సాక్షి, తాడేపల్లి: తమది రైతు పక్షపాత ప్రభుత్వమని ఇప్పటికే నిరూపించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మరో కీలక ముందడుగు వేశారు. 2018–19 రబీ పంటల బీమా ప్రీమియంకు సంబంధించి గత సర్కారు బకాయి పడిన రూ.122.61 కోట్లను ప్రభుత్వం చెల్లించింది. దీంతో అప్పటి పంట నష్టానికి సంబంధించి బీమా కంపెనీలు రూ.596.36 కోట్ల క్లెయిమ్స్ విడుదల చేశాయి. ఈ మొత్తాన్ని రాష్ట్రంలో 5.94 లక్షల మంది రైతుల ఖాతాల్లో సీఎం వైఎస్ జగన్ శుక్రవారం తన క్యాంప్ కార్యాలయంలో కంప్యూటర్‌లో బటన్ నొక్కి నేరుగా జమ చేశారు. ఈ సందర్భంగా సీఎం వైఎస్ జగన్ మాట్లాడుతూ.. 2019–2020 నుంచి రైతులందరికీ ఉచితంగా వైఎస్సార్ పంటల బీమా అమలు చేస్తామని తెలిపారు. అదే విధంగా రైతు వేసిన పంటకు కనీస గిట్టుబాటు ధర కల్పిస్తామని పునురుద్ఘాటించారు.
రైతు భరోసా కేంద్రాల ద్వారా రైతులకు అన్ని సౌకర్యాలు కల్పిస్తామని ఆయన స్పష్టం చేశారు. రైతు భరోసా కేంద్రంలోనే ఇ– క్రాపింగ్ నమోదు చేసేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఇందులో భాగంగా.. గ్రామ సచివాలయంలో ఉన్న అగ్రికల్చర్, రెవిన్యూ అసిస్టెంట్లు, సర్వేయర్ కలిసి ఇ– క్రాపింగ్ రిజిస్టర్ చేసి.. వెంటనే ఇన్సూరెన్స్‌ను కట్టేలా ఏర్పాటు చేస్తారన్నారు. రైతులు రూపాయి కడితే చాలు.. వారి తరఫున ప్రభుత్వమే ప్రీమియం కడుతుందని.. బీమా పరిహారం పూర్తి బాధ్యత ప్రభుత్వానిదేనని స్పష్టం చేశారు. కాగా పంటల బీమాను ఇ–క్రాప్‌తో అనుసంధానించడం ద్వారా ఖరీఫ్ 2019లో 25.73 లక్షలు.. 2019–20 రబీలో 33.03 లక్షల మందికి మొత్తంగా 58.76లక్షలమందికి ఉచితంగా పంటల బీమా సౌకర్యం అందనుంది.(పనులను పరుగెత్తించాలి)
సమూల మార్పులు తీసుకువచ్చాం..
‘‘గత ప్రభుత్వ హయాంలో బీమా పరిస్థితి ఎలా ఉండేదో.. ఇవాళ మనం చేస్తున్న కార్యక్రమం ద్వారా తెలుస్తోంది. రైతులు ప్రీమియం చెల్లించిన తర్వాత, మిగిలిన వాటాకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం సగం, కేంద్ర ప్రభుత్వం సగం చెల్లించాలి. సీజన్ ప్రారంభం కాగానే ప్రీమియం చెల్లింపు జరగాలి. అప్పుడే రైతుకు పరిహారం సక్రమంగా అందుతుంది. అయితే గత ప్రభుత్వం బీమా చెల్లించకపోవడం వల్ల రైతులకు ఇన్సూరెన్స్ ప్రీమియం రాని పరిస్థితి వచ్చింది. దీంతో రైతులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
అందుకే మనం అధికారంలోకి వచ్చాక బీమా కంపెనీలతో చర్చలు జరిపి, అవ్వాళ్టి ప్రీమియంను చెల్లించి, దాదాపు 5.95 లక్షల మంది రైతులకు ఇవాళ బీమా చెల్లించడం జరుగుతోంది. గత ప్రభుత్వం హయాంలో మాదిరి రైతులు నష్టపోయే పరిస్థితి రాకూడదని సమూలంగా మార్పులు తీసుకువచ్చాం. రైతులు కట్టాల్సిన ప్రీమియంను ప్రభుత్వమే చెల్లిస్తోంది. దేవుడి దయ, మీ అందరి ఆశీస్సులు కారణంగా ఇదంతా చేయగలుగుతున్నాం. ఈ డబ్బును పాత అప్పులకు జమచేసుకోకుండా అన్ ఇన్‌కంబర్డ్ ఖాతాల్లో ఈ బీమా డబ్బును జమ చేస్తున్నాం’’ అని సీఎం జగన్ తెలిపారు.(‘సీఎం జగన్ పథకాలు పలు రాష్ట్రాలకు ఆదర్శం’)
మీకు రుణపడి ఉంటాం: రైతులు
పంటల బీమా సొమ్ము విడుదల చేసే క్రమంలో సీఎం జగన్ వివిధ జిల్లాల రైతులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సంభాషించారు. ఈ క్రమంలో రైతు సంక్షేమం కోసం పలు పథకాలు ప్రవేశపెట్టిన వైఎస్సార్ సీపీ ప్రభుత్వంపై రైతులు ప్రశంసలు కురిపించారు. గతంలో ఎప్పుడు పంట నష్టం జరిగినా బీమా అందలేదని.. ఇంత పెద్ద మొత్తంలో బీమా సొమ్ము పొందడం ఇదే తొలిసారి అని హర్షం వ్యక్తం చేశారు. ఆపదలో ఆదుకున్న ముఖ్యమంత్రికి రుణపడి ఉంటామన్నారు. అదే విధంగా రైతు భరోసా వల్ల పెట్టుబడికి ఇబ్బందులు తొలిగాయని.. పెట్టుబడి కోసం రైతులెవరూ ఇప్పుడు వడ్డీ వ్యాపారుల వద్దకు వెళ్లడం లేదంటూ హర్షం వ్యక్తం చేశారు. రైతు భరోసా కేంద్రాల వల్ల నకిలీ విత్తనాలు, ఎరువుల బెడద తప్పిందని కృతజ్ఞతలు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment