స్ట్రాంగ్‌రూంల భద్రతపై నిర్లక్ష్యం వద్దు | Do not neglect the security of strong rooms | Sakshi
Sakshi News home page

స్ట్రాంగ్‌రూంల భద్రతపై నిర్లక్ష్యం వద్దు

Published Sun, May 4 2014 12:18 AM | Last Updated on Tue, Aug 14 2018 3:37 PM

Do not neglect the security of strong rooms

అనంతగిరి, న్యూస్‌లైన్: ఈవీఎంలు భ ద్రపరిచిన స్ట్రాంగ్‌రూంల వద్ద  భద్రత ఏర్పాట్లపై  నిర్లక్ష్యం వహించకూడదని, వాటిపై నిరంతర పర్యవేక్షణ తప్పనిసరిగా చేపట్టాలని, లాగ్‌బుక్‌లు, సీసీ టీవీలపై రిటర్నింగ్ అధికారుల పర్యవేక్షణ ఉండాలని జిల్లా కలెక్టర్ బి.శ్రీధర్ అధికారులకు సూచించారు. శనివారం వికారాబాద్ మహావీర్ వైద్య కళాశాలలోని పరిగి, తాండూరు, వికారాబాద్‌కు సంబంధించిన స్ట్రాంగ్‌రూంలను ఆయన పరిశీలించారు.

 మొత్తం ఎంతమంది పోలీసులతో భద్రత ఏర్పాట్లను చూస్తున్నారని ఆయన పోలీస్ అధికారులను ప్రశ్నించారు. స్ట్రాంగ్‌రూంల వద్ద  కళాశాల నిర్మాణ పనులకు సంబంధించిన మెటీరియల్ ఎందుకు ఉందని.. దాన్ని వెంటనే ఇక్కడి నుంచి తొలగించాలని ఆయన అధికారులను ఆదేశించారు. స్ట్రాంగ్‌రూం సమీపంలో ఎలాంటి వస్తువులు ఉంచకూడదని ఆదేశించారు. స్ట్రాంగ్‌రూం భద్రత విషయంలో ఇన్‌చార్జి అధికారి ఎవరని ఆయన పోలీసులను ప్రశ్నించారు. ఇక్కడ ఎస్‌ఐ ఉన్నాడని.. ప్రస్తుతం ఆయన బయటికి వెళ్లాడని వికారాబాద్ సీఐ లచ్చిరాం నాయక్ బదులిచ్చారు. ఇన్‌చార్జిగా ఎవరినైతే నియమించామో ఆ అధికారి ఇక్కడే ఉండాలి కదా అని కలెక్టర్ పేర్కొన్నారు.

లాగ్‌బుక్ ఎక్కడ ఉందని ఆరా తీయగా ఎవరూ సరైన సమాధానం ఇవ్వకపోవడంతో అధికారులపై శ్రీధర్ ఆగ్రహం, అసహనం వ్యక్తం చేశారు. స్ట్రాంగ్‌రూంల వద్ద గట్టి భద్రత ఉండాలని అడిషనల్‌ఎస్పీ వెంకటస్వామిని ఆయన ఆదేశించారు. ఈ సందర్భంగా  స్ట్రాంగ్ రూం భద్రతపై రిటర్నింగ్ అధికారులకు, పోలీస్ సిబ్బందికి పలు సూచనలు చేశారు. స్థానిక పోలీస్ శాఖ నుంచి ముఖ్య ద్వారం వద్ద భద్రత పటిష్టం చేయాలని, స్థానిక సివిల్ పోలీస్ అధికారిని ఇక్కడ ఇన్‌చార్జిగా నియమించాలని కలెక్టర్ ఆదేశించారు. అనంతరం సీసీ టీవీలు ఏర్పాటు చేసిన కంట్రోల్ రూంను, కౌంటింగ్ హాల్‌ను పరిశీలించారు.

 కౌంటింగ్ రోజు మీడియా సెంటర్‌ను ఏర్పాటు చేయాలన్నారు. లోపలికి ఎవరూ రాకుండా గట్టి భద్రత చేపట్టాలన్నారు. కలెక్టర్ వెంట సబ్ కలెక్టర్ ఆమ్రపాలి, పరిగి రిటర్నింగ్ అధికారి సంధ్యారాణి, చేవేళ్ల ఆర్డీఓ చంద్రశేఖర్‌రెడ్డి, అడిషనల్ ఎస్పీ వెంకటస్వామి, డీఎస్‌పీ నర్సింలు, ఆయా నియోజకవర్గాల అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులు ఉన్నారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement