సొంత బీమా.. ప్రైవేటు హంగామా | Crop Insurance: Private Company Negligence Over Pay Money To Farmers Telangana | Sakshi
Sakshi News home page

సొంత బీమా.. ప్రైవేటు హంగామా

Published Mon, Sep 5 2022 1:51 AM | Last Updated on Mon, Sep 5 2022 3:59 PM

Crop Insurance: Private Company Negligence Over Pay Money To Farmers Telangana - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: వర్షాలు..వరదలు..పంటలకు తీవ్ర నష్టం..రైతన్నకు కష్టం. పరిహారం అందకపోవడంతో దిక్కుతోచని పరిస్థితి. ఈ నేపథ్యంలోనే రైతులు పంటల బీమా వైపు మొగ్గుచూపుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం పంటల బీమా పథకాన్ని నిలిపివేయడం, గత రెండేళ్లుగా పరిహారం అందకపోవడంతో విధిలేని పరిస్థితుల్లో ప్రైవేటు బీమా కంపెనీలను ఆశ్రయిస్తున్నారు. సొంతంగానే తమ పంటలకు బీమా చేయిస్తున్నారు. ఇదే అదనుగా ప్రైవేటు కంపెనీలు తమ ఏజెంట్లను రైతుల వద్దకు పంపుతూ వ్యాపారాన్ని పెంచుకుంటున్నాయి. రైతుల నిస్సహాయతను ఆసరాగా చేసుకుని ఇష్టారాజ్యంగా ప్రీమియం వసూలు చేస్తున్నాయనే ఆరోపణలు విన్పిస్తున్నాయి.

రైతులకు అవగాహన కల్పించేందుకు, ప్రైవేటు కంపెనీలను నియంత్రించేందుకు వ్యవసాయ శాఖ ఎలాంటి చర్యలూ తీసుకోవడం లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రభుత్వ అజమాయిషీ లేకపోవడంతో పంట నష్టం జరిగినప్పుడు కొన్ని కంపెనీలు కొర్రీలు పెడుతూ పరిహారం అసలు ఇవ్వకపోవడమో, ఇచ్చినా తక్కువ ఇవ్వడమో చేస్తున్నాయన్న ఆరోపణలు కూడా విన్పిస్తున్నాయి. అయితే ఇప్పటివరకు దాదాపు లక్షన్నర మంది రైతులు ప్రైవేట్‌లో పంటల బీమా తీసుకున్నట్లు వ్యవసాయశాఖ వర్గాలు చెబుతున్నాయి.  

2016–17 నుంచి పీఎంఎఫ్‌బీవై..
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తమతమ వాటాలు చెల్లించేలా పంటల బీమా పథకం ఎప్పట్నుంచో అమలవుతోంది. అయితే 2016–17లో ఈ పథకం ప్రధానమంత్రి ఫసల్‌ బీమా యోజన (పీఎంఎఫ్‌బీవై)గా రూపుదిద్దుకుంది. ఈ పథకం కింద టెండర్ల ద్వారా ఖరారు చేసిన ప్రీమియం సొమ్ములో రైతులు వానాకాలం పంటలకు గరిష్టంగా 2 శాతం, యాసంగికి 1.5 శాతం, వాణిజ్య, ఉద్యాన పంటలకు 5 శాతం ప్రీమియం చెల్లించాలి. మిగిలిన ప్రీమియాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చెరి సగం కట్టాలి. వడగళ్ల వానలు, అకాల వర్షాలు, తుపాన్లు, వరదలు, సహజంగా జరిగే అగ్ని ప్రమాదాలు వంటి వాటివల్ల జరిగే పంట నష్టాలకు ఈ బీమా పరిహారం అందుతుంది. అయితే 2020 వానాకాలం సీజన్‌ నుంచి ఈ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం స్వచ్ఛందం చేసింది. 

రెండేళ్లుగా అందని పరిహారం..
    పీఎంఎఫ్‌బీవై వల్ల పెద్దగా ప్రయోజనం లేదని తెలంగాణ సర్కారు భావించింది. ప్రైవేట్‌ బీమా కంపెనీలు రైతులకు సక్రమంగా పరిహారం అందజేయడం లేదన్న వాదనలూ వచ్చాయి. పైగా రైతుబంధు పథకం అమలు చేస్తున్నందున మళ్లీ పంటల బీమా పథకానికి ప్రీమియం చెల్లించాల్సి రావడం భారమని కూడా రాష్ట్ర ప్రభుత్వం భావించింది. ఇలా అనేక కారణాలతో ఈ పథకం నుంచి రాష్ట్ర ప్రభుత్వం వైదొలిగింది. అలాగని సొంత బీమా పథకాన్నైనా ప్రారంభించలేదు. దీంతో రెండేళ్లుగా రైతులకు పంట నష్టం జరిగినా పరిహారం దక్కడం లేదు. బిహార్, పశ్చిమ బెంగాల్, గుజరాత్, జార్ఖండ్‌ వంటి కొన్ని రాష్ట్రాలు ఈ పథకం స్థానంలో తమ సొంత  పథకాలను ప్రారంభించాయి. ఆంధ్రప్రదేశ్‌ కూడా కేవలం రూపాయి ప్రీమియంతో ఉచితంగా కేంద్ర పథకాన్ని అమలు చేస్తోంది. 

వానాకాలం సీజన్‌లో 10 లక్షల ఎకరాల్లో పంట నష్టం!
ఈ ఏడాది వానాకాలం సీజన్‌లో దాదాపు నెల రోజుల పాటు తీవ్రమైన వర్షాలతో పంటలు నీట మునిగాయి. పత్తి వంటి పంటలకు తీవ్రమైన నష్టం వాటిల్లింది. మొత్తంగా దాదాపు 10 లక్షల ఎకరాలకు పైగా పంట నష్టం జరిగిందని స్థానికంగా అంచనా వేశారు. కానీ పంటల బీమా లేకపోవడంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. నష్టాన్ని అంచనా వేసి కేంద్రానికి నివేదిక ఇవ్వడంలో వ్యవసాయ శాఖ విఫలమైంది. గత రెండేళ్లుగా పరిహారం అందకపోవడం, వానాకాలంలో పెద్దయెత్తున పంట నష్టం జరిగినా సాయం అందే పరిస్థితి లేకపోవడంతో, గత్యంతరం లేక రైతులే సొంతగా పంటల బీమా చేయించుకుంటున్నారు. బ్యాంకుల్లో రుణాలు తీసుకునే రైతులను కంపెనీలు పంటల బీమాలో చేర్చుతున్నాయి. ఒక్కో జిల్లాలో ఒక్కో రకంగా ప్రీమియం వసూలు చేస్తున్నాయి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement