ప్రతీకాత్మక చిత్రం
సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి : వాట్సాప్, ఫేస్‌బుక్, ఇన్‌స్ట్ర్రాగామ్, ట్విట్టర్ ఎవరి నోటా విన్నా ఈ పదాలే. ఈ మాధ్యమం ప్రస్తుతం ప్రపంచాన్ని ఊపేస్తోంది. అన్ని రంగాల్లోనూ సోషల్ మీడియానే కీలక భూమిక పోషిస్తోంది. అన్ని వర్గాల ప్రజలు సోషల్ మీడియాతో కనెక్ట్ కావడంతో రాజకీయ నాయకుల చూపు ఈ మాధ్యమంపై పడింది. ప్రత్యర్థుల చర్చను రచ్చ చేయాలన్నా.. వ్యాఖ్యలను తిప్పికొట్టాలన్నా వాట్సాప్, ఫేస్‌బుక్కే సరైన మార్గమని అంచనాకొచ్చి వీటిని అస్త్రంగా మలుచుకునే దిశగా అడుగులు వేస్తున్నారు. వీటి నిర్వహణకు ప్రత్యేకంగా వ్యూహకర్తలను రంగంలోకి దించుతున్నారు. పవర్‌లోకి రావాలని ఇప్పటికే ప్రధాన పార్టీలు సలహాదారులతో ముందుకుసాగుతుండగా తాజాగా ఆశావహులు ముఖ్యంగా ప్రస్తుత ఎమ్మెల్యే, ఎంపీలు ప్రైవేటు ఏజెన్సీలను ఆశ్రయిస్తున్నారు. క్షేత్రస్థాయిలో ప్రజానాడిని ఎప్పటికప్పుడు విశ్లేషించడం.. తెరవెనుక ప్రచారం నిర్వహించడం ఈ సంస్థల బాధ్యత.
ఏం చేస్తారంటే..
ఒక్కో రాజకీయ నేత ప్రచారం కోసం సోషల్ మీడియా కోఆర్డినేటర్, పీఆర్‌వో, మీడియా కోఆర్డినేటర్, డిజిటల్ మార్కెటింగ్ నిపుణులను తీసుకుంటున్నారు. నిత్యం సదరు నేత పాల్గొనే కార్యకలాపాలకు పీఆర్‌వో ప్రచారం కల్పిస్తారు. అలాగే, అభ్యర్థి విజయానికి కావాల్సిన వ్యూహాలను ఖరారు చేసేది కూడా ఇతనే. అందుకు బూత్ స్థాయి నుంచి ఓటర్ల డేటా సేకరించి అవసరాల మేరకు క్రోడీకరించడం, పార్టీలో చురుకైన కార్యకర్తలతో టచ్‌లో ఉంటూ వారికి దిశానిర్దేశాలు చేయల్సిన బాధ్యత వీరిపై ఉంటుంది. ప్రజలతో, స్థానిక లీడర్లతో ఎప్పటికప్పుడూ సమావేశాలు నిర్వహిస్తూ ఎజెండా రూపకల్పనలో పాలుపంచుకోవాలి.
గత ఎన్నికల్లో పోలింగు బూతుల వారీగా పోలైన ఓట్ల సంఖ్యను తెప్పించుకొని పార్టీ బలహీనంగా ఉన్న దగ్గర నిర్వహించాల్సిన ప్రచార వ్యూహాలు రచించాల్సింది కూడా పీఆర్‌వోలే. అలాగే, నాయకుల కార్యకలాపాలను మీడియాకు తెలియజేయడం, సోషల్ మీడియాలో పోస్టు చేయడం వంటి పనులన్నీ మీడియా కోఆర్డినేటర్లపైన ఉంటుంది. పార్టీలో అంతర్గత వ్యవహారాలపై ఓ కన్నేసి ఉంచుతారు. ప్రత్యర్థి పార్టీలతో టచ్‌లో ఉంటారని భావిస్తున్న నేతల కదలికలపై ఈ వేగులు దృష్టిసారిస్తారు.
సోషల్ మీడియా కోఆర్డినేటర్లు
ఫేస్‌బుక్, ట్వీటర్‌ను విస్తృతంగా ఉపయోగించుకోవడానికి నెలకు రూ.15 వేల నుంచి రూ.25 వేల వేతనంతో సోషల్ మీడియా కో ఆర్టినేటర్లను నియమించుకుంటున్నారు. సోషల్ పోస్టింగ్స్‌కు సరైన ప్రచారం కల్పించేందుకు డిజిటల్ మార్కెటింగ్ నిపుణులు కూడా తీసుకుంటున్నారు. ఐవీఆర్‌ఎస్ సిస్టమ్ ద్వారా నేతల వాణి వినిపించడానికి అవసరమైన డేటాను సేకరించే బాధ్యత కూడా ఈ ప్రచారకర్తలకు అప్పగిస్తున్నారు.
పీఆర్ సైన్యం ఏర్పాటు
గతంలో ఎన్నడూ లేని విధంగా రాజకీయ నాయకులు ప్రచార పర్వానికి తెరతీస్తున్నారు. రూ.కోట్లు వెచ్చించి జనాలలోకి పీఆర్ (ప్రజాసంబంధాలు) సైన్యాన్ని పంపుతున్నారు. ఎలాగైనా గెలవాలన్న తలంపుతో బూత్ స్థాయి నుంచి పలుకుబడిని పెంచుకునే పనిలో పడ్డారు. ముందస్తు ఎన్నికలకు అటు కేంద్ర, ఇటు రాష్ట్ర ప్రభుత్వాలు సుముఖంగా ఉండటం.. జమిలి ఎన్నికల వార్తల నేపథ్యంలో అంతర్గత సర్వేలు చేయించుకోవడం, ఇమేజ్‌ను ఇనుమడింపజేసేందుకు వ్యూహాలు రచించే టీమ్‌ను సిద్ధం చేసుకుంటున్నారు. అందుకోసం అనుభవం ఉన్న పొలిటికల్ కన్సల్టెంట్లను సంప్రదిస్తున్నారు.
రూ.75 లక్షల నుంచి కోటిన్నర వరకు
జాతీయ, ప్రాంతీయ రాజకీయ పార్టీలు ప్రైవేటు పొలిటికల్ కన్సల్టెన్సీ (సలహాదారుల)ల ద్వారా జనాల నాడీని తెలుసుకునేందుకు అంతర్గత సర్వేలు చేయించుకోవడం సాధారణమే. అయితే, రేసులో నిలిచే అభ్యర్థులూ ఇప్పుడు అదే దారిలో పయణిస్తున్నారు. ప్రైవేటు ఏజెన్సీల ద్వారా తమ కార్యకలాపాలకు ప్రచారం కల్పించుకుంటున్నారు. అందుకు ఎన్నికల పూర్తయ్యే వరకు రూ.75 లక్షల నుంచి రూ.కోటిన్నర వరకు వెచ్చిస్తున్నారు. ఇప్పటికే మార్కెట్‌లో పేరున్న సంస్థయితే ఈ మొత్తం భారీగానే ఉంటుంది. ఎల్‌బీనగర్, ఇబ్రహీంపట్నం, శేరిలింగంపల్లి, ఉప్పల్, పరిగి, కుత్బుల్లాపూర్, మేడ్చల్, రాజేంద్రనగర్, మహేశ్వరం నియోజకవర్గాలకు చెందిన ఆశావహులు, ఎమ్మెల్యేలు ఇప్పటికే పీఆర్ బృందాలను రంగంలోకి దించారు.
Comments
Please login to add a commentAdd a comment