Private Insurance Company
-
వెల్త్.. హెల్త్! దక్షిణాది ప్రజల ఆలోచన ఇదే! సర్వేలో కీలకాంశాలు
సాక్షి, హైదరాబాద్: కుటుంబ ఆర్థిక భద్రతకే దక్షిణాది రాష్ట్రాల పౌరులు అధికంగా మొగ్గుచూపుతున్నారు. దేశంలోని మిగతా ప్రాంతాలతో పోలిస్తే ఈ విషయంలో వారు మరింత జాగ్రత్తగా, ఆ లక్ష్యాల సాధన దిశగా కృషిచేస్తున్నారు. తమ జీవిత అత్యున్నత లక్ష్యాల్లో ‘కుటుంబ ఆర్థిక పరిపుష్టి’సాధన ముఖ్యమని 74 శాతం మంది భావిస్తున్నారు. అలాగే, ఆరోగ్య పరిరక్షణ, సామాజిక బాధ్యత కింద సేవా కార్యక్రమాలు, ఇతర ప్రాంతాలకు ప్రయాణాలు వంటి వాటిని వీరు ఇతర ప్రధాన లక్ష్యాలుగా నిర్దేశించుకున్నారు. ‘ఇండియాస్ లైఫ్ గోల్స్ ప్రిపేర్డ్నెస్–2023’పేరిట ఓ ప్రైవేట్ బీమా సంస్థ నిర్వహించిన అధ్యయనంలో ఈ విషయాలు వెల్లడయ్యాయి. దక్షిణాది రాష్ట్రాల్లోని వారి జీవిత లక్ష్యాలు, వాటి సాధన ప్రాధాన్యతలపై ఈ సంస్థ అధ్యయనం చేసింది. దేశవ్యాప్తంగా 13 మెట్రోలు, ప్రథమ, ద్వితీయశ్రేణి నగరాల్లో 22–55 ఏళ్ల వయసు మధ్య వారితో ఈ సర్వే నిర్వహించింది. దక్షిణాదికి సంబంధించి.. గుంటూరు, మదురై, బెంగళూరు, చెన్నైల్లో ఈ అధ్యయనం చేశారు. సర్వేలో కీలకాంశాలు ♦ వయసు, లింగ భేదంతో సంబంధం లేకుండా అంతా లక్ష్యాలు నిర్దేశించుకుంటున్నారు ♦ ఇతర లక్ష్యాల కంటే కుటుంబ ఆర్థిక భద్రత తమ ప్రాధాన్యమన్న 74 శాతం మంది ♦ ఆరోగ్యపరిరక్షణ, సేవా కార్యక్రమాలు, ప్రయాణాలు ఇతర ప్రధాన లక్ష్యాలని అధికశాతం వెల్లడి ♦ ఆరోగ్యం, ఫిట్‌నెస్‌కు సంబంధించిన లక్ష్యాలు నిర్దేశించుకున్న వారు 73 శాతం ♦ ప్రతీ ఇద్దరిలో ఒకరు శారీరకంగా, మానసికంగా ఫిట్‌గా ఉండాలనేది కోరిక ♦ తమను ప్రభావితం చేసే వాటిలో సోషల్ మీడియా పాత్ర పెరిగిందని ఎక్కువ మంది చెప్పారు ♦ సోషల్ మీడియా టాప్–3 లైఫ్‌గోల్స్ ఇన్ఫ్టుయెన్సర్లలో ఒకటిగా ఉంది ♦ కోవిడ్ అనంతర పరిస్థితుల్లో సామాజికసేవ, దాతృత్వం వైపు 61 శాతం మంది మొగ్గు ♦ ప్రతీ ముగ్గురిలో ఒకరు సామాజికంగా ప్రభావం చూపే వాటికి విరాళాలిచ్చేందుకు ఆసక్తి ♦ బాగా డబ్బు సంపాదించి ఉద్యోగాల నుంచి రిటైర్ కావాలనే భావనలో 30 శాతం ♦ లక్ష్యాల సాధనలో సందిగ్ధత వ్యక్తంచేసిన వారు 52 శాతం ♦ తమ జీవిత కాలంలో కనీసం ఐదు లక్ష్యాలనైనా చేరుకోవాలని ఆశిస్తున్నారు ♦ పిల్లలకు మంచి చదువు, సొంత ఇంటి కోసం ఎక్కువ మంది మొగ్గుచూపుతున్నారు ♦ మిగిలిన ప్రాంతాలతో పోలిస్తే మెట్రో నగరాల్లో నివసిస్తున్న వారిలో ఈ ఆశలు, ఆశయాలు మరింత ఎక్కువగా కనిపించాయి ♦ నవయువతరం మాత్రం వ్యక్తిగత ప్రయోజనాల సాధనకు ఆసక్తి చూపింది. హెల్త్, ఫిట్నెస్, విదేశీ ప్రయాణం వైపు మొగ్గు చూపింది. జీవిత బీమాలో పెట్టుబడులు ‘దక్షిణ భారత ప్రజల జీవిత లక్ష్యాలు, ఆశలు, లక్ష్యాల సాధనకు సంబంధించి 40 అంశాలపై పరిశీలన చేశాం. ఇందులో అనేక ఆసక్తికర అంశాలు వెల్లడయ్యాయి. కుటుంబ ఆర్థిక భద్రతకు దక్షిణాది వారు పెద్దపీట వేశారు. తమ జీవిత లక్ష్యాల సాధనకు జీవిత బీమాలో పెట్టుబడులు పెట్టడమే సరైన మార్గమని అధికశాతం అభిప్రాయపడ్డారు. కరోనా మహమ్మారి జీవితం, కెరీర్, ఆరోగ్యం, కుటుంబం పట్ల దృష్టికోణాన్ని మార్చింది. కుటుంబభద్రత, సామాజికంగా మంచి సంబంధాలు కలిగి ఉండటం, సామాజిక–ఆర్థిక పరిస్థితులు తదితర అంశాలన్నింటిని కలిపి మొత్తంగా జీవితాన్ని ప్రతిబించించేలా ఆలోచనలు మారాయి’అని బీమా సంస్థ చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్ చంద్రమోహన్ మెహ్రా చెప్పారు. -
సొంత బీమా.. ప్రైవేటు హంగామా
సాక్షి, హైదరాబాద్: వర్షాలు..వరదలు..పంటలకు తీవ్ర నష్టం..రైతన్నకు కష్టం. పరిహారం అందకపోవడంతో దిక్కుతోచని పరిస్థితి. ఈ నేపథ్యంలోనే రైతులు పంటల బీమా వైపు మొగ్గుచూపుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం పంటల బీమా పథకాన్ని నిలిపివేయడం, గత రెండేళ్లుగా పరిహారం అందకపోవడంతో విధిలేని పరిస్థితుల్లో ప్రైవేటు బీమా కంపెనీలను ఆశ్రయిస్తున్నారు. సొంతంగానే తమ పంటలకు బీమా చేయిస్తున్నారు. ఇదే అదనుగా ప్రైవేటు కంపెనీలు తమ ఏజెంట్లను రైతుల వద్దకు పంపుతూ వ్యాపారాన్ని పెంచుకుంటున్నాయి. రైతుల నిస్సహాయతను ఆసరాగా చేసుకుని ఇష్టారాజ్యంగా ప్రీమియం వసూలు చేస్తున్నాయనే ఆరోపణలు విన్పిస్తున్నాయి. రైతులకు అవగాహన కల్పించేందుకు, ప్రైవేటు కంపెనీలను నియంత్రించేందుకు వ్యవసాయ శాఖ ఎలాంటి చర్యలూ తీసుకోవడం లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రభుత్వ అజమాయిషీ లేకపోవడంతో పంట నష్టం జరిగినప్పుడు కొన్ని కంపెనీలు కొర్రీలు పెడుతూ పరిహారం అసలు ఇవ్వకపోవడమో, ఇచ్చినా తక్కువ ఇవ్వడమో చేస్తున్నాయన్న ఆరోపణలు కూడా విన్పిస్తున్నాయి. అయితే ఇప్పటివరకు దాదాపు లక్షన్నర మంది రైతులు ప్రైవేట్‌లో పంటల బీమా తీసుకున్నట్లు వ్యవసాయశాఖ వర్గాలు చెబుతున్నాయి. 2016–17 నుంచి పీఎంఎఫ్‌బీవై.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తమతమ వాటాలు చెల్లించేలా పంటల బీమా పథకం ఎప్పట్నుంచో అమలవుతోంది. అయితే 2016–17లో ఈ పథకం ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన (పీఎంఎఫ్‌బీవై)గా రూపుదిద్దుకుంది. ఈ పథకం కింద టెండర్ల ద్వారా ఖరారు చేసిన ప్రీమియం సొమ్ములో రైతులు వానాకాలం పంటలకు గరిష్టంగా 2 శాతం, యాసంగికి 1.5 శాతం, వాణిజ్య, ఉద్యాన పంటలకు 5 శాతం ప్రీమియం చెల్లించాలి. మిగిలిన ప్రీమియాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చెరి సగం కట్టాలి. వడగళ్ల వానలు, అకాల వర్షాలు, తుపాన్లు, వరదలు, సహజంగా జరిగే అగ్ని ప్రమాదాలు వంటి వాటివల్ల జరిగే పంట నష్టాలకు ఈ బీమా పరిహారం అందుతుంది. అయితే 2020 వానాకాలం సీజన్ నుంచి ఈ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం స్వచ్ఛందం చేసింది. రెండేళ్లుగా అందని పరిహారం.. పీఎంఎఫ్‌బీవై వల్ల పెద్దగా ప్రయోజనం లేదని తెలంగాణ సర్కారు భావించింది. ప్రైవేట్ బీమా కంపెనీలు రైతులకు సక్రమంగా పరిహారం అందజేయడం లేదన్న వాదనలూ వచ్చాయి. పైగా రైతుబంధు పథకం అమలు చేస్తున్నందున మళ్లీ పంటల బీమా పథకానికి ప్రీమియం చెల్లించాల్సి రావడం భారమని కూడా రాష్ట్ర ప్రభుత్వం భావించింది. ఇలా అనేక కారణాలతో ఈ పథకం నుంచి రాష్ట్ర ప్రభుత్వం వైదొలిగింది. అలాగని సొంత బీమా పథకాన్నైనా ప్రారంభించలేదు. దీంతో రెండేళ్లుగా రైతులకు పంట నష్టం జరిగినా పరిహారం దక్కడం లేదు. బిహార్, పశ్చిమ బెంగాల్, గుజరాత్, జార్ఖండ్ వంటి కొన్ని రాష్ట్రాలు ఈ పథకం స్థానంలో తమ సొంత పథకాలను ప్రారంభించాయి. ఆంధ్రప్రదేశ్ కూడా కేవలం రూపాయి ప్రీమియంతో ఉచితంగా కేంద్ర పథకాన్ని అమలు చేస్తోంది. వానాకాలం సీజన్లో 10 లక్షల ఎకరాల్లో పంట నష్టం! ఈ ఏడాది వానాకాలం సీజన్లో దాదాపు నెల రోజుల పాటు తీవ్రమైన వర్షాలతో పంటలు నీట మునిగాయి. పత్తి వంటి పంటలకు తీవ్రమైన నష్టం వాటిల్లింది. మొత్తంగా దాదాపు 10 లక్షల ఎకరాలకు పైగా పంట నష్టం జరిగిందని స్థానికంగా అంచనా వేశారు. కానీ పంటల బీమా లేకపోవడంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. నష్టాన్ని అంచనా వేసి కేంద్రానికి నివేదిక ఇవ్వడంలో వ్యవసాయ శాఖ విఫలమైంది. గత రెండేళ్లుగా పరిహారం అందకపోవడం, వానాకాలంలో పెద్దయెత్తున పంట నష్టం జరిగినా సాయం అందే పరిస్థితి లేకపోవడంతో, గత్యంతరం లేక రైతులే సొంతగా పంటల బీమా చేయించుకుంటున్నారు. బ్యాంకుల్లో రుణాలు తీసుకునే రైతులను కంపెనీలు పంటల బీమాలో చేర్చుతున్నాయి. ఒక్కో జిల్లాలో ఒక్కో రకంగా ప్రీమియం వసూలు చేస్తున్నాయి. -
ఐపీవోకు ఉవ్విళ్లూరుతున్న ఎల్ఐసీ! అంతలోనే భారీ షాక్!!
