఈ నేపథ్యంలో జిల్లాలో విస్తారంగా పంటలు సాగయ్యాయి. మెట్ట పంటలతో పాటు వరిసాగు కూడా అనూహ్యంగా పెరుగుతూ వస్తోంది. ప్రస్తుత రబీ సీజన్లో జిల్లాలో వరి సాగు సాధారణ విస్తీర్ణం 15,255 హెక్టార్లుగా వ్యవసాయ శాఖ అంచనాలు రూపొందించింది. ఇప్పటివరకు 7,455 హెక్టార్లలో సాగవ్వాల్సి ఉండగా.. 8,117 హెక్టార్లలో సాగైనట్లు అధికారుల నివేదికలు చెబుతున్నాయి. అయితే గతేడాది ఈ సమయంలో కేవలం 2,425 హెక్టార్లలో మాత్రమే వరి పంట సాగైంది. సీజన్ చివరినాటికి జిల్లాలో సాధారణం కంటే ఎక్కువ విస్తీర్ణంలో వరి సాగయ్యే అవకాశం ఉందని అధికారులు అబిప్రాయపడుతున్నారు. చేతులు కాలకముందే.. భూగర్భజలాలు సంతృప్తికరంగా ఉండడంతో వరిసాగు విస్తీర్ణం భారీగా పెరుగుతోంది. ఇప్పటికే తీవ్రనష్టాల్లో మునిగిన రైతును ఆదుకునేందుకు యంత్రాంగం ప్రత్యేక చొరవ తీసుకోవాల్సిన అవసరం ఉంది. వరి సాగు విస్తీర్ణం తీరును అంచనా వేసి అవసరమైన మేర కరెంటు సరఫరా చేస్తే రైతులకు ఇబ్బందులు కలగవంటూ కలెక్టర్ బి.శ్రీధర్ ఇప్పటికే వ్యవసాయ, ట్రాన్స్‌కో అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అయితే ఆయా శాఖలు ఏమేరకు చర్యలు తీసుకుంటాయో చూడాలి. -
కొత్తగా పది పురపాలికలు!
సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: కొత్త మున్సిపాలిటీలపై జిల్లా యంత్రాంగం కసరత్తు చేస్తోంది. శివారు పంచాయతీలను హైదరాబాద్ మహానగర పాలక సంస్థ(జీహెచ్ఎంసీ)లో విలీనం చేయడాన్ని హైకోర్టు తప్పుబట్టిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే పునరాలోచనలో పడ్డ ప్రభుత్వం.. వీటిని నగర పంచాయతీలుగా మార్చాలని నిర్ణయించింది. ఈ మేరకు ప్రతిపాదనలు పంపాలని జిల్లా యంత్రాంగాన్ని ఆదేశించింది. దీంతో కలెక్టర్ బి.శ్రీధర్ నేతృత్వంలోని అధికారుల బృందం కొత్త మున్సిపాలిటీలపై ప్రాథమిక స్థాయిలో చర్చలు జరిపింది. గ్రేటర్ విలీన ప్రతిపాదిత 32 గ్రామాలను పది నగర పంచాయతీల పరిధిలోకి తేవాలని సూత్రప్రాయంగా నిర్ణయించింది. జవహర్‌నగర్, గుండ్లపోచంపల్లి గ్రామ పంచాయతీలను ఈ జాబితాల్లో చేర్చకూడదని భావించింది. కొత్త మున్సిపాలిటీలపై జిల్లా యంత్రాంగం కసరత్తు చేస్తోంది. శివారు పంచాయతీలను హైదరాబాద్ మహానగర పాలక సంస్థ(జీహెచ్ఎంసీ)లో విలీనం చేయడాన్ని హైకోర్టు తప్పుబట్టిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే పునరాలోచనలో పడ్డ ప్రభుత్వం.. వీటిని నగర పంచాయతీలుగా మార్చాలని నిర్ణయించింది. ఈ మేరకు ప్రతిపాదనలు పంపాలని జిల్లా యంత్రాంగాన్ని ఆదేశించింది. దీంతో కలెక్టర్ బి.శ్రీధర్ నేతృత్వంలోని అధికారుల బృందం కొత్త మున్సిపాలిటీలపై ప్రాథమిక స్థాయిలో చర్చలు జరిపింది. గ్రేటర్ విలీన ప్రతిపాదిత 32 గ్రామాలను పది నగర పంచాయతీల పరిధిలోకి తేవాలని సూత్రప్రాయంగా నిర్ణయించింది. జవహర్‌నగర్, గుండ్లపోచంపల్లి గ్రామ పంచాయతీలను ఈ జాబితాల్లో చేర్చకూడదని భావించింది. శామీర్‌పేట మండలంలోనే అతిపెద్ద గ్రామ పంచాయతీగా ఉన్న జవహర్‌నగర్‌ను విలీనం చేసుకునేందుకు గ్రేటర్ పాలకవర్గం మొగ్గు చూపుతోంది. అక్కడే డంపింగ్ యార్డు ఉండడం, విస్తారంగా ప్రభుత్వ భూములు ఉన్న నేపథ్యంలో భవిష్యత్తు అవసరాలకు ఈ గ్రామ విలీనం అనివార్యమని అంచనా వేస్తోంది. ఈ క్రమంలో ఈ పంచాయతీని కలుపుకునేందుకు సంసిద్ధత వ్యక్తం చేసింది. అలాగే గుండ్లపోచంపల్లి గ్రామాన్ని గ్రేటర్లో విలీనం చేయకుండా నగర పంచాయతీగా అప్‌గ్రేడ్ చేద్దామని తొలుత భావించినప్పటికీ, నగర పంచాయతీ ఏర్పాటుకు నిర్ధేశించిన జనాభా లేనందున.. ప్రస్తుతానికి దీన్ని గ్రామ పంచాయతీగానే కొనసాగించాలనే అభిప్రాయానికొచ్చింది. పదింటికీ ఒకే..! గ్రేటర్లో శివారుగ్రామాల విలీన ప్రక్రియ చట్టబద్ధంగా సాగలేదని న్యాయస్థానం ఆక్షేపించడంతోపాటు ఎన్నికల కమిషన్ కూడా ఈ పంచాయతీల విషయంలో తుది నిర్ణయాన్ని వెల్లడించాలని స్పష్టం చేసింది. ఈసీ ఆదేశాలతో త్వరలోనే వీటిపై నిర్ణయం తీసుకుంటామని ప్రభుత్వం హామీ ఇచ్చింది. ఈ మేరకు వారం రోజులుగా వీటి భవిష్యత్తుపై తర్జనభర్జనలు పడ్డ జిల్లా యంత్రాంగం ఓ నివేదికను రూపొందించింది. ఈ నేపథ్యంలో గుండ్లపోచంపల్లి, జవహర్‌నగర్‌ను మినహాయించి మిగతా గ్రామాలను 8 నుంచి పది మున్సిపాలిటీలు చేయాలని ప్రతిపాదించింది. ఈ మేరకు జిల్లా ప్రజాప్రతినిధులను సంప్రదించి తుది ప్రతిపాదనలను ప్రభుత్వానికి నివేదించాలని యోచిస్తోంది. వీటికి ప్రభుత్వం ఆమోదముద్ర వేస్తే రాష్ట్రంలోనే అత్యధిక మున్సిపాలిటీల(16)తో మన జిల్లా అగ్రస్థానంలో నిలవనుంది. -
విద్యకు ప్రాధాన్యం
సాక్షి, రంగారెడ్డి జిల్లా: ప్రభుత్వం ఈ ఆర్థిక సంవత్సరం నుంచి కొత్తగా ప్రవేశపెట్టిన ప్రాథమిక స్థాయి విద్యార్థులకు ఉపకారవేతనాల కార్యక్రమంతో పెద్దఎత్తున లబ్ధి చేకూరనున్నట్లు కలెక్టర్ బి.శ్రీధర్ పేర్కొన్నారు. అంబేద్కర్ విద్యా నిధితో విదేశాల్లో ఉన్నత విద్య అభ్యసించే అవకాశం కలిగిందని ఉద్ఘాటించారు. రాష్ట్ర అవతరణ వేడుకలను పురస్కరించుకుని శుక్రవారం గచ్చిబౌలిలోని సైబరాబాద్ పోలీసు పరేడ్ గ్రౌండ్స్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ముందుగా జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం జిల్లాలో సంక్షేమ పథకాల అమలు, అభివృద్ధి కార్యక్రమాలపై ప్రసంగించారు. ఎస్సీ విద్యార్థులకు మరింత మెరుగైన విద్యనందించేందుకు జిల్లాకు ఆరు ఇందిరమ్మ విద్యా నిలయాలను ప్రభుత్వం మంజూరు చేసిందని, త్వరలో అందుబాటులోకి తెస్తామన్నారు. ఈ ఏడాది నుంచి ఐదో తరగతి చదివే ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు ఉపకారవేతనాలు అందిస్తున్నట్లు వెల్లడించారు. సాంకేతిక విద్యను ప్రోత్సహించేందుకుగాను జిల్లాకు కొత్తగా 2 ఐటీఐ కాలేజీలు, మల్కాజ్‌గిరికి డిగ్రీ కాలేజీ ఇటీవల మంజూరయ్యాయన్నారు. పాలన మరింత సులభతరం.. ప్రభుత్వ పాలనను మరింత సులభతరం చేయడంతోపాటు ప్రజలకు మెరుగైన సేవలందించేందుకు ప్రభుత్వం కొత్త రెవెన్యూ డివిజన్లు ఏర్పాటు చేసిందన్నారు. మీ సేవా కేంద్రాలతో రెవెన్యూ సేవలు వేగవంతమయ్యాయన్నారు. త్వరలో ఏడో విడత భూ పంపిణీ ద్వారా 1,106 ఎకరాలు భూమిని 666 మంది లబ్ధిదారులకు అందించనున్నట్లు చెప్పారు. జిల్లాలో ఇప్పటివరకు 2లక్షల మందికి ఇళ్ల స్థలాలు పంపిణీ చేశామన్నారు. ైరె తులకు రుణాలు, రాయితీపై పనిముట్లు.. వ్యవసాయ రంగాన్ని పటిష్టం చేసేందుకు ప్రభుత్వం రైతాంగానికి వడ్డీలేని రుణాలిస్తోందన్నారు. ఇందులో భాగంగా ఈ ఏడాది ఖరీఫ్, రబీ సీజన్లో రూ.355కోట్ల రుణాలు పంపిణీ చేశామన్నారు. రూ. 5.61కోట్ల వ్యయంతో 50శాతం రాయితీపై పనిముట్లు అందిస్తున్నామన్నారు. ప్రజలకు నాణ్యమైన విద్యుత్తు అందించేందుకు గాను కొత్తగా 400కేవీ సామర్థ్యం గల మూడు సబ్స్టేషన్లు, 132 కేవీ సామర్థ్యం గల రెండు, 220కేవీ సామర్థ్యం గల ఒకటి, 33 కేవీ సామర్థ్యం గల 9 సబ్స్టేషన్లు రూ.271 కోట్లతో నిర్మిస్తున్నామన్నారు. కూరగాయలు, పూలు, పండ్లతోటల సాగును మరింత విస్తరించేందుకు జిల్లాకు అధికంగా పాలీహౌస్ యూనిట్లు ప్రభుత్వం మంజూరు చేసిందన్నారు. అలరించిన సాంస్కృతిక ప్రదర్శనలు.. పాఠశాల విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ప్రదర్శనల్లో పాల్గొన్న విద్యార్థులకు కలెక్టర్ ప్రశంసాపత్రాలు అందించారు. మహిళా సంఘాలకు రూ.12కోట్ల రుణాలు, అభయ హస్తం కింద రూ.1.77కోట్ల పింఛన్లు, వికలాంగులకు 6 ట్రైసైకిళ్లు, ఆర్వీఎం ద్వారా 40 మంది విద్యార్థులకు 6.15లక్షల విలువైన వినికిడి యంత్రాలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఎస్పీ రాజకుమారి, జేసీ చంపాలాల్, జెడ్పీ సీఈఓ రవీందర్‌రెడ్డి, డీఆర్డీఏ పీడీ వరప్రసాద్‌రెడ్డి, డీఈఓ సోమిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.