కర్ణాటక సరిహద్దులో ఏర్పాటు చేసిన చెక్‌పోస్టు
తాండూరు: జిల్లా సరిహద్దులోని కర్ణాటక రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల నగారా మోగింది. దీంతో ఆ రాష్ట్ర పోలీసులు సరిహద్దు వద్ద నిఘా పెంచారు. ఇరు రాష్ట్రాల మద్య ఉన్న సరిహద్దుల వద్ద చెక్‌పోస్ట్ ఏర్పాటు చేసి వాహనాలను తనిఖీ చేస్తున్నారు. గత 28వ తేదీ నుంచి ఎన్నికల కోడ్ అమలులోకి రావడంతో భద్రత కట్టుదిట్టం చేస్తున్నారు. దీంతో తాండూరు నియోజకవర్గంలోని బషీరాబాద్, పెద్దేముల్, తాండూరు మండలాలు కర్ణాటక సరిహద్దు ప్రాంతాలు కావడంతో ఇరు ప్రాంతాల సరిహద్దు మధ్య పోలీసులు చెక్ పోస్టులను ఏర్పాటు చేశారు. ఏప్రిల్ 17న నోటిఫికేషన్, నామినేషన్ చివరి తేదీ 24, ఉప సంహరణ గడువు 27, పోలింగ్ తేదీ మే 12, ఓట్ల లెక్కింపు మే 15న నిర్ణయించారు. మే 16వ తేదీ వరకు ఎన్నికల కోడ్ అమలులో ఉండటంతో సరిహద్దులో నిఘాను పటిష్టం చేశారు. ఆర్టీసీ బస్సులతో పాటు ప్రైవేటు వాహనాలను పూర్తి స్థాయిలో తనిఖీలు చేస్తున్నారు.
కరెన్సీ, మద్యంపై ప్రత్యేక నిఘా..
కర్ణాటక రాష్ట్ర ఎన్నికల సందర్భంగా సరిహద్దు జిల్లా నుంచి కరెన్సీ, మద్యం తరలించకుండా ముందుజాగ్రత్త చర్యగా ఈసీ ఆదేశాల మేరకు సరిహద్దు నిఘా పెంచారు. గత ఎన్నికల్లో జిల్లా నుంచి మద్యం రవాణా జోరుగా సాగింది. ఈ సారి మద్యం రవాణాను అరికట్టేందుకు ఎక్సైజ్ పోలీసులు సరిహద్దులో ఎక్కడికక్కడ చెక్‌పోస్టులను ఏర్పాటు చేశారు. జిల్లాలోని తాండూరు, కొడంగల్ నియోజకవర్గాలు కర్ణాటక సరిహద్దులో ఉండటంతో ప్రతి మార్గంలోను నిఘా పటిష్టం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment