సాక్షి, మెదక్: పంచాయతీ ఎన్నికల నిర్వహణకు అధికారులు వేగంగా ఏర్పాట్లు చేస్తున్నారు. వారం, పది రోజుల్లో ఎన్నికల నోటిఫికేషన్ రానున్నట్లు తెలుస్తోంది. దీంతో అధికార యంత్రాంగం ఎన్నికల నిర్వహణపై దృష్టి పెట్టింది. శనివారం బీసీ ఓటర్ల తుది జాబితాను ప్రచురించనున్నారు. బీసీ ఓటర్ల జాబితా ప్రచురణతో రిజర్వేషన్ల ప్రక్రియకు మార్గం సుగమం కానుంది. రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఆదేశాలకు అనుగుణంగా రిజర్వేషన్ల ప్రక్రియ చేపట్టేందుకు అధికారులు సిద్ధం అవుతున్నారు. అలాగే ఎన్నికల నిర్వహణపైనా అధికారులు కసరత్తు ప్రారంభించారు. జిల్లాలో మొత్తం 469 పంచాయతీలు ఉన్నాయి. ఆయా పంచాయతీల పరిధిలో మొత్తం 4086 వార్డులు ఉన్నాయి. జిల్లాలోని 20 మండలాల్లోని 469 పంచాయతీల్లో మూడు విడతల్లో ఎన్నికలు నిర్వహించాలని గతంలో నిర్ణయం తీసుకున్నారు. అయితే తాజాగా రెండు విడతల్లో ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
రెండు లేదా మూడు విడతల ఎన్నికల నిర్వహణపై సోమవారం కలెక్టర్ ధర్మారెడ్డి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఎన్నికల నిర్వహణ కోసం అవసరమైన సిబ్బందిని సమకూర్చుకోవడం, శిక్షణపైనా అధికారులు దృష్టి సారించారు. ఎన్నికల నిర్వహణ కోసం రిటర్నింగ్ ఆఫీసర్లు, అసిస్టెంట్ రిటర్నింగ్ ఆఫీసర్లు, పోలింగ్ సిబ్బంది మొత్తం 600మందికి పైగా అవసరం కానున్నారు. రిటర్నింగ్ ఆఫీసర్, అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులకు ఎన్నికల నిర్వహణపై శనివారం (నేడు) శిక్షణ ఇవ్వనున్నారు. మిగతా పోలింగ్ సిబ్బందికి మండల స్థాయిలో ఈ నెల 23 నుంచి శిక్షణ ఇచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. పంచాయతీ, వార్డుల వారిగా ఓటర్ల జాబితాను ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంచనున్నారు. సవరించిన ఓటర్ల జాబితాను పంచాయతీ అధికారులు ఆన్‌లైన్‌లో ఉంచుతున్నారు. ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైన వెంటనే ఎన్నికల నిర్వహణకు వీలుగా అధికారులు బ్యాలెట్ బాక్సులను, బ్యాలెట్ పేపర్లను సిద్ధంగా ఉంచారు.
పోరుకు పార్టీలు సై..
పంచాయతీ పోరుకు పార్టీలు సన్నద్ధమవుతున్నాయి. సమరోత్సాహంలో ఉన్న టీఆర్‌ఎస్ పార్టీ పంచాయతీ ఎన్నికలకు సిద్ధమైంది. ఇటీవలే అసెంబ్లీ ఎన్నికల్లో జిల్లాలోని రెండు అసెంబ్లీ స్థానాలను టీఆర్‌ఎస్ కైవసం చేసుకుంది. దీంతో ఆ పార్టీ రెట్టించిన ఉత్సాహంతో ఎన్నికలకు సిద్ధమవుతోంది. మెదక్, నర్సాపూర్ ఎమ్మెల్యేలు పద్మాదేవేందర్‌రెడ్డి, మదన్‌రెడ్డిలు పంచాయతీ ఎన్నికలపై దృష్టి పెట్టారు. పంచాయతీల్లో గెలుపు గుర్రాలను ఎంపిక చేసే పనిలో నిమగ్నమయ్యారు. అసెంబ్లీ ఫలితాలతో కాంగ్రెస్ ఢీలా పడింది. అయితే పంచాయతీ ఎన్నికల్లోనైనా తమ సత్తా చాటాలని కాంగ్రెస్ భావిస్తోంది. ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించేందుకు త్వరలో జిల్లా కాంగ్రెస్ నాయకులు సమావేశం కానున్నారు. బీజేపీ, సీపీఎం, సీపీఐ తదితర పార్టీలు సైతం పంచాయతీ ఎన్నికలపై దృష్టి పెట్టాయి.
ఎన్నికల నిర్వహణకు సిద్ధంగా ఉన్నాం
పంచాయతీ ఎన్నికల నిర్వహణకు సిద్ధంగా ఉన్నాం.రాష్ట్ర ఎన్నికల సంఘం పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేసిన వెంటనే వాటి నిర్వహణకు ఏర్పాట్లు చేస్తాం. శనివారం బీ సీ ఓటర్ల తుది జాబితాను ప్రకటించనున్నాం. ఎన్నికల సంఘం ఆదేశాలకు అనుగుణంగా రిజర్వేషన్ల ప్రక్రియ చేపట్టేందుకు రెడీ అయ్యాం. ఎన్నికల ని ర్వహణకు వీలుగా పోలింగ్ సిబ్బందికి త్వరలో శిక్ష ణ తరగతులు నిర్వహించనున్నాం. – హనోక్, డీపీఓ
Comments
Please login to add a commentAdd a comment