సాక్షి, రంగారెడ్డి జిల్లా: నిరుద్యోగ యువతను స్వయం ఉపాధి వైపు ప్రోత్సహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సరికొత్త కార్యక్రమాన్ని చేపట్టిందని కలెక్టర్ బి.శ్రీధర్ పేర్కొన్నారు. స్వయం ఉపాధి యునిట్లపై ఇప్పటివరకిచ్చిన రాయితీని రెట్టింపు చేస్తూ నిర్ణయం తీసుకుందన్నారు. దీంతో జిల్లాలోని 17,994 మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, వికలాంగ నిరుద్యోగులు దాదాపు రూ.80కోట్ల మేర లబ్ధి పొందనున్నట్లు తెలిపారు.
ఆదివారం గచ్చిబౌలిలోని సైబరాబాద్ పోలీసు కమిషనరేట్ పరేడ్ గ్రౌండ్స్‌లో జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో 65వ గణతంత్ర దినోత్సవం నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన కలెక్టర్ జాతీయపతాకాన్ని ఆవిష్కరించి, పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం జిల్లాలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను వివరిస్తూ కలెక్టర్ ప్రసంగించారు.
అవి ఆయన మాటల్లోనే...
భూమిలేని నిరుపేదలకు సాగుభూమి కల్పించే భూపంపిణీ కార్యక్రమంలో భాగంగా జిల్లాలో 666మంది పేదలకు 1,106 ఎకరాల భూమిని పంపిణీ చేసి పట్టా సర్టిఫికెట్లు అందజేశామన్నారు. అదేవిధంగా ఇప్పటివరకు జిల్లాలో 2లక్షల మంది పేదల సొంతింటి కల నెరవేర్చేందుకు ఉచితంగా ఇళ్ల స్థలాలు పంపిణీ చేశామన్నారు. ఇందిరమ్మ ఇళ్ల పథకంలో మూడు విడతల కింద 2,63,820 మంది పేదలకు ఇళ్లు మంజూరు చేశామన్నారు.
ఈ ఆర్థిక సంవత్సరం ఖరీఫ్, రబీ సీజన్లలో రైతులకు పావలా వడ్డీపై రూ.537కోట్ల పంట రుణాలు విడుదల చేశామని కలెక్టర్ తెలిపారు. పేద రైతులకు 74వేల వ్యవసాయ కనెక్షన్లు ఉచితంగా ఇచ్చామన్నారు. 400కేవీ సామర్థ్యం గల 3సబ్‌స్టేషన్లు, 132కేవీ సామర్థ్యంగల 2సబ్‌స్టేషన్లు, 220కేవీ సామర్థ్యం గల ఒక సబ్‌స్టేషన్, 33 కేవీ సామర్థ్యం గల 9సబ్‌స్టేషన్లు కొత్తగా నిర్మించామన్నారు.
ఆడపిల్లల బంగారు భవిష్యత్తు కోసం అమలుచేస్తున్న బంగారు తల్లి పథకంతో జిల్లాలో 42వే ల కుటుంబాలకు లబ్ధి చేకూరిందన్నారు. స్త్రీనిధి పథకంలో భాగంగా ఈ ఆర్థిక సంవత్సరంలో 24వేల మంది మహిళలకు రూ.41కోట్ల రుణాలు అందించామన్నారు. అభయహస్తం పథకంతో జిల్లాలో 10వేల మంది సభ్యులకు ప్రతి నెల రూ.500 చొప్పున పింఛన్లు పంపిణీ చేస్తున్నామన్నారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్లు చంపాలాల్, ఎంవీరెడ్డి, ఎస్పీ రాజకుమారి, డీసీపీ కాంతిలాల్ రాణా తదితరులు పాల్గొన్నారు.
స్వయం ఉపాధికి ప్రోత్సాహం
Published Sun, Jan 26 2014 10:50 PM | Last Updated on Fri, Nov 9 2018 5:52 PM
Advertisement
Advertisement