
సాక్షి, హైదరాబాద్: రబీలో వరి సాగు వద్దని, ఇతర ప్రత్యామ్నాయ పంటలకు వెళ్లాలని వ్యవసాయశాఖ రైతులకు పిలుపునిచ్చింది. కాలం కలసి రాకపోవడం, అనేక చోట్ల బోర్లు, బావులు, చెరువుల్లో నీరు అడుగంటి పోవడంతో వరి వేస్తే ప్రయోజనం ఉండదని తెలిపింది. ఈ మేరకు వ్యవసాయశాఖ కమిషనర్ రాహుల్ బొజ్జా జిల్లా వ్యవసాయాధికారులతో శనివారం ప్రత్యేక సమావేశం నిర్వహించారు. నీటి వనరులున్నచోట మాత్రమే వరికి వెళ్లాలని, మిగిలిన ప్రాంతాల్లో ప్రత్యామ్నాయ పంటలు వేయాలని రైతులకు సూచిస్తున్నట్లు రాహుల్ బొజ్జా ‘సాక్షి’కి తెలిపారు. ఈ మేరకు రైతులను చైతన్యపరచాలని అధికారులను ఆదేశించినట్లు ఆయన వివరించారు. రాష్ట్రంలో 18 జిల్లాల్లో వర్షాభావం నెలకొంది. దీంతో రబీలో అనుకున్న స్థాయిలో వరి నాట్లు పడలేదు. వరి నాట్లు పుంజుకోలేదు. రబీలో అన్ని పంటల సాధారణ సాగు విస్తీర్ణం 33.45 లక్షల ఎకరాలుకాగా ఇప్పటివరకు కేవలం 10 లక్షల ఎకరాలకే సాగు పరిమితమైంది. రబీ వరి సాధారణ సాగు విస్తీర్ణం 17.62 లక్షల ఎకరాలుకాగా ఇప్పటివరకు లక్ష ఎకరాల లోపే నాట్లు పడ్డాయి. ఇక మొక్కజొన్న సాధారణ సాగు విస్తీర్ణం 4.15 లక్షల ఎకరాలుకాగా 2 లక్షల ఎకరాలకే పరిమితమైంది. అలాగే మొక్కజొన్నపై కత్తెర పురుగు దాడి చేస్తుంది. నిజామాబాద్, కామారెడ్డి, మెదక్, వరంగల్ రూరల్, వరంగల్ అర్బన్, నిర్మల్, కరీంనగర్, మహబూబాబాద్ జిల్లాల్లో ఈ పురుగు కారణంగా మొక్కజొన్న నాశనమై పోయింది. దీంతో పరిస్థితిని గమనించిన వ్యవసాయశాఖ ప్రత్యామ్నాయ ప్రణాళికను సిద్ధం చేయాలని నిర్ణయించింది.
ఆరుతడి పంటలే మేలు...
వరికి ప్రత్యామ్నాయంగా శనగ, వేరుశనగ, పొద్దు తిరుగుడు, ఆముదం, నువ్వులు తదితర పంటలను సాగు చేసేలా రైతులను అధికారులు ప్రోత్సాహించనున్నారు. సిద్దిపేట జిల్లా వ్యవసాయశాఖ, కలెక్టర్ ఇప్పటికే ‘రబీలో వరి వద్దు... ఆరుతడి పంటలే మేలంటూ’పెద్ద ఎత్తున కరపత్రాలు వేసి రైతుల్లో చైతన్యం నింపుతున్నారు. సాగునీటి వనరులు లేకపోవడంతో వరి వైపు వెళ్లి నష్టపోకూడదని వ్యవసాయశాఖ సూచిస్తోంది. ఎకరా వరి సాగయ్యే నీటితో కనీసం మూడెకరాల ఆరుతడి పంటలను రైతులు సాగు చేసుకోవచ్చని అధికారులు చెబుతున్నారు. డ్రిప్ ద్వారానైతే ఐదారు ఎకరాలూ సాగు చేసుకోవచ్చు. పైగా పంటల మార్పిడి వల్ల చీడపీడల ఉధృతి కూడా ఉండదని వ్యవసాయశాఖ చెబుతోంది. వరి కంటే కూడా పొద్దు తిరుగుడు, శనగ, నువ్వుల పంటకాలం కూడా తక్కువుంటుందని, పైగా ఆరుతడి పంటలకే మద్దతు ధర అధికంగా ఉందని వ్యవసాయశాఖ చెబుతోంది. వరి మద్దతు ధర క్వింటాలుకు రూ. 1,770 అయితే, పొద్దు తిరుగుడు మద్దతు ధర రూ. 5,388 ఉందని తెలిపింది. సాగు ఖర్చు కూడా తక్కువని పేర్కొంది. ప్రస్తుతం రబీ కోసం 4.72 లక్షల క్వింటాళ్ల విత్తనాలను సబ్సిడీపై అందించేందుకు ప్రణాళిక సిద్ధం చేశారు. అందులో జిల్లాల్లో ఇప్పటివరకు 80 వేల క్వింటాళ్లు అందుబాటులో ఉంచారు. వాటిలో 65 వేల క్వింటాళ్లే అమ్ముడుపోయాయి. ఇక రబీ వరి విత్తనాలు 2.22 లక్షల క్వింటాళ్లు సరఫరా చేయడానికి ప్రణాళిక సిద్ధం చేశారు. ప్రత్యామ్నాయ ప్రణాళికకు వెళ్లాల్సి ఉన్నందున ఇతర విత్తనాలను కూడా ఆగమేఘాల మీద అందుబాటులో ఉంచాలని రాహుల్ బొజ్జా అధికారులను ఆదేశించారు.