ఈ–క్రాప్ నమోదు చేస్తున్న వ్యవసాయ శాఖ సిబ్బంది (ఫైల్)
సాక్షి, అమరావతి: రాక్షస ఆలోచనలతో నిండిపోయిన రామోజీ మెదడుకు వాస్తవాలు బయటికొస్తాయనే భయం ఏకోశానా లేదు. రైతులపై పైసా భారం పడకుండా నోటిఫై చేసిన పంటలకు సంబంధించి సాగుచేసిన ప్రతీ ఎకరాకు ఈ–క్రాప్ ఆధారంగా బీమా కవరేజ్‌ను కల్పిస్తూ ఆంధ్రప్రదేశ్ దేశానికే ఆదర్శంగా నిలుస్తుంటే ఆ పండు ముసలి ప్రాణం కడుపుమంటతో రగిలిపోతోంది. యూనివర్సిల్ కవరేజ్ విషయంలో ఏపీని స్ఫూర్తిగా కేంద్రం కూడా తీసుకుని రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి పనిచేసేందుకు ముందుకొచ్చి వైఎస్సార్ ఉచిత పంటల బీమా పథకంతో కలిసి ఫసల్ బీమాను అమలుచేస్తోంది.
పలు రాష్ట్రాలు కూడా ఈ విషయంలో ఏపీ బాటపట్టాయి. కానీ, క్షుద్ర రాతలతో అబద్ధాలను అడ్డగోలుగా అచ్చేసే రామోజీకి ఇవన్నీ తెలిసినా కణకణాన ఓర్వలేనితనం ఆయన్ను రోజురోజుకీ దిగజారుస్తోంది. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా గడిచిన నాలుగేళ్లలో రాష్ట్ర ప్రభుత్వం 44.66 లక్షల మందికి రూ.6,684.84 కోట్ల పరిహారం అందించింది. కానీ, ఇవన్నీ చూసి తట్టుకోలేకపోతున్న రామోజీ నిత్యం ఈ పథకంపై బురద జల్లడమే పనిగా పెట్టుకున్నారు. రైతులను గందరగోళ పర్చేలా ‘ఏది బీమా?’ అంటూ తాజాగా ఈనాడు ఎంతో ఆతృతతో మరో అబద్ధాల సంకలనాన్ని అచ్చేసింది.
నిజానికి.. ఖరీఫ్–21 సీజన్‌కు సంబంధించి 15.61 లక్షల మందికి రూ.2,977.82 కోట్ల పరిహారం అందించిన రాష్ట్ర ప్రభుత్వం.. పరిహారం ఇంకా అందని వారెవరైనా మిగిలి ఉన్నారేమోనని దరఖాస్తులను ఆహ్వానించింది. అర్హులను గుర్తించి ఈ నెల 14న మరో 9 వేల మందికి రూ.90 కోట్ల పరిహారం జమచేసి రైతులపట్ల తన చిత్తశుద్ధిని చాటుకుంది. కానీ, ఇవేమీ పట్టించుకోని ఈనాడు విషం కక్కడమే పనిగా పెట్టుకుంది. ఫిల్‌్మసిటీ కోటలో కాలుజాపుకుని ఇంకెన్నాళ్లు ఈ ఎల్లో జర్నలిజం చేస్తారు? మీ కథల్ని ప్రజలు నమ్మే రోజులు పోయాయని తెలుసా? ‘ఏది బీమా?’పై ఇదీ నిజం.. చదవండి రామోజీ..
ఆరోపణ: బీమా హుళక్కేనా?
వాస్తవం: ఈ–పంట నమోదు జరిగిన వెంటనే రైతుల మొబైల్‌కు ఎస్‌ఎంఎస్ రూపంలో మెస్సేజ్‌లు పంపడమే కాదు.. ఈ–కేవైసీ ప్రక్రియ పూర్తికాగానే ప్రతీ రైతుకు భౌతిక రశీదులు అందించారు. వీటి ప్రామాణికంగానే పంట ఉత్పత్తుల కొనుగోళ్లతో పాటు వ్యవసాయ రుణాలు, సున్నా వడ్డీ రాయితీ, పంటల బీమా, పంట నష్టపరిహారం వంటి ఇతర సంక్షేమ పథకాలను రాష్ట్ర ప్రభుత్వం అమలుచేస్తోంది. సాగు చేసిన పంటలలో నోటిఫై చేసిన పంటలకు బీమా రక్షణ కల్పిస్తున్నారు. ఈ వివరాలన్నీ ఆ రశీదుల్లో స్పష్టంగా పొందుపరుస్తున్నారు. ఈ విషయంలో రైతుల్లో ఎలాంటి గందరగోళంలేదు. ఈనాడుకు తప్ప.
ఆరోపణ: ఆ పంటలకు బీమా కవరేజ్ ఏదీ?
వాస్తవం: నాసిరకం విత్తనాలవల్ల పంటలు దెబ్బతిన్నా, ఆశించిన దిగుబడులు రాకపోయినా, వాతావరణం వల్ల పంటలు దెబ్బతిన్నా నోటిఫై పంటలకు బీమా పరిహారం అందిస్తారు. పత్తి, మిరప, ఉల్లి తదితర పంటలన్నీ నోటిఫైడ్ పంటలే. గతంలో ఈ పరిస్థితి ఉండేది కాదు. ప్రీమియం చెల్లించిన రైతులకు మాత్రమే కవరేజ్ ఉండేది. అధికారులు, బీమా కంపెనీల చుట్టూ చెప్పులరిగేలా తిరిగితే కానీ పరిహారం సొమ్ములు దక్కేవి కావు. అది కూడా అరకొరగానే. కానీ, నేడు రైతులపై పైసా భారం పడకుండా నాలుగేళ్లుగా పంటల బీమా పరిహారం ఇస్తున్నారు.
ఆరోపణ : అన్నదాతను ఆదుకోవడంలో అలసత్వమేలా?
వాస్తవం: పంటల పరిహారం చెల్లింపులో ఈనాడు చెబుతున్నట్లుగా ఎలాంటి గందరగోళంలేదు. యూనివర్సల్ కవరేజ్ విషయంలో కేంద్రం దిగిరావడంతో ఖరీఫ్–22 సీజన్‌కు సంబంధించి దిగుబడి ఆధారిత పంటలకు పీఎంఎఫ్‌బీవై–డాక్టర్ వైఎస్సార్ ఉచిత పంటల బీమా పథకాన్ని అమలుచేస్తుండగా వాతావరణ ఆధారిత పంటలకు రాష్ట్ర ప్రభుత్వమే స్వయంగా వైఎస్సార్ ఉచిత బీమా పథకం కింద కవరేజ్ కల్పిస్తోంది. నోటిఫై చేసిన దిగుబడి ఆధారిత పంటలకు సంబంధించి ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వ వాటాతో పాటు రైతుల వాటాను కూడా ప్రభుత్వం చెల్లించింది.
మే నెల వరకు వాతావరణ ఆధారిత పంటల బీమా కవరేజీ కొన్ని పంటలకు మిగిలి వున్నందువలన బీమా పరిహారం లెక్కింపు తదనుగుణంగా పూర్తికావస్తోంది. ఖరీఫ్ సీజన్ మొదలై రెండు వారాలైనా ఖరీఫ్–2022 సీజన్‌కు సంబంధించి పంటల బీమా పరిహారం చెల్లింపుపై రైతులకు ఎలాంటి సమాచారం లేదనడంలో వాస్తవంలేదు. ఈ విషయంలో ప్రభుత్వం అసలు కసరత్తు చేయడంలేదని ఆరోపించడం హాస్యాస్పదం.
ఆరోపణ: ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు?
వాస్తవం: జూలై 8న ఖరీఫ్–22 సీజన్‌కు సంబంధించిన పంటల బీమా పరిహారాన్ని జమచేస్తామని సీఎం జగన్ స్వయంగా రైతుభరోసా ఇచ్చిన జూన్ 1నే ప్రకటించారు. ఎందుకంటే జూలై 8న రైతు దినోత్సవంతో పాటు వైఎస్సార్ జయంతి కూడా. కనుక ఇది ఇస్తారన్న సంగతి అందరికీ తెలుసు.
అయినా, ఈ విషయాన్ని స్పష్టంగా చెప్పినప్పటికీ దానిని ఏమాత్రం పట్టించుకోకుండా ఇంకా ఇవ్వలేదని రాయడం సబబేనా? ఇక.. ముందే చెప్పినట్లుగా ఆ తేదీకి సీఎం ఇచ్చేస్తే మేం చెప్పాం కాబట్టే ఇచ్చారని డబ్బా కొట్టుకునేందుకేనా ఈ రాతలు? మరోవైపు.. పంటల బీమాకు అర్హుల జాబితా మదింపు జరుగుతోంది.
ఈ నెలాఖరులోగా జాబితాలను ఆర్బీకేల్లో ప్రదర్శించేందుకు ఏర్పాట్లుచేస్తున్నారు. ఆ తర్వాత ఆన్‌లైన్‌లో అభ్యంతరాలను స్వీకరించి వాటిని జూలై మొదటి వారంలో పరిష్కరిస్తారు. ఆ వెంటనే తుది జాబితాలను ఆర్బీకేల ద్వారా ప్రదర్శిస్తారు.
ఆరోపణ: అమ్మఒడి కోసం జాప్యం చేస్తున్నారు..
వాస్తవం: 2016 నుంచి పీఎంఎఫ్‌బీవై అమలవుతోంది. అంతకుముందు వ్యవసాయ బీమా పథకం కింద బీమా కవరేజ్ కల్పించేవారు. గడిచిన సీజన్‌కు సంబంధించి చెల్లించాల్సిన బీమా పరిహారాన్ని గతంలో ఆగస్టు నెలాఖరులోపు ఇచ్చిన దాఖలాలే లేవు. పలు సీజన్‌లలో సెప్టెంబర్‌లో కూడా ఇచ్చారు. అది కూడా కంపెనీల చుట్టూ ప్రదక్షిణాలు చేస్తేకానీ పరిహారం దక్కేది కాదు.
కానీ, ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి గడిచిన సీజన్‌కు సంబంధించిన పరిహారాన్ని మరుసటి ఏడాది ఆ సీజన్ ప్రారంభమయ్యేలోగా అర్హుల జాబితాలను ప్రకటించి జూన్–జూలైలో పరిహారం అందిస్తున్నారు. ఈ వాస్తవాలను విస్మరించి అమ్మఒడి కార్యక్రమం ఉన్నందున పంటల బీమా పరిహారం జూలై లేదా ఆగస్టులో ఇచ్చే అవకాశం ఉందంటూ చేతికొచ్చినట్లు రాయడం ఈనాడుకే చెల్లింది.
ఆరోపణ : ఈకేవైసీ అంటూ కొత్త మెలిక పెట్టారు..
వాస్తవం: మొదట్లో ఈ–క్రాప్‌లో నమోదు చేయించుకుంటే చాలని, ఆ తరువాత ఈ–కేవైసీ చేయించుకుంటేనే పరిహారం ఇస్తామని మెలిక పెట్టిందనడంలో కూడా వాస్తవంలేదు. నోటిఫై చేసిన పంటలకు బీమా వర్తింపజేసేందుకు జారీచేసిన నోటిఫికేషన్‌లో రైతు తన ఆధార్ బయోమెట్రిక్ ధ్రువీకరణ చెయ్యాలని స్పష్టంగా పేర్కొన్నారు.
ఈ విషయాన్ని పలుమార్లు పత్రికాముఖంగా రైతులకు విజ్ఞప్తి చేయడమే కాదు.. ఆర్బీకేల ద్వారా ఈ–కేవైసీ నమోదు చేసుకోవాలని రైతులకు వివరించారు. చెల్లించాల్సిన క్లెయిమ్స్‌ను ఆధార్ ఆధారిత నగదు బదిలీ ద్వారా నేరుగా రైతు ఖాతాలకు జమచేస్తున్నందున ఈ–కేవైసీని ప్రామాణికంగా తీసుకుంటున్నారు.ఈ వాస్తవాలను కప్పిపుచ్చి రైతులను గందరగోళ పరిచేలా తప్పుడు వార్తలు రాయడం, విషం కక్కడం ఈనాడుకు నిత్యకృత్యమైపోయింది.
Comments
Please login to add a commentAdd a comment