సాక్షి, రంగారెడ్డి జిల్లా: ప్రభుత్వం ఈ ఆర్థిక సంవత్సరం నుంచి కొత్తగా ప్రవేశపెట్టిన ప్రాథమిక స్థాయి విద్యార్థులకు ఉపకారవేతనాల కార్యక్రమంతో పెద్దఎత్తున లబ్ధి చేకూరనున్నట్లు కలెక్టర్ బి.శ్రీధర్ పేర్కొన్నారు. అంబేద్కర్ విద్యా నిధితో విదేశాల్లో ఉన్నత విద్య అభ్యసించే అవకాశం కలిగిందని ఉద్ఘాటించారు. రాష్ట్ర అవతరణ వేడుకలను పురస్కరించుకుని శుక్రవారం గచ్చిబౌలిలోని సైబరాబాద్ పోలీసు పరేడ్ గ్రౌండ్స్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ముందుగా జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం జిల్లాలో సంక్షేమ పథకాల అమలు, అభివృద్ధి కార్యక్రమాలపై ప్రసంగించారు. ఎస్సీ విద్యార్థులకు మరింత మెరుగైన విద్యనందించేందుకు జిల్లాకు ఆరు ఇందిరమ్మ విద్యా నిలయాలను ప్రభుత్వం మంజూరు చేసిందని, త్వరలో అందుబాటులోకి తెస్తామన్నారు. ఈ ఏడాది నుంచి ఐదో తరగతి చదివే ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు ఉపకారవేతనాలు అందిస్తున్నట్లు వెల్లడించారు. సాంకేతిక విద్యను ప్రోత్సహించేందుకుగాను జిల్లాకు కొత్తగా 2 ఐటీఐ కాలేజీలు, మల్కాజ్‌గిరికి డిగ్రీ కాలేజీ ఇటీవల మంజూరయ్యాయన్నారు.
పాలన మరింత సులభతరం..
ప్రభుత్వ పాలనను మరింత సులభతరం చేయడంతోపాటు ప్రజలకు మెరుగైన సేవలందించేందుకు ప్రభుత్వం కొత్త రెవెన్యూ డివిజన్లు ఏర్పాటు చేసిందన్నారు. మీ సేవా కేంద్రాలతో రెవెన్యూ సేవలు వేగవంతమయ్యాయన్నారు. త్వరలో ఏడో విడత భూ పంపిణీ ద్వారా 1,106 ఎకరాలు భూమిని 666 మంది లబ్ధిదారులకు అందించనున్నట్లు చెప్పారు. జిల్లాలో ఇప్పటివరకు 2లక్షల మందికి ఇళ్ల స్థలాలు పంపిణీ చేశామన్నారు.
ైరె తులకు రుణాలు, రాయితీపై పనిముట్లు..
వ్యవసాయ రంగాన్ని పటిష్టం చేసేందుకు ప్రభుత్వం రైతాంగానికి వడ్డీలేని రుణాలిస్తోందన్నారు. ఇందులో భాగంగా ఈ ఏడాది ఖరీఫ్, రబీ సీజన్లో రూ.355కోట్ల రుణాలు పంపిణీ చేశామన్నారు. రూ. 5.61కోట్ల వ్యయంతో 50శాతం రాయితీపై పనిముట్లు అందిస్తున్నామన్నారు. ప్రజలకు నాణ్యమైన విద్యుత్తు అందించేందుకు గాను కొత్తగా 400కేవీ సామర్థ్యం గల మూడు సబ్‌స్టేషన్లు, 132 కేవీ సామర్థ్యం గల రెండు, 220కేవీ సామర్థ్యం గల ఒకటి, 33 కేవీ సామర్థ్యం గల 9 సబ్‌స్టేషన్లు రూ.271 కోట్లతో నిర్మిస్తున్నామన్నారు. కూరగాయలు, పూలు, పండ్లతోటల సాగును మరింత విస్తరించేందుకు జిల్లాకు అధికంగా పాలీహౌస్ యూనిట్లు ప్రభుత్వం మంజూరు చేసిందన్నారు.
అలరించిన సాంస్కృతిక ప్రదర్శనలు..
పాఠశాల విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ప్రదర్శనల్లో పాల్గొన్న విద్యార్థులకు కలెక్టర్ ప్రశంసాపత్రాలు అందించారు. మహిళా సంఘాలకు రూ.12కోట్ల రుణాలు, అభయ హస్తం కింద రూ.1.77కోట్ల పింఛన్లు, వికలాంగులకు 6 ట్రైసైకిళ్లు, ఆర్వీఎం ద్వారా 40 మంది విద్యార్థులకు 6.15లక్షల విలువైన వినికిడి యంత్రాలు పంపిణీ చేశారు.
కార్యక్రమంలో ఎస్పీ రాజకుమారి, జేసీ చంపాలాల్, జెడ్పీ సీఈఓ రవీందర్‌రెడ్డి, డీఆర్‌డీఏ పీడీ వరప్రసాద్‌రెడ్డి, డీఈఓ సోమిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
విద్యకు ప్రాధాన్యం
Published Sat, Nov 2 2013 1:45 AM | Last Updated on Thu, Jul 11 2019 5:01 PM
Advertisement