మూగ రోదన
– కరుణ చూపని వరుణుడు
– పిడికెడు మేత కోసం కాపరుల పాట్లు
లేపాక్షి : జిల్లాలో వర్షాభావ పరిస్థితుల దృష్ట్యా పశుగ్రాసం కొరత తీవ్రంగా ఉంది. మూడు నెలలుగా వరుణుడు కరుణ చూపకపోవడంతో జిల్లాలో వర్షాలు పడక గడ్డిపోచ కూడా దొరకని పరిస్థితి ఏర్పడింది. దీంతో పిడికెడు మేత కోసం కాపరులు అనేక పాట్లు పడుతున్నారు. ఈ ఏడాది ఖరీఫ్ సీజన్‌లో పంటలు పండుతాయనే ఉద్దేశంతో చాలామంది రైతులు వివిధ రకాల పంటలను పెట్టుకున్నారు. దుక్కిలు చేసుకోవడానికి, విత్తనాలు విత్తుకోడానికి, కలుపులు తీసే సమయానికి సకాలంలో వర్షాలు అనుకూలించాయి.
అయితే విత్తన ఉత్పత్తి దశలో పూర్తిగా వర్షాలు రాకపోవడంతో పంటలు చేతికి అందకుండా పోయాయి. కనీసం పశుగ్రాసం కూడా దొరక్కపోవడంతో పశువులు, గొర్రెలు, మేకల కాపరులు ఇబ్బందులు పడుతున్నారు. ఫలితంగా చాలామంది పాడి ఆవులు, వ్యవసాయం చేసే పశువులను సంతల్లో చౌక బేరానికే విక్రయిస్తున్నారు. ప్రభుత్వం పశుగ్రాసం కొరత అధిగమించడానికి తగిన చర్యలు తీసుకుని కాపరులు, రైతులను ఆదుకోవాలని ప్రజలు కోరుతున్నారు.