పోలీసుల తనిఖీల్లో మైతాప్‌ఖాన్‌గూడ బెల్టు షాపుల్లో లభ్యమైన మద్యం బాటిళ్లు (ఫైల్)
నవాబుపేట : గ్రామాల్లో ప్రజలకు తాగునీరు దొరకడం లేదు గానీ మద్యం మాత్రం పుస్కలంగా దొరుకుతోంది. నవాబుపేట మండల పరిధిలోని గ్రామాల్లో బెల్టుషాపుల దందా జోరుగా కొనసాగుతుంది. అమ్మకాలు నిలిపివేయాలని అధికారులకు ఆయా గ్రామాల ప్రజలు పలుమార్లు విన్నవించినా.. పట్టించుకోవడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. గ్రామాల్లోని కిరాణం షాపులు బెల్టు షాపులగా దర్శనమిస్తున్నాయి.
మండల పరిధిలోని గంగ్యాడ, గుబ్బడిపత్తేపూర్, ఎల్లకొండ, అక్నాపూర్, మమ్మదాన్‌పల్లి, కొజ్జవనంపల్లి, కడ్చర్ల, మూలమాడ, చిట్టిగిద్ద రైల్వేస్టేషన్, మైతాప్‌ఖాన్‌గూడ తదితర గ్రామాల్లోని కిరాణం షాపుల్లో మద్యం విరివిగా దొరుకుతుంది. కొంత మంది షాపుల్లో కాకుండా ఇరుగుపొరుగు ఇళ్లలో మద్యం పెట్టి అడిగిన వారికి తీసుకొచ్చి అమ్ముకుంటున్నారు.
తూతూ మంత్రంగా తనిఖీలు
ముఖ్యంగా గంగ్యాడలో 8 కిరాణం షాపులు ఉండగా అందులో 7 దుకాణాల్లో మద్యం విచ్చలవిడిగా దొరుకుతుంది. నిత్యం రూ. 50 వేల వరకు మద్యం అమ్మకాలు జరుగుతున్నాయి. అలాగే మెతాప్‌ఖాన్‌గూడ గ్రామంలో సైతం అదే పరిస్థితి. ఇటీవల గ్రామంలో పోలీసులు కార్టన్ సెర్చ్ చేయగా భారీగా మద్యం బాటిళ్లు లభ్యమయ్యాయి.
ఎక్సైజ్ అధికారులు, పోలీసులు తూతూ మంత్రంగా తనిఖీలు చేసి వదిలేస్తున్నారని ఆయా గ్రామాల ప్రజలు పేర్కొంటున్నారు. దాన్ని ఆసరాగా చేసుకున్న బెల్టు షాపుల యజమానులు విచ్చలవిడిగా మద్యం అమ్మకాలకు పాల్పడుతున్నారు.
బోనాల పండుగకు భారీగా మద్యం నిల్వ
నవాబుపేట మండలంలో సోమవారం బోనాల పండుగ నేపథ్యంలో బెల్టు షాపుల యజమానులు భారీగా మద్యాన్ని కొనుగోలు చేసి నిల్వ చేసుకున్నట్లు సమాచారం. మద్యాన్ని ఎమ్మార్పీ రేట్లకు కాకుండా క్వాటర్‌పై రూ. 30 అదనంగా అమ్ముకుంటున్నారు. అధిక రేట్లు అని నిలదీస్తే మావద్ద మద్యం లేదని పంపిస్తారు. దీంతో చేసేదేమీ లేక వారు అమ్మిన ధరలకే కొనుగోలు చేస్తున్నారు.
అమ్మకాలు అడ్డుకునేవారే లేరు
సర్పంచ్‌గా గెలువగానే గ్రామస్తుల అభిప్రాయంతో మద్యం అమ్మరాదని తీర్మానం చేశాం. అయినా ఎవరూ పట్టించుకోలేదు. అధికారులకు తెలిపినా నామమాత్రపు తనిఖీలు చేసి వెళ్లిపోయారు. అధికారుల అండతో ఇష్టం వచ్చినట్లు మద్యాన్ని అమ్ముతున్నారు. అక్రమ మద్యం అమ్మకాలను ఆపే వారే లేరు.
– గోవిందమ్మ, గంగ్యాడ మాజీ సర్పంచ్
అధికారుల నిర్లక్ష్యంతోనే..
గ్రామంలో మద్యం విచ్చలవిడిగా దొరుకుతోంది. పలుమార్లు నేనే స్వయం గా ఎక్సైజ్ అధికారులకు ఫోన్ చేసి చెప్పినా పట్టించుకోలేదు. బెల్టుషాపులు నడుస్తున్నాయని తెలిసి కూడా అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. అధికారుల కనుసన్నల్లోనే బెల్టుషాపులు నడుస్తున్నాయి. ఉన్నతాధికారులు స్పందించాలి.
– గోపాల్‌గౌడ్ అక్నాపూర్, మాజీ సర్పంచ్
చర్యలు తీసుకుంటాం
నవాబుపేట మండలంలోని పలు గ్రామాల్లో అక్రమంగా మద్యం అమ్ముతున్నట్లు మాకు సమాచారం అందింది. ఇది వరకు దాడులు చేసి పలువురిపై కేసులు కూడా నమోదు చేశాం. మళ్లీ దాడులు చేస్తాం. క్రిమినల్ కేసులు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకుంటాం.
– ఎస్‌ఐ నాగేష్, నవాబుపేట
Comments
Please login to add a commentAdd a comment