నగదుతో పట్టుబడితే అంతే.. | Telangana Election Black Money Siege | Sakshi
Sakshi News home page

నగదుతో పట్టుబడితే అంతే..

Published Sun, Oct 28 2018 12:10 PM | Last Updated on Sun, Oct 28 2018 12:10 PM

Telangana Election Black Money Siege - Sakshi

పాల్మాకుల వద్ద వాహనాలను తనిఖీ చేస్తున్న ఎన్నికల అధికారులు, పోలీసులు

శంషాబాద్‌ రూరల్‌(రాజేంద్రనగర్‌): ఎన్నికల కోడ్‌ అమలు నేప«థ్యంలో వాహనాల తనిఖీలో పట్టుబడుతున్న నగదుకు లెక్క తేలేలా కనిపించడంలేదు. ఇప్పటి వరకు జిల్లాలో రూ.68 లక్షల నగదు పట్టుబడగా.. వీటికి సరైన ఆధారాలు లేకపోవడంతో ఫ్లయింగ్‌ స్క్వాడ్‌ అధికారులు ఐటీశాఖకు అప్పగించారు. ఒక వ్యక్తి వద్ద రూ.2లక్షలకు పైగా నగదు దొరికితే వాటికి సంబంధించిన పక్కా ఆధారాలు చూపించాలి. కానీ గత కొన్ని రోజుల వ్యవ«ధిలో వాహనాల తనీఖీల్లో అధిక మొత్తంలో నగదు పట్టుబడింది. వ్యాపారం, వివిధద అవసరాల నిమిత్తం జనం ఎక్కువ మొత్తంలో నగదును తరలిస్తున్నారు.

ఒక వేళ పట్టుబడితే వాటికి సంబంధించిన సరైన లెక్కలు చూపించలేకపోతున్నారు. తెలంగాణ శాసనసభ ఎన్నికల షెడ్యూల్‌ను కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించడంతో ఈ నెల 7 నుంచి ఎన్నికల ప్రవర్తనా నియమావళి పూర్తిస్థాయిలో అమల్లోకి వచ్చింది. డిసెంబర్‌ 7న ఎన్నికలు జరుగనున్నాయి. ఈ నేపథ్యంలో డబ్బు తరలింపుపై పోలీసులు గట్టి నిఘా పెట్టారు.
 
రియల్‌ ఎస్టేట్‌ డబ్బులకు ఆధారాలు ఎలా? 
ఇప్పటి వరకు పట్టుబడిన నగదులో రెండు చోట్ల రియల్‌ ఎస్టేట్‌ వ్యాపార లావాదేవీలకు సంబం«ధించిన డబ్బులుగా బాధితులు పేర్కొంటున్నారు. అయినప్పటికీ వీటి తాలూకు ఆధారాలు ఐటీ శాఖకు చూపించడం కష్టమే. ఏదైనా స్థలం, భూములకు సంబంధించి ప్రభుత్వ విలువకు, బహిరంగ మార్కెట్‌ విలువకు చాలా వ్యత్యాసం ఉంటుంది. పట్టుబడిన నగదుకు సంబం«ధించి ఏదైనా కొనుగోలు, అమ్మకం దస్తావేజులు చూపించినా.. అందులో పేర్కొనే ఆస్తి విలువకు, బహిరంగ మార్కెట్‌లో ఆస్తి విలువ తేడా వస్తుంది. దీంతో ఇలాంటి లావాదేవీలకు సంబంధించిన నగదు పట్టుబడితే ఆధారాలు చూపించలేక ఇక ఆ డబ్బులను వదలిలేసుకోవాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. వాహనాల తనిఖీల నేపథ్యంలో రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులు తగు జాగ్రతలు తీసుకుంటున్నారు. కొందరు వ్యాపారు ఎన్నికలు ముగిసే వరకు లావాదేవీలు వాయిదా వేసుకుంటున్నారు. 

అప్పుడే సర్దుకున్న అభ్యర్థులు..! 
ఇదిలా ఉంటే.. ఎన్నికల్లో పోటీకి దిగుతున్న రాజకీయ నాయకులు ఇప్పటికే నగదును సర్దుబాటు చేసుకున్నట్లు తెలుస్తోంది. నగదుతో పట్టుబడితే అసలుకే ఎసరు వచ్చే అవకాశాలుండడంతో చాలా జాగ్రత్తగా వ్యవహారాలు నడిపిస్తున్నట్లు వినికిడి. చాలా మంది అభ్యర్థులు ఎన్నికల్లో ఖర్చుల కోసం నగదును వారి అనుచరులు, నమ్మకస్తుల వద్ద దాచినట్లు సమాచారం. 

పాల్మాకుల వద్ద కారులో రూ.17,26,000 నగదు లభ్యం 
శంషాబాద్‌ రూరల్‌(రాజేంద్రనగర్‌): కారులో తరలిస్తున్న రూ.17,26,000 నగదును ఎన్నికల ఫ్లైయింగ్‌ స్క్వాడ్‌ అధికారులు పట్టుకున్నారు.  శంషాబాద్‌ మండలంలోని పాల్మాకుల వద్ద బెంగళూరు జాతీయ రహదారి, పీ–వన్‌ రోడ్డులో శుక్రవారం రాత్రి వాహనాల తనిఖీలు చేపట్టారు. ఈ సమయంలో మహేశ్వరం మండలంలోని డబిల్‌గూడ వాసి ఎ.యాదయ్య కారులో శంషాబాద్‌ వైపు నుంచి స్వగ్రామానికి వెళ్తున్నాడు. వాహనాన్ని ఆపి తనిఖీ చేయగా అందులో నగదు దొరికింది. ఓ స్థలం రిజిస్ట్రేషన్‌ కోసం తీసుకెళ్లిన డబ్బును తిరిగి తీసుకుని వెళ్తుండగా పట్టుబడ్డారు. స్వాధీనం చేసుకున్న డబ్బును ఇన్‌కంటాక్స్‌ అధికారులకు అప్పగించనున్నట్లు ఫ్లైయింగ్‌ స్క్వాడ్‌ అధికారులు శంకర్, సుజిత్‌రెడ్డి తెలిపారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement