సాక్షి, సిటీబ్యూరో: నగరానికి చెందిన ఓ ఐఏఎస్ అధికారి గాయకుడిగానూ తనదైన మార్కు చూపనున్నారు. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా బుధవారం రవీంద్రభారతిలో ‘వందేమాతరం’ పేరుతో నిర్వహించనున్న ప్రత్యేక ప్రదర్శనలో ఆయన పాల్గొననున్నారు. ఈ కార్యక్రమంలో ఆయన కుమార్తె సైతం డ్రమ్మర్‌గా అరంగేట్రం చేస్తుండడం విశేషం. లక్డీకాపూల్‌లోని సెంట్రల్‌కోర్టు హోటల్‌లో మంగళవారం నిర్వహించిన విలేకర్ల సమావేశంలో నిర్వాహకులు ఈ మేరకు వెల్లడించారు. ఈ సందర్భంగా చంపాలాల్ మాట్లాడుతూ...‘నాకు పాటలంటే ఇష్టం. అప్పుడప్పుడు పబ్లిక్ ఫంక్షన్లలో పాడేవాడిని. అనంతరం తెలంగాణ వీరుడు కొమురం భీమ్ మీద ఒక పాట రాసి, పాడి విడుదల చేశాను.
అయితే ఒక పూర్తిస్థాయి కార్యక్రమంతో గాయకుడిగా పరిచయమవడం మాత్రం ఇదే తొలిసారి. నా ఉద్యోగ బాధ్యతలకు ఎలాంటి ఆటంకం కలగకుండా ఈ అభిరుచిని ఆస్వాదిస్తున్నాన’ని చెప్పారు. ఆయన కుమార్తె సోనిక మాట్లాడుతూ... ‘డ్రమ్స్ అంటే ఇష్టం. ముంబై ఐఐటీలో చదువుతుండగా డ్రమ్మర్‌గా మారాను. ఎలాంటి శిక్షణ పొందకున్నా, ఇంటర్నెట్ సహాయంతో సాధన చేశాను. ప్రస్తుతం ఒక రాక్‌బ్యాండ్‌లో సభ్యురాలిని. నాన్నతో కలిసి నగరంలో తొలి ప్రదర్శన ఇస్తున్నందుకు ఆనందంగా ఉందని’ అన్నారు. ఫ్లూటిస్ట్ నాగరాజు తళ్లూరి, నేపథ్య గాయని మణినాగరాజ్ ఇందులో పాల్గొననున్నారు.
Comments
Please login to add a commentAdd a comment