మహేశ్వరం బహిరంగ సభలో మాట్లాడుతున్న కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్
మహేశ్వరం: తెలంగాణలో సీఎం కేసీఆర్ కుటుంబ, నియంత, నిరంకుశ పాలనతో మరో నిజాంలా వ్యవహస్తున్నారని, ఆయనకు ఓటు ద్వారా చరమగీతం పాడాలని కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్‌నా«థ్‌సింగ్ అన్నారు. గురువారం మహేశ్వరం మండల కేంద్రంలో జరిగిన బీజేపీ ఎన్నికల ప్రచార సభలో ఆయన మాట్లాడారు. తెలంగాణలో టీఆర్‌ఎస్ పాలనలో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారని, రైతులు పండించిన పంటలకు సరైన గిట్టుబాటు ధర ఇవ్వకుండా మోసం చేసిందన్నారు. ఇప్పటి వరకు 4500 మంది రైతులు ఆత్మ హత్య చేసుకున్నారని, తెలంగాణలో మానవ వనరులు, పకృతి వనరులు సమృద్ధిగా ఉన్నా కేసీఆర్ వాటిని వినియోగించుకోవడంలో విఫలమయ్యారని అన్నారు. కేసీఆర్ మైనార్టీలకు 12 శాతం రిజర్వేషన్లు ఇస్తామని ఉచిత హామీలిస్తున్నారు గానీ, ఎవరి రిజర్వేషన్లు కట్ చేసి ఇస్తారో తెలపాలని రాజ్‌నాథ్‌సింగ్ డిమాండ్ చేశారు.
టీఆర్‌ఎస్ ప్రభుత్వం అధికారంలోకి రాకముందు రాష్ట్రానికి తొలి ముఖ్య మంత్రి దళితుడినే చేస్తానని, దళితులకు మూడెకరాల భూమి పంపిణీ, అర్హులకు డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు ఇస్తానని, ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్లను పెంచుతామని చెప్పి ఎన్నికల్లో గెలుపొందిన తర్వాత ఒక్క హామీ నేరవేర్చకుండా మోసం చేశారని విమర్శించారు. తెలంగాణలో కేసీఆర్, ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబు నాయుడు ఇద్దరూ అభివృద్ధి గురించి పట్టించుకోలేదన్నారు. కాంగ్రెస్, టీడీపీలు అనైతికంగా స్నేహం చేయడంతో ఎన్టీఆర్ ఆత్మ ఘోషిస్తుందన్నారు. కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా పుట్టిన టీడీపీ ఈ రోజు చంద్రబాబు రాజకీయ లబ్ధికోసం కాంగ్రెస్‌తో జతకట్టడంతో జనం అసహ్యించుకుంటున్నారన్నారు.
తెలంగాణలో టీఆర్‌ఎస్, కాంగ్రెస్, టీడీపీలు మతతత్వ, కుల రాజకీయాలను పెంచి పోషించి ప్రజలను విభజించి పాలిస్తున్నాయన్నారు. కాంగ్రెస్, టీడీపీలు కలిసి ప్రధాని మోదీని ఎదుర్కోవడానికి ఎన్ని కుటిల కూటములు ఏర్పాటు చేసినా ఏమీ చేయలేరన్నారు. బీజేపీ ప్రభుత్వంలో మూడు కొత్త రాష్ట్రాలు చత్తీస్‌గడ్, ఉత్తరాఖండ్, జార్ఖండ్‌లను ఏర్పాటు చేశామని, ప్రస్తుతం ఆ రాష్ట్రాల్లో ఎలాంటి సమస్యలులూ లేకుండా అభివృద్ధి పథంలో కొనసాగుతున్నాయన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రాలను ఏర్పాటు చేసి సమస్యలు తెచ్చిపెట్టిందన్నారు. సుస్థిర, సుపరిపాలన బీజేపీతోనే సాధ్యమన్నారు. దేశం నరేంద్రమోదీ నాయకత్వంలో అభివృద్ధి, సంక్షేమం వైపు దూసుకెళ్తుందన్నారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులను వాడుకొని తామే చేశామని రాష్ట్ర ప్రభుత్వాలు చెప్పుకుంటున్నాయన్నారు. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తే రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ చేస్తామని రాజ్‌నాథ్ హామీ ఇచ్చారు. మహేశ్వరం నియోజకవర్గ బీజేపీ అభ్యర్థి అందెల శ్రీరాములు యాదవ్‌కు ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. శ్రీరాములు యాదవ్‌ను గెలిపిస్తే మరోమారు మహేశ్వరానికి వస్తానని తెలిపారు.
తెలంగాణ బీజేపితోనే వచ్చింది
బీజేపీ వల్లనే తెలంగాణ రాష్ట్రం వచ్చిందని కేంద్ర మాజీ మంత్రి బండారు దత్తాత్రేయ అన్నారు. తెలంగాణ రాష్ట్రం టీఆర్‌ఎస్, కాంగ్రెస్ పార్టీల వల్ల రాలేదని, బీజేపీ లేకుంటే రాష్ట్రం వచ్చేది కాదన్నారు. 2014 ఎన్నికల్లో బీజేపీ– టీడీపీ మద్దతుతో గెలుపొందిన తీగల కృష్ణారెడ్డి తన స్వార్ధం కోసం అధికార టీఆర్‌ఎస్ పార్టీలో చేరిపోయారన్నారు. టీఆర్‌ఎస్ పార్టీని చిత్తుగా ఓడించాలని ఆయన ప్రజలను కోరారు. బీజేపీ అభ్యర్థి అందెల శ్రీరాములు యాదవ్ మాట్లాడుతూ.. బడుగు, బలహీనవర్గాలకు చెందిన తనకు బీజేపీ టికెట్ ఇచ్చి పోటీ చేసే అవకాశం కల్పించిందని, తనకు ఓటు వేసి గెలిపించాలని కోరారు. తాను గెలుస్తే మహేశ్వరాన్ని అభివృద్ధి పథంలో తీసుకెళ్తానని తెలిపారు.
ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యదర్శి బెక్కం జనార్దన్‌రెడ్డి, జిల్లా అధ్యక్షుడు బొక్క నర్సింహారెడ్డి, రాష్ట్ర నాయకులు పాపయ్య, కడారి జంగయ్య, సుధాకర్ శర్మ, శంకర్‌రెడ్డి, మదన్‌మోహన్, మహేశ్వరం, కందుకూరు మండలాల అధ్యక్షుడు పోతర్ల సుదర్శన్‌యాదవ్, సాద మాల్లారెడ్డి, పార్టీ సినీయర్ నాయకులు ఎ.దేవేందర్‌రెడ్డి, మిద్దె సుదర్శన్‌రెడ్డి, రమేష్‌గౌడ్, కుండె వెంకటేష్, యాదిష్, యాదయ్య, దేశ్యానాయక్, చంద్రశేఖర్ యాదవ్, అనంతయ్య పలువురు పాల్గొన్నారు.
తెలుగులో మాట్లాడిన రాజ్‌నాథ్
కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్ తెలుగులో మాట్లాడి ప్రసంగాన్ని ప్రారంభించారు. ‘సోదర సోదరీమణులకు నమస్కారాలు, సభకు వచ్చినందుకు ప్రత్యేక ధన్యవాదాలు, తెలంగాణ అమరవీరులకు వందనాలు’ అని తెలుగులో మాట్లాడి సభికులను ఉత్తేజపరిచారు. సభకు భారీ ఎత్తున కార్యకర్తలు, మహిళలు హాజరయ్యారు.
కళాకారులు ఆట పాటలతో ఆలరించారు. సభ సాయంత్రం 4:30 గంటలకు ప్రారంభం కావాల్సి ఉండగా 5:30 గంటలకు ప్రారంభమైంది.
Comments
Please login to add a commentAdd a comment