నూతన పంటల బీమా పథకం అమలు తీరులో లోపాలు
ఐదు జిల్లాల్లో ఈ పంటకు గ్రామం యూనిట్‌గా అమలు లేనట్టే..
నిబంధనలు అడ్డొస్తున్నాయంటున్న అధికారులు
గ్రామం యూనిట్ లేకపోతే పంట నష్టపరిహారం పొందడం కష్టం
సాక్షిప్రతినిధి, సంగారెడ్డి: రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా అమలు చేయాలని నిర్ణయించిన పంటల బీమా పథకంలోని నిబంధనలు వరి రైతుల పాలిట శాపంగా మారుతున్నాయి. ఒక జిల్లాలో మొత్తం సాగువిస్తీర్ణంలో 25 శాతానికి మించి విస్తీర్ణమున్న పంటలను మాత్రమే గ్రామం యూనిట్‌గా పంటల బీమా పథకం అమలు చేయాలనే నిబంధన ఉంది.
ఈ నిబంధన ప్రకారం సంగారెడ్డితోపాటు, వికారాబాద్, జోగుళాంబ గద్వాల, ఆదిలాబాద్, కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లాల్లో ఏ ఒక్క పంట కూడా 25 శాతానికి మించి సాగు కావడం లేదు. దీంతో ఈ జిల్లాల్లో గ్రామం యూనిట్‌గా అమలు చేసే అవకాశం లేకుండాపోతోంది.
ఈ వానాకాలం నుంచే కొత్త పథకం అమలు
అధిక వర్షాలు, వడగండ్ల వానలు, ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలతో పంట నష్టపోయిన రైతులకు పరిహారం అందేలా పంటల బీమా పథకం అమలు చేస్తారు. ఐదేళ్ల క్రితం నిలిపివేసిన ఈ పథకాన్ని పునరుద్ధరించాలని రాష్ట్రంలో కొత్తగా కొలువుదీరిన కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయించింది. ప్రధానమంత్రి ఫసల్ బీమా పథకంలో భాగంగా ఈ వానాకాలం నుంచే రాష్ట్రంలో ఈ పథకాన్ని అమలు చేసేందుకు చర్యలు చేపట్టింది.
నిర్మల్‌లో వరితోపాటు, సోయా కూడా..
రాష్ట్రవ్యాప్తంగా 32 జిల్లాల్లో ఈ పంటల బీమా పథకం అమలు చేయాలని నిర్ణయించిన ప్రభుత్వం అన్ని జిల్లాల్లో వరి పంటను గ్రామం యూనిట్‌గా అమలు చేసేందుకు నిబంధనలు కలిసొస్తున్నాయి. నిర్మల్ జిల్లా వరితోపాటు, సోయా పంట కూడా గ్రామం యూనిట్‌గా అమలు చేసేందుకు వీలు కలుగుతోంది.
మండలం యూనిట్ అయితే వరి రైతుకు నష్టం
పంటల బీమా పథకం గ్రామం యూనిట్‌గా అమలు చేస్తేనే ప్రకృతి వైపరీత్యాల కారణంగా నష్టపోయిన రైతులకు క్లెయిమ్ (పరిహా రం) అందుతుంది. మండలం యూనిట్‌గా అమలు చేస్తే చాలామంది రైతులకు ఈ క్లె యిమ్ అందదు. ఎలాగంటే.. మండలం యూనిట్‌గా తీసుకుంటే అధిక వర్షాలుగానీ, వడగండ్ల వానగానీ, ఈదురుగాలుల వర్షం కారణంగా మండలవ్యాప్తంగా అన్ని గ్రామా ల్లో మొత్తం వరి పంట నష్టపోతే మాత్రమే రైతులకు పరిహారం అందుతుంది.
మండలంలో కొన్ని గ్రామాల్లో పంట నష్టం జరిగి, మరికొన్ని గ్రామాల పరిధిలో నష్టం జరగకపోతే పంట నష్టపోయిన గ్రామాల రైతులకు కూడా పరిహారం అందదు. దీంతో రైతులు తీవ్రంగా నష్టపోయే పరిస్థితులు ఎదురుకానున్నాయి. ఈ నిబంధనపై రైతు సంఘాలు పెదవి విరుస్తున్నాయి. రైతుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని అన్ని జిల్లాలకు ఒకే విధంగా నిబంధనలను సరళీకృతం చేయాలని కోరుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment