preference
-
కస్టమర్‌కు అనుకూలంగా సేవలు ఉండాలి
ముంబై: బ్యాంకులు కస్టమర్‌కు ప్రాధాన్యం ఇస్తూ, సౌకర్యవంతమైన సేవలు అందించేందుకు వీలుగా తగిన చర్యలు తీసుకోవాలంటూ ఆర్బీఐకి ప్యానెల్ సిఫారసు చేసింది. మరణించిన ఖాతాదారు వారసులు ఆన్లైన్లో క్లెయిమ్ చేసుకునేందుకు అనుమతించాలని, కేంద్రీకృత కేవైసీ డేటాబేస్ తదితర సూచలను ప్యానెల్ చేసిన వాటిల్లో ఉన్నాయి. మరీ ముఖ్యంగా పెన్షనర్లు లైఫ్ సర్టిఫికెట్‌ను బ్యాంకుకు సంబంధించి ఏ శాఖలో అయినా, ఏ నెలలో అయినా సమర్పించేందుకు అనుమతించాలని, దీనివల్ల రద్దీని నివారించొచ్చని పేర్కొంది. ఆర్బీఐ నియంత్రణలోని సంస్థల పరిధిలో వినియోగదారు సేవా ప్రమాణాల సమీక్షపై ఏర్పాటైన కమిటీ తన నివేదికను సమర్పించింది. గతేడాది మే నెలలో ఆర్బీఐ మాజీ డిప్యూటీ గవర్నర్ బీపీ కనుంగో అద్యక్షతన ఈ కమిటీని నియమించడం గమనార్హం. సూచనలు.. ఇంటి రుణాన్ని తీర్చివేసిన తర్వాత ప్రాపర్టీ డాక్యుమెంట్లను తిరిగి రుణ గ్రహీతకు స్వాధీనం చేసే విషయంలో నిర్ధేశిత గడువు ఉండాలి. గడువులోగా ఇవ్వకపోతే బ్యాంక్/ఎన్బీఎఫ్సీపై జరిమానా విధించాలి. డాక్యుమెంట్లు నష్టపోతే, వాటిని తిరిగి పొందే విషయంలో బ్యాంకులు తమ వంతు సహకారం అందించాలి. ఇందుకు అయ్యే వ్యయాలను బ్యాంకులే పెట్టుకోవాలి. కస్టమర్లకు సంబంధించి రిస్క్ కేటగిరీలను సూచించింది. వేతన జీవులు అయితే వారికి వచ్చే ఆదాయాన్ని పరిగణనలోకి తీసుకోవాలని, వారిని హై రిస్క్‌గా పరిగణించాల్సిన అవసరం లేదని పేర్కొంది. విద్యార్థులను తక్కువ రిస్క్ వారిగా కేటాయించొచ్చని సూచించింది. కస్టమర్లతో వ్యవహారాలు నిర్వహించే సిబ్బంది, వారి పట్ల దురుసుగా వ్యవహరించకుండా నిర్ణీత కాలానికోసారి తప్పనిసరి శిక్షణ పొందాలని కూడా పేర్కొంది. -
బంగారం పెరిగినా డాలరుకు ప్రాధాన్యం తగ్గదు..
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: బంగారం కొనుగోళ్లు భారీగా పెరిగితే డాలరు ప్రాధాన్యం కోల్పోతుందనుకోవడం సరైన అంచనా కాకపోవచ్చని ఆర్థిక నిపుణుడు, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ వి. విజయసాయి రెడ్డి తెలిపారు. డాలరు మారకం విలువ తగ్గినప్పుడల్లా బంగారం ధర పెరుగుతుందని, ఈ కారణంతో డాలరు పని ఇక అయిపోయిందనే పుకార్లు వినిపిస్తుంటాయని పేర్కొన్నారు. కానీ బలహీనపడిన ప్రతీసారీ అది పుంజుకుంటూనే ఉందని తెలిపారు. అత్యంత ఆధునిక ఆయుధాలు, టెక్నాలజీతో పాటు అంతర్జాతీయంగా ఆర్థిక వ్యవహారాల్లో అమెరికాకు ఉన్న ఆధిపత్యం కారణంగా ఆ దేశానికి ఆర్థిక సంక్షోభాలు తాత్కాలికమేనని, డాలరుకు ఉన్న ప్రాధాన్యతకు సవాళ్లు ఎదురైనా తాత్కాలికమేనని 75 ఏళ్ల చరిత్ర చెబుతోందని విజయసాయి రెడ్డి పేర్కొన్నారు. అనేక ఇతర కారణాల వల్ల బంగారానికి డిమాండు పెరిగేందుకు, ధర ఎగబాకేందుకు అవకాశాలున్నాయి గానీ డాలరు పతనం నిరంతరాయంగా జరగదని పలువురు ఆర్థికవేత్తలు ధీమా వ్యక్తం చేస్తున్నట్లు ఆయన వివరించారు. -
కన్యాదానం ఏంటీ?
భారతదేశంలో చాలాకాలంగా పాతుకుపోయిన పితృస్వామ్య వ్యవస్థకు భిన్నంగా, ఒక మహిళ పౌరోహిత్యం వహించి, కన్యాదానం లేకుండా వివాహం జరిపించింది. ‘‘పితృస్వామ్య వ్యవస్థ నుంచి బయటకు వచ్చి, మహిళ ప్రాధాన్యతను తెలియచేయాలనుకున్నాను’’ అంటారు నందిని భౌమిక్. అన్విత జనార్దన్, అర్క భట్టాచార్యల వివాహాన్ని కన్యాదానం లేకుండా చేయించారు. స్త్రీ సాధికారతను తెలియచేయాలన్నదే నందిని భౌమిక్ లక్ష్యం. జాదవ్‌పూర్ విశ్వవిద్యాలయంలో టీచర్‌గా పనిచేస్తున్న నందిని, ఈ పది సంవత్సరాల కాలంలో 40 పెళ్లిళ్లు కన్యాదానం లేకుండా చేయించారు. ఉపాధ్యాయ వృత్తిలో కొనసాగుతూనే, పది నాటక కంపెనీలలో... మతాంతర, కులాంతర వివాహ విధానాలను ప్రదర్శిస్తున్నారు. భౌమిక్లో ఇటువంటి ఆలోచన కలగడానికి కారణం ఆవిడకు విద్య నేర్పిన గౌరీ ధర్మపాల్. పౌరోహిత్యంతో వచ్చే ధనంలో అధికభాగం అనాథలకు అందచేస్తున్న నందిని, తన ప్రాణ స్నేహితురాలితోను, కాలేజీ విద్యార్థులతోనూ కలిసి ఈ వేడుకను కొత్తగా జరిపించారు.సంస్కృతంలో ఉన్న మంత్రాలను ఇంగ్లీషు, బెంగాలీ భాషలలోకి అనువదించి, వధూవరుల చేత పలికిస్తున్నారు నందిని. ఆమెతో వచ్చిన విద్యార్థులు బ్యాక్ గ్రౌండ్లో రవీంద్ర సంగీత్ ఆలపిస్తుంటారు.‘‘చాలామంది మగ పురోహితులు మంత్రాలను తప్పులు పలకడం గమనించాను. మా స్నేహితుల వివాహంలో నందిని చేస్తున్న వివాహంలో ఆవిడ సంస్కృత మంత్రాలను వివరించడం చూసి, నా వివాహం ఆమె చేత చేయించుకోవాలనుకున్నాను’’ అంటారు అర్క. ఋగ్వేదంలో కన్యాదానం లేని వివాహాలు జరిగినట్లు ఆధారాలు ఉన్నాయి. అందుకే నందిని... కన్యాదానం లేని వివాహాల గురించి ప్రచారం చేయడానికి నడుం బిగించారు. సంస్కృత పండితుడైన నృసింహప్రసాద్ భాదురి... మహిళలు పౌరోహిత్యం వహించకూడదని హిందూధర్మం ఎన్నడూ చెప్పలేదని, వేదాల గురించి జరిగిన చర్చలలో మహిళలు పాల్గొని ఆధ్యాత్మిక, తాత్విక అంశాలలో ప్రతిభను ప్రదర్శించినట్లు ఆధారాలు ఉన్నాయని అంటారు. నందిని గురించి తెలుసుకున్న యువత ఇప్పుడు ఆమెను చూడటానికి ఆసక్తి చూపుతున్నారు. – జయంతి -
విద్యకు ప్రాధాన్యం
సాక్షి, రంగారెడ్డి జిల్లా: ప్రభుత్వం ఈ ఆర్థిక సంవత్సరం నుంచి కొత్తగా ప్రవేశపెట్టిన ప్రాథమిక స్థాయి విద్యార్థులకు ఉపకారవేతనాల కార్యక్రమంతో పెద్దఎత్తున లబ్ధి చేకూరనున్నట్లు కలెక్టర్ బి.శ్రీధర్ పేర్కొన్నారు. అంబేద్కర్ విద్యా నిధితో విదేశాల్లో ఉన్నత విద్య అభ్యసించే అవకాశం కలిగిందని ఉద్ఘాటించారు. రాష్ట్ర అవతరణ వేడుకలను పురస్కరించుకుని శుక్రవారం గచ్చిబౌలిలోని సైబరాబాద్ పోలీసు పరేడ్ గ్రౌండ్స్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ముందుగా జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం జిల్లాలో సంక్షేమ పథకాల అమలు, అభివృద్ధి కార్యక్రమాలపై ప్రసంగించారు. ఎస్సీ విద్యార్థులకు మరింత మెరుగైన విద్యనందించేందుకు జిల్లాకు ఆరు ఇందిరమ్మ విద్యా నిలయాలను ప్రభుత్వం మంజూరు చేసిందని, త్వరలో అందుబాటులోకి తెస్తామన్నారు. ఈ ఏడాది నుంచి ఐదో తరగతి చదివే ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు ఉపకారవేతనాలు అందిస్తున్నట్లు వెల్లడించారు. సాంకేతిక విద్యను ప్రోత్సహించేందుకుగాను జిల్లాకు కొత్తగా 2 ఐటీఐ కాలేజీలు, మల్కాజ్‌గిరికి డిగ్రీ కాలేజీ ఇటీవల మంజూరయ్యాయన్నారు. పాలన మరింత సులభతరం.. ప్రభుత్వ పాలనను మరింత సులభతరం చేయడంతోపాటు ప్రజలకు మెరుగైన సేవలందించేందుకు ప్రభుత్వం కొత్త రెవెన్యూ డివిజన్లు ఏర్పాటు చేసిందన్నారు. మీ సేవా కేంద్రాలతో రెవెన్యూ సేవలు వేగవంతమయ్యాయన్నారు. త్వరలో ఏడో విడత భూ పంపిణీ ద్వారా 1,106 ఎకరాలు భూమిని 666 మంది లబ్ధిదారులకు అందించనున్నట్లు చెప్పారు. జిల్లాలో ఇప్పటివరకు 2లక్షల మందికి ఇళ్ల స్థలాలు పంపిణీ చేశామన్నారు. ైరె తులకు రుణాలు, రాయితీపై పనిముట్లు.. వ్యవసాయ రంగాన్ని పటిష్టం చేసేందుకు ప్రభుత్వం రైతాంగానికి వడ్డీలేని రుణాలిస్తోందన్నారు. ఇందులో భాగంగా ఈ ఏడాది ఖరీఫ్, రబీ సీజన్లో రూ.355కోట్ల రుణాలు పంపిణీ చేశామన్నారు. రూ. 5.61కోట్ల వ్యయంతో 50శాతం రాయితీపై పనిముట్లు అందిస్తున్నామన్నారు. ప్రజలకు నాణ్యమైన విద్యుత్తు అందించేందుకు గాను కొత్తగా 400కేవీ సామర్థ్యం గల మూడు సబ్స్టేషన్లు, 132 కేవీ సామర్థ్యం గల రెండు, 220కేవీ సామర్థ్యం గల ఒకటి, 33 కేవీ సామర్థ్యం గల 9 సబ్స్టేషన్లు రూ.271 కోట్లతో నిర్మిస్తున్నామన్నారు. కూరగాయలు, పూలు, పండ్లతోటల సాగును మరింత విస్తరించేందుకు జిల్లాకు అధికంగా పాలీహౌస్ యూనిట్లు ప్రభుత్వం మంజూరు చేసిందన్నారు. అలరించిన సాంస్కృతిక ప్రదర్శనలు.. పాఠశాల విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ప్రదర్శనల్లో పాల్గొన్న విద్యార్థులకు కలెక్టర్ ప్రశంసాపత్రాలు అందించారు. మహిళా సంఘాలకు రూ.12కోట్ల రుణాలు, అభయ హస్తం కింద రూ.1.77కోట్ల పింఛన్లు, వికలాంగులకు 6 ట్రైసైకిళ్లు, ఆర్వీఎం ద్వారా 40 మంది విద్యార్థులకు 6.15లక్షల విలువైన వినికిడి యంత్రాలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఎస్పీ రాజకుమారి, జేసీ చంపాలాల్, జెడ్పీ సీఈఓ రవీందర్‌రెడ్డి, డీఆర్డీఏ పీడీ వరప్రసాద్‌రెడ్డి, డీఈఓ సోమిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.