సాక్షి, రంగారెడ్డిజిల్లా ప్రతినిధి : సార్వత్రిక ఎన్నికల నిర్వహణకు జిల్లా యంత్రాంగం సన్నద్ధమవుతోంది. సజావుగా ఎన్నికలు జరపడానికి సమర్థ అధికారులను రంగంలోకి దించేందుకు కసరత్తు ముమ్మరం చేసింది. ఎన్నికల కమిషన్ మార్గదర్శకాలను కచ్చితంగా అమలు చేసేందుకు వీలుగా జిల్లా స్థాయి అధికారులను నోడల్ ఆఫీసర్లుగా నియమిస్తోంది.
ఇందులో భాగంగా గురువారం నోడల్ అధికారులతో కలెక్టర్ బి.శ్రీధర్ ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు. నోటిఫికేషన్ వెలువడింది మొదలు.. ఫలితాలు ప్రకటించేవరకు ఈ అధికారులు పూర్తిస్థాయిలో ఎన్నికల విధుల్లో నిమగ్నం కావాల్సివుంటుంది. మరో వారం రోజుల్లో తహసీల్దార్ల బదిలీల ప్రక్రియ ముగియనుండడంతో అప్పటిలోగా కొత్త టీమ్‌ను సిద్ధం చేయాలని కలెక్టర్ భావిస్తున్నారు. నోడల్ ఆఫీసర్లకు సహా యకులుగా కలెక్టరేట్‌లోని వివిధ సెక్షన్ల సూపరింటెండెంట్లను నియమించనున్నారు.
నిబంధనలు కఠినం
ఎన్నికల్లో మద్యం, ధన ప్రవాహన్ని అరికట్టేందుకు కేంద్ర ఎన్నికల సంఘం నిబంధనలను కఠినతరం చేసింది. నియమావళిని తూ.చ. తప్పకుండా పాటించేందుకు వీలుగా మార్గదర్శకాలను రూపొందించడమే కాకుండా.. అమలుకు మరింత మంది అఖిల భారత సర్వీసుల అధికారులను ఎన్నికల విధుల్లో వినియోగించుకోవాలని నిర్ణయించింది. వచ్చే ఎన్నికలను సమర్థవంతగా నిర్వహించేందుకు వివిధ స్థాయిల్లో అధికారుల బృందాలను నియమిస్తోంది.
ఇప్పటివరకు అభ్యర్థులు సమర్పించే ఎన్నికల ఖర్చుపై నిఘా వహించే పరిశీలకులు ఈసారి మాత్రం వ్యయంపై ప్రత్యేకంగా దృష్టి సారించనున్నారు. అభ్యర్థులు ఇచ్చే కాకిలెక్కలే కాకుండా ‘షాడో’ రిజిస్టర్‌ను నిర్వహించనున్నారు. ప్రతిరోజు మండలాల నుంచి వచ్చే వీడియో క్లిప్పింగ్స్ ఆధారంగా అభ్యర్థుల ఖర్చుపై అంచనాలు రూపొందించేందుకు జిల్లా/అసెంబ్లీ స్థాయిలో వీడియో వ్యూయింగ్ టీంను ఏర్పాటు చేయనున్నారు.
ఈ బృందం అభ్యర్థుల వ్యయాన్ని లెక్కగట్టనుంది. ఈ వివరాలను ‘షాడో’ రిజిస్టర్‌లో పొందుపరుస్తారు. దీన్ని పరిగణనలోకి తీసుకొని అభ్యర్థుల వ్యయంపై ఒక నిర్ధిష్ట అభిప్రాయానికి వస్తారు. పరిశీలకుడికి సహకరించేందుకు వీడి యో వ్యూయింగ్ టీం, అకౌంటింగ్ టీం, కంట్రో ల్ రూమ్, మీడియా సర్టిఫికేషన్ మానిటరింగ్ కమిటీ, ఫ్లైయింగ్ స్క్వాడ్స్, నిఘా బృందాలను ఏర్పాటు చేస్తున్నారు. గతంతో పోలిస్తే ఈసారి నిఘాను పెంచేందుకు రెట్టింపు స్థాయిలో ఉద్యోగులను ఎన్నికల విధులకు ఉపయోగించుకోవాలని ఈసీ నిర్ణయించింది.
సార్వత్రిక ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించేందుకు ఎలక్షన్ కమిషన్ కొత్త నియమావళిని రూపొందించింది. దీనిపై ఐఏఎస్, ఐపీఎస్, ఐఆర్‌ఎస్ అధికారులకు అవగాహన కల్పించేం దుకు ఫిబ్రవరి 5న జూబ్లీహాల్‌లో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసింది. దీనికి కేంద్ర ఎన్నికల కమిషన్ డిప్యూటీ కమిషనర్ హాజరుకానున్నారు. ఈసీ నిబంధనలను కఠినతరం చేయాలని నిర్ణయించిన నేపథ్యంలో అందుకనుగుణంగా క్షేత్రస్థాయిలో జిల్లా యంత్రాంగం ఏర్పాట్లు చేస్తోంది. ఈ మేరకు సమర్థ అధికారులతో కూడిన కొత్త జట్టు ఎంపికపై జిల్లా కలెక్టర్ బి.శ్రీధర్ కసరత్తు చేస్తున్నారు.
‘ఎన్నికల టీం’పై కసరత్తు
Published Wed, Jan 29 2014 11:03 PM | Last Updated on Wed, Mar 28 2018 10:59 AM
Advertisement
Advertisement