ఎన్నికలు సమర్థవంతంగా నిర్వహించాం
సాక్షి, రంగారెడ్డి: మహాయజ్ఞంలాంటి సార్వత్రిక ఎన్నికలను సమర్థవంతంగా నిర్వహించినందుకు ఎన్నికల అధికారులు, స్వచ్ఛంద సంస్థల కార్యకర్తలు, ఓటర్లకు జిల్లా కలెక్టర్ బి. శ్రీధర్ కృతజ్ఞతలు తెలిపారు. సోమవారం నగరంలోని ఓ హోటల్‌లో సార్వత్రిక ఎన్నికలపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రంగారెడ్డి జిల్లాలో ఎన్నికలు నిర్వహించడమంటే అటు హైదరబాద్‌తో కలిపి రెండు జిల్లాల్లో ఎన్నికలు నిర్వహించడంతో సమానమన్నారు. 2 వేల మంది కళాశాల విద్యార్థులతో పోలింగ్ కేంద్రాల వెబ్‌కాస్టింగ్ నిర్వహించామని, 5 వేల మంది ఎన్‌ఎస్‌ఎస్ వలెంటీర్లను ఎన్నికల నిర్వహణకు వినియోగించుకున్నామన్నారు.
దాదాపు 35 వేల మంది సిబ్బందితో జిల్లాలో సార్వత్రిక ఎన్నికలను సమర్థవంతంగా నిర్వహించినట్టు పేర్కొన్నారు. ఇదే స్ఫూర్తితో ఈనెల 16న ఓట్ల లెక్కింపును విజయవంతం చేయాలని అధికారులను కోరారు. ఎన్నికల తనిఖీల్లో భాగంగా జిల్లాలో రూ. 22 కోట్ల నగదును స్వాధీనం చేసుకున్నట్టు చెప్పారు. ఓటింగ్ శాతాన్ని పెంచేందుకు ఎన్నో అవగాహన కార్యక్రమాలు నిర్వహించి 2009 పోలింగ్ శాతానికి చేరువగా వచ్చామని కలెక్టర్ పేర్కొన్నారు.
సైబరాబాద్ పోలీసు కమిషనర్ సి. వి ఆనంద్ మాట్లాడుతూ రెండు నెలలుగా మున్సిపల్, ప్రాదేశిక, పంచాయితీ, సార్వత్రిక ఎన్నికల బందోబస్తును సమర్థవంతంగా నిర్వహించామన్నారు. సమావేశంలో జేసీలు చంపాలాల్, ఎం. వి రెడ్డి, సైబరాబాద్ జాయింట్ కమిషన్ గంగాధర్, వికారాబాద్ సబ్ కలెక్టర్ ఆమ్రపాలి, డీఆర్‌వో వెంకటేశ్వర్లు, రిటర్నింగ్, సహాయ రిటర్నింగ్ అధికారులు పాల్గొన్నారు.