ప్రీమియం ప్రభుత్వమే చెల్లిస్తుందంటున్న వ్యవసాయ శాఖ వర్గాలు
వానాకాలం సీజన్ నుంచి పీఎం ఫసల్ బీమా పథకం అమలుకు సర్కారు నిర్ణయం... త్వరలో కేంద్రానికి లేఖ
సాక్షి, హైదరాబాద్: రైతులు పైసా ఖర్చు చేయకుండా ప్రభుత్వమే ఉచితంగా పంటల బీమాను అందుబాటులోకి తీసుకురానున్నట్లు తెలిసింది. ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన పథకం కింద రాష్ట్రంలో రైతులు చెల్లించాల్సిన వాటా ప్రీమియంను ప్రభుత్వమే భరిస్తుందని వ్యవసాయ శాఖ వర్గాలు వెల్లడించాయి. ఈ మేరకు ప్రభుత్వం సూత్రప్రాయ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపాయి. రాష్ట్రంలో ఈ ఏడాది వానాకాలం సీజన్ నుంచి ఫసల్ బీమా పథకాన్ని తిరిగి అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. రైతులు చెల్లించాల్సిన ప్రీమియం చాలా ఎక్కువగా ఉన్నందున గత ప్రభుత్వం ఈ బీమా పథకం నుంచి బయటకు వచ్చింది. దీంతో కొంతకాలంగా రైతులకు పంటల బీమా లేకుండా పోయింది. ఈ నేపథ్యంలో కొత్త సర్కారు రైతుల ప్రీమియం వాటాను తామే చెల్లించాలని నిర్ణయించినట్లు తెలిసింది.
క్లస్టర్ల వారీగా అమలు
వ్యవసాయ శాఖ వర్గాల అంచనా ప్రకారం..రాష్ట్ర రైతులు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రెండు సీజన్లకు కలిపి దాదాపు రూ.2 వేల కోట్లు బీమా కంపెనీలకు ప్రీమియంగా చెల్లించాల్సి ఉంటుంది. అందులో రైతుల వాటా దాదాపు రూ.300 కోట్లు ఉంటుందని అంచనా. కాగా ఫసల్ బీమా పథకంలో చేరే విషయమై కేంద్ర ప్రభుత్వానికి త్వరలోనే తెలంగాణ ప్రభుత్వం లేఖ రాయనుంది. పంటల బీమా పథకాన్ని క్లస్టర్ల వారీగా అమలు చేయనున్నారు.
రాష్ట్రంలోని జిల్లాలను ఆరు క్లస్టర్లుగా విభజిస్తారు. కాగా బీమా పథకంలో ఉన్న వివిధ రకాల అంశాలను పరిగణనలోకి తీసుకొని ఈ పథకాన్ని అమలు చేస్తారు. అకాల వర్షాలతో నష్టపోతే ఒక రకమైన ప్రీమియం, కోత కోసి కల్లాల్లో ఉన్నప్పుడు వర్షం పడి నష్టం జరిగితే మరో రకమైన ప్రీమియం, దిగుబడి తక్కువ వస్తే అందుకు సంబంధించి మరో ప్రీమియం ఇలా వివిధ రకాలుగా పథకంలో వెసులుబాట్లు ఉన్నాయి. దీంతో ఏ క్లస్టర్లలో ఎటువంటి వాతావరణం ఉంటుందన్న దానికి అనుగుణంగా పథకాన్ని అమలు చేస్తారు. బీమా కంపెనీలు కోట్ చేసే ధరలను బట్టి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని వ్యవసాయ శాఖ వర్గాలు తెలిపాయి. ఈ ప్రక్రియ పూర్తి కావడానికి మూడు నెలల సమయం పడుతుందని అధికారులు తెలిపారు. ఎన్నికల కోడ్ రావడానికి ముందే పథకానికి సంబంధించి మార్గదర్శకాలు వెలువడనున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment