సాక్షి, బెంగళూరు: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ప్రచారం చివరి దశకు చేరింది. నాలుగు రోజుల్లో పోలింగ్ వారం రోజుల్లో నేతల భవితవ్యం తేలనుంది. ప్రజా క్షేత్రంలో గెలిచి అసెంబ్లీలో అడుగు పెట్టేదెవరో, ఓటమితో ఇంటి బాట పట్టదేవరో తెలిపోనుంది.
కాగా కర్ణాటక ఎన్నికల నేపథ్యంలో కోట్ల కొద్దీ డబ్బులు చేతులు మారుతున్నాయి. మద్యం ప్రవాహం కూడా పెరిగింది. ఈ క్రమంలో మార్చి 19న ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు రూ. 305 కోట్ల విలువైన నగదు, వస్తువులను స్వాధీనం చేసుకున్నట్లు ఎన్నికల సంఘం తెలిపింది. వివిధ ఏజెన్సీల ద్వారా రూ.110 కోట్ల నగదు, మొత్తం 2,346 ఎఫ్ఐఆర్‌లు నమోదు అయినట్లు ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ తెలిపారు. అదే విధంగా రూ.74 కోట్ల మద్యం, రూ.81 కోట్ల బంగారం, వెండి, రూ. 18 కోట్ల డ్రగ్స్/నార్కోటిక్స్ పట్టుబడినట్లు వెల్లడించారు.
చదవండి: హింసాకాండలో 54 మంది మృతి.. మణిపూర్‌లో కనిపిస్తే కాల్చివేత
ఇదిలా ఉండగా కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో చిత్రవిచిత్ర ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. ఎన్నికల వేళ ఐటీ అధికారుల దాడుల్లో ఆసక్తికర సంఘటన వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే. మైసూర్‌లో కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థికి చెందిన ఇంటి నుంచి ఆదాయపన్ను శాఖ అధికారులు. దాదాపుగా కోటి రూపాయలు స్వాధీనం చేసుకున్నారు. పుత్తూరు నియోజకవర్గానికి చెందిన కాంగ్రెస్ అభ్యర్థి అశోక్ కుమార్ రాయ్ తమ్ముడు సుబ్రహ్మణ్య రాయ్ ఇంటి దగ్గర ఉన్న చెట్టుకు కట్టిన బాక్సులో కోటి రూపాయలను సీజ్ చేశారు.
మరోవైపు పోలింగ్ దగ్గరపడుతుండటంతో పార్టీలన్ని ప్రచారాన్ని ముమ్మరం చేశాయి. ఓటర్ల మద్దతును కూడగట్టేందుకు ప్రత్యేక వ్యూహంతో ర్యాలీలు, రోడ్డుషోలు నిర్వహిస్తున్నారు. కాగా కర్ణాటకలో 15వ అసెంబ్లీ ఎన్నికలు ఒకే దశలో మే 10వతేదీన నిర్వహించనున్నారు. ఎన్నికల ఫలితాలు మే 13వతేదీన వెల్లడి కానున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment