champalal
-
తండ్రి సింగర్.. తనయ డ్రమ్మర్
సాక్షి, సిటీబ్యూరో: నగరానికి చెందిన ఓ ఐఏఎస్ అధికారి గాయకుడిగానూ తనదైన మార్కు చూపనున్నారు. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా బుధవారం రవీంద్రభారతిలో ‘వందేమాతరం’ పేరుతో నిర్వహించనున్న ప్రత్యేక ప్రదర్శనలో ఆయన పాల్గొననున్నారు. ఈ కార్యక్రమంలో ఆయన కుమార్తె సైతం డ్రమ్మర్‌గా అరంగేట్రం చేస్తుండడం విశేషం. లక్డీకాపూల్‌లోని సెంట్రల్‌కోర్టు హోటల్లో మంగళవారం నిర్వహించిన విలేకర్ల సమావేశంలో నిర్వాహకులు ఈ మేరకు వెల్లడించారు. ఈ సందర్భంగా చంపాలాల్ మాట్లాడుతూ...‘నాకు పాటలంటే ఇష్టం. అప్పుడప్పుడు పబ్లిక్ ఫంక్షన్లలో పాడేవాడిని. అనంతరం తెలంగాణ వీరుడు కొమురం భీమ్ మీద ఒక పాట రాసి, పాడి విడుదల చేశాను. అయితే ఒక పూర్తిస్థాయి కార్యక్రమంతో గాయకుడిగా పరిచయమవడం మాత్రం ఇదే తొలిసారి. నా ఉద్యోగ బాధ్యతలకు ఎలాంటి ఆటంకం కలగకుండా ఈ అభిరుచిని ఆస్వాదిస్తున్నాన’ని చెప్పారు. ఆయన కుమార్తె సోనిక మాట్లాడుతూ... ‘డ్రమ్స్ అంటే ఇష్టం. ముంబై ఐఐటీలో చదువుతుండగా డ్రమ్మర్‌గా మారాను. ఎలాంటి శిక్షణ పొందకున్నా, ఇంటర్నెట్ సహాయంతో సాధన చేశాను. ప్రస్తుతం ఒక రాక్‌బ్యాండ్‌లో సభ్యురాలిని. నాన్నతో కలిసి నగరంలో తొలి ప్రదర్శన ఇస్తున్నందుకు ఆనందంగా ఉందని’ అన్నారు. ఫ్లూటిస్ట్ నాగరాజు తళ్లూరి, నేపథ్య గాయని మణినాగరాజ్ ఇందులో పాల్గొననున్నారు. -
కంపెనీలు స్థాపించకుంటే భూములు వెనక్కి
మహేశ్వరం: టీఎస్ఐఐసీ ద్వారా పొందిన భూముల్లో కంపెనీలు స్థాపించకుంటే ఆ స్థలాలను వెనక్కి తీసుకుంటామని జాయింట్ కలెక్టర్ చంపాలాల్ పేర్కొన్నారు. మంగళవారం ఆయన మండల పరిధిలోని రావిర్యాల, కొంగరఖుర్దు, రాజీవ్ జేమ్స్‌పార్కు, గంగారం, నాగారం గ్రామాల్లోని ప్రభుత్వ భూములను పరిశిలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. టీఎస్ఐఐసీ ద్వారా తీసుకున్న భూముల్లో కంపెనీలు స్థాపించకుంటే ఆ భూములను వెనక్కి తీసుకొని ఇతర పరిశ్రమలను ఏర్పాటు చేస్తామని చెప్పారు. రావిర్యాల రెవెన్యూ పరిధిలోని రాజీవ్ జేమ్స్‌పార్కులో ఖాళీగా ఉన్న భూములను పరిశీలించి కంపెనీలు ఎందుకు స్థాపించడం లేదంటూ జేమ్స్‌పార్కు అధికారులను ప్రశ్నించారు. అయితే ప్రస్తుతం డైమండ్ కంపెనీలు తీవ్ర నష్టాల్లో ఉన్నాయని, అందుకే కొత్త కంపెనీలే స్థాపించడానికి ఎవరూ ముందుకు రావడం లేదన్నారు. మహేశ్వరంలో మరిన్ని పరిశ్రమలు రానున్న రోజుల్లో మహేశ్వరం, రావిర్యాల, శ్రీనగర్, గంగారం, నాగారం గ్రామాల్లో భారీ పరిశ్రమలు ఏర్పాటు కానున్నాయని జేసీ పేర్కొన్నారు. ఇటీవల గంగారం గ్రామం సర్వే నెంబరు 181లో సుమారు 100 ఎకరాల ప్రభుత్వ భూమిని ఇండియన్ ఆయిల్ కంపెనీ ప్రతినిధులు పరిశీలించినట్లు చెప్పారు. రావిర్యాల, కొంగర ఖుర్దు , నాగారం గ్రామాల్లో కంపెనీలు స్థాపించడానికి పలు ఐటీ, సాప్ట్వేర్ కంపెనీలు ఆసక్తి చూపుతున్నాయన్నారు. కొంగరఖుర్దు సర్వే నెం-289లో సుమారు 55 ఎకరాలు, గంగారం సర్వే నెంబరు 181లో సుమారు 120 ఎకరాలు, నాగారంలో సర్వే నెంబరు 181లో 45 ఎకరాల ప్రభుత్వ భూమిని జేసీ పరిశీలించారు. చెరువుల ఆక్రమణకు పాల్పడితే ఎంతటివారైనా ఉపేక్షించేది లేదన్నారు. జేసీ వెంట తహసీల్దార్ కె. గోపీరామ్, రెవెన్యూ ఇన్స్పెక్టర్ మహ్మద్ రఫీ తదితరులున్నారు. -
ప్రతి పైసా లెక్కిస్తాం
సాక్షి, రంగారెడ్డి జిల్లా: ఎన్నికల సందర్భంగా అభ్యర్థులు ఖర్చుచేసే ప్రతిపైసా లెక్కకొస్తుందని కలెక్టర్ బీ.శ్రీధర్ స్పష్టం చేశారు. ఈ ఖర్చు ను లెక్కించేందుకు ప్రత్యేకంగా నిఘా వ్యవస్థ ఏర్పాటు చేశామన్నారు. మంగళవారం కలెక్టరేట్లో ఎన్నికల వ్యయ పర్యవేక్షణపై అధికారులకు శిక్షణ ఇచ్చారు. ఎన్నికల కమిషన్ నిబంధనలకనుగుణంగా వ్యయ పరిశీ లన జరగాలని, ఇందుకోసం ఏర్పాటుచేసిన బృందాలు సమన్వయం తో పనిచేయాలని సూచించారు. రవాణా ఖర్చు రూ.50వేలు మించిన అభ్యర్థులు తప్పనిసరిగా లిఖితపూర్వక డాక్యుమెంట్లు సమర్పించాలని, లేకుంటే డబ్బును సీజ్‌చేసి తగిన చర్యలు తీసుకోనున్నట్లు చెప్పారు. ఎన్నికల్లో అధిక ఖర్చును నియత్రించాలన్న ఎన్నికల కమిషన్ నిబంధనలపై ప్రజలు స్పందించాలన్నారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్లు చంపాలాల్, ఎంవీరెడ్డి, డ్వామా పీడీ చంద్రకాంత్‌రెడ్డి పాల్గొన్నారు. -
కోడ్ ఉల్లంఘిస్తే కఠిన చర్యలు
సాక్షి, రంగారెడ్డి జిల్లా: ఎన్నికల నియమావళిని పకడ్బందీగా అమలు చేయాలని కలెక్టర్ బీ.శ్రీధర్ సంబంధిత అధికారులను ఆదేశించారు. కోడ్‌ను ఉల్లంఘించినట్లైతే వారి వివరాలను 24గంటల్లోగా నివేదిక రూపంలో అందిస్తే తగిన చర్యలు తీసుకుంటామన్నారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలుపై శుక్రవారం కలెక్టరేట్లో మండల పరిషత్ అభివృద్ధి అధికారులు, నియోజకవర్గ స్థాయి అధికారులకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఎన్నికల నియమావళి అధికారులుగా ఎంపీడీఓ, నియోజకవర్గ స్థాయి అధికారులను నియమించామన్నారు. ఉద్యోగులు, అభ్యర్థులు, పార్టీల నేతలు కోడ్ ఉల్లంఘించిట్లు ఫిర్యాదులొస్తే 24 గంటల్లోగా నిర్ధారించి నివేదిక ఇవ్వాల్సి ఉంటుందన్నారు. ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చినందున ప్రభుత్వ నిధులతో కొనసాగుతున్న పనులు మాత్రమే చేపట్టాలని, కొత్త మంజూరులు, పనులు చేపట్టవద్దన్నారు. ప్రభుత్వ గెస్ట్‌హౌజ్‌లు ఎవరికీ కేటాయించవద్దని ఆదేశించారు. శిక్షణ తరగతులకు హాజరుకాని అధికారులపై కఠిన చర్యలు తీసుకోనున్నట్లు స్పష్టం చేశారు. కార్యక్రమంలో జేసీలు చంపాలాల్, ఎంవీరెడ్డి తదితరులు పాల్గొని అధికారులకు సూచనలిచ్చారు.