న్యూఢిల్లీ: జీవిత బీమా కంపెనీల కొత్త బిజినెస్ ప్రీమియం ఆదాయం 2022 జనవరిలో 2.65 శాతం పెరిగి, రూ.21,957 కోట్లకు చేరింది. రెగ్యులేటర్– ఐఆర్డీఏఐ (ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా) తాజా గణాంకాలను పరిశీలిస్తే.. ► దేశంలోకి మొత్తం 24 జీవిత బీమా కంపెనీలు 2022 జనవరిలో రూ.21,390 కోట్ల కొత్త బిజినెస్ ప్రీమియంను వసూలు చేశాయి. ► ఈ రంగంలో దిగ్గజ ప్రభుత్వ రంగ సంస్థ– లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఎల్ఐసీ) కొత్త ప్రీమియం ఆదాయం 2 శాతం. 5పడిపోయి రూ.12,936.28 కోట్లకు చేరింది. 2021 ఇదే నెల్లో ఎల్ఐసీ కొత్త ప్రీమియం ఆదాయం రూ.13,144 కోట్లు. ► ఇక 23 ప్రైవేటు రంగ కంపెనీల కొత్త ప్రీమియం 9.39 శాతం ఎగసి, రూ.8,246.06 కోట్ల నుంచి రూ. 9,020.75 కోట్లకు చేరింది. ► మొత్తం మార్కెట్లో ఎల్ఐసీ వాటా 61.15 శాతంగా ఉంది. వివిధ కారణాలతో రద్దయిన (ల్యాప్స్డ్) పాలసీలను పునరుద్ధరించుకోవడానికి ఎల్ఐసీ ప్రకటించిన ప్రత్యేక ఆఫర్ ఈ నెల 7వ తేదీ నుంచి మార్చి 27వ తేదీ వరకూ అమలవుతుంది. హెల్త్, మైక్రో ఇన్సూరెన్స్ పాలసీలపైనా లేట్ ఫీజులో రాయితీ ఈ ఆఫర్లో ప్రత్యేకత. ఇక పబ్లిక్ ఇష్యూకు రావడానికి కూడా ఎల్ఐసీ సంసిద్ధమవుతున్న సంగతి తెలిసిందే. -
హెచ్డీఎఫ్సీ లైఫ్ చేతికి ఎక్సైడ్ లైఫ్
ముంబై: ప్రైవేట్ బీమా రంగంలో సరికొత్త డీల్‌కు హెచ్డీఎఫ్సీ లైఫ్ ఇన్సూరెన్స్ తెరతీసింది. ఎక్సైడ్ ఇండస్ట్రీస్ నుంచి బీమా అనుబంధ సంస్థ ఎక్సైడ్ లైఫ్ ఇన్సూరెన్స్‌ను కొనుగోలు చేయనుంది. ఇందుకు రూ.6,687 కోట్ల ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ఈ డీల్‌కు అటు హెచ్డీఎఫ్సీ లైఫ్, ఇటు ఎక్సైడ్ లైఫ్ కంపెనీల బోర్డులు తాజాగా ఆమోదముద్ర వేశాయి. ఒప్పందంలో భాగంగా ఎక్సైడ్ లైఫ్‌లో 100% వాటాను సొంతం చేసుకోనున్నట్లు హెచ్డీఎఫ్సీ లైఫ్ వెల్లడించింది. షేరుకి రూ.685 ధరలో 8.7 కోట్లకుపైగా హెచ్డీఎఫ్సీ లైఫ్ షేర్లను ఎక్సైడ్ ఇండస్ట్రీస్‌కు జారీ చేయనుంది. తద్వారా కొనుగోలు చేపట్టనున్నట్లు తెలియజేసింది. అంతేకాకుండా మరో రూ. 726 కోట్లను నగదు రూపంలో ఎక్సైడ్ ఇండస్ట్రీస్‌కు చెల్లించనున్నట్లు వివరించింది. లావాదేవీ పూర్తయ్యాక హెచ్డీఎఫ్సీ లైఫ్ సంస్థలో ఎక్సైడ్ ఇండస్ట్రీస్‌కు 4.1% వాటాను పొందనుంది. విలీనంవైపు..: పూర్తి వాటా కొనుగోలు ప్రక్రియ పూర్తికాగానే ఎక్సైడ్ లైఫ్‌ను విలీనం చేసుకోనున్నట్లు హెచ్డీఎఫ్సీ లైఫ్ పేర్కొంది. బీమా రంగ నియంత్రణ సంస్థ ఐఆర్డీఏతోపాటు, కాంపిటీషన్ కమిషన్(సీసీఐ), జాతీయ కంపెనీ చట్ట ట్రిబ్యునల్(ఎన్సీఎల్టీ), స్టాక్ ఎక్సే్ఛంజీల నుంచి అనుమతులు లభించవలసి ఉన్నట్లు తెలియజేసింది. వీటితోపాటు రెండు కంపెనీల వాటాదారుల నుంచి గ్రీన్‌సిగ్నల్ లభించాక కొనుగోలు లావాదేవీని పూర్తిచేయనున్నట్లు తెలియజేసింది. దేశీ బీమా రంగంలో ఈ డీల్ ల్యాండ్‌మార్క్ వంటిదని హెచ్డీఎఫ్సీ లైఫ్ చైర్మన్ దీపక్ పరేఖ్ పేర్కొన్నారు. దీంతో మరింత మందికి బీమా రక్షణ లభించే వీలుంటుందని అభిప్రాయపడ్డారు. ఎక్సైడ్ బ్రాండు వినియోగానికి రెండేళ్ల కాలపరిమితి లభించనున్నట్లు హెచ్డీఎఫ్సీ లైఫ్ ఎండీ, సీఈవో విభా పడల్కర్ వెల్లడించారు. ఎక్సైడ్ లైఫ్ తీరిదీ..: 2001–02లో కార్యకలాపాలు ప్రారంభించిన ఎక్సైడ్ లైఫ్ 2021 జూన్‌కల్లా రూ.2,711 కోట్ల అసలు విలువను సాధించింది. గత ఆర్థిక సంవత్సరం(2020–21)లో మొత్తం రూ. 3,325 కోట్ల విలువైన ప్రీమియంను అందుకుంది. జూన్‌కల్లా రూ. 18,780 కోట్ల విలువైన ఏయూఎంను కలిగి ఉంది. ఈ నేపథ్యంలో హెచ్డీఎఫ్సీ లైఫ్ షేరు ఎన్ఎస్ఈలో 3.3 శాతం పతనమై రూ. 734 వద్ద ముగిసింది. ఎక్సైడ్ ఇండస్ట్రీస్ షేరు 6 శాతం జంప్‌చేసి రూ. 189 వద్ద ముగిసింది. -
15 నుంచి ఐసీఐసీఐ లాంబార్డ్ ఐపీఓ
► నాన్‌లైఫ్ ప్రైవేట్ బీమా సంస్థల్లో మేమే టాప్ ► సంస్థ సీఎఫ్ఓ గోపాల్ బాలచంద్రన్ వెల్లడి హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: విదేశీ సంస్థలు భారతీయ బీమా కంపెనీల్లో వాటాలను 10 శాతానికే పరిమితం చేసుకోవాలన్న ఐఆర్డీఎ నిబంధనల్ని అమలు పరచటంలో భాగంగా ఐపీఓకు వస్తున్నట్లు ఐసీఐసీఐ లాంబార్డ్ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ గోపాల్ బాలచంద్రన్ చెప్పారు. దేశీయంగా అతిపెద్ద నాన్‌లైఫ్ ప్రైవేట్ బీమా కంపెనీ తమదేనంటూ ఈ రంగంలో మొదట ఐపీఓకి వస్తున్నది కూడా తామేనని తెలియజేశారు. ఐపీఓ వివరాలను వెల్లడించటానికి మంగళవారమిక్కడ విలేకరులతో మాట్లాడారు. ‘‘తాజా ఆఫర్లో కంపెనీలోని విదేశీ భాగస్వామి ఫెయిర్‌ఫాక్స్ ఫైనాన్షియల్స్ 5.45 కోట్ల ఈక్విటీ షేర్లను, దేశీయ భాగస్వామి ఐసీఐసీఐ బ్యాంక్ 3.17 కోట్ల షేర్లను విక్రయిస్తాయి. ఐపీఓలో ఫెయిర్‌ఫాక్స్ వాటాలో 12 శాతం, ఐసీఐసీఐ బ్యాంక్ వాటాలో 7 శాతం అమ్మకానికి పెడుతున్నాం. ఐపీఓ అనంతరం కంపెనీలో ఫెయిర్‌ఫాక్స్ వాటా 9.91 శాతానికి, ఐసీఐసీఐ బ్యాంక్ వాటా 56 శాతానికి తగ్గుతుంది’’ అని వివరించారు. ఐపీఓలో 50 శాతం క్యుఐబీలకు, 15 శాతం సంస్థాగతేతర ఇన్వెస్టర్లకు, 35 శాతం రిటైలర్లకు (ఇందులోనే 5 శాతం ఐసీఐసీఐ బ్యాంకు షేర్లు ఉన్నవారికి) రిజర్వ్ చేశామన్నారు. ఐపీఓ ధర శ్రేణిని రూ.651– 661గా నిర్ణయించామన్నారు. ఐపీఓ ఈనెల 15న ప్రారంభం అయి 19న ముగుస్తుంది. మోటార్ బీమాలే అధికం దేశీ నాన్‌లైఫ్ బీమా విభాగంలో సింహభాగం మోటార్ బీమాదేనని గోపాల్ చెప్పారు. ‘‘వాహన బీమాది 40 శాతం వాటా. 27 శాతం హెల్త్ది. ఇప్పుడిప్పుడే పంటల బీమా వాటా పెరుగుతోంది. మొత్తం నాన్‌లైఫ్ బీమా పరిశ్రమలో మా వాటా 8 శాతం. ప్రైవేట్ విభాగంలో ఇది 18 శాతం’’ అని వివరించారు. కార్యక్రమంలో కంపెనీ అండర్రైటింగ్స్ చీఫ్ సంజయ్ దత్తా పాల్గొన్నారు. ఎస్బీఐ లైఫ్ ఐపీవో 20 నుంచి న్యూఢిల్లీ: ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్ ఐపీవో సెప్టెంబర్ 20న ప్రారంభం కానుంది. సెప్టెంబర్ 22న ముగియనున్న ఈ ఐపీవోలో భాగంగా సంస్థ రూ.8,400 కోట్లను సమీకరించనుంది. కాగా ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ లైఫ్ ఇన్సూరెన్స్ తర్వాత మార్కెట్లో లిస్ట్ కాబోతోన్న రెండో జీవిత బీమా కంపెనీ ఎస్బీఐ లైఫ్. మార్కెట్ వర్గాల నుంచి అందుతోన్న సమాచారం ప్రకారం ఎస్బీఐ లైఫ్ ఐపీవో ప్రైస్ బ్యాండ్ రూ.685–రూ.700 శ్రేణిలో ఉండొచ్చని తెలుస్తోంది.