పరిహారం... పరిహాసం
ఏళ్ల తరబడి అన్నదాతల నిరీక్షణ
నేటికీ అందని 2012-13 పరిహారం
పరిహారం పరిహాసమవుతోంది. అన్నదాతలకు పంటల బీమా అందని ద్రాక్షగా మిగులుతోంది. చెప్పులరిగేలా ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నా బీమాకు నోచుకోక వేలాది మంది రైతులు గగ్గోలు పెడుతున్నారు. బీమా కంపెనీల ఉదాశీనత..ప్రభుత్వ వైఫల్యం కారణంగా ఏఏటికాయేడు పంటల బీమా చెల్లించేందుకు అన్నదాతలూ వెనుకడుగు వేసుస్తున్నారు.
విశాఖపట్నం : జిల్లాలో నాలుగేళ్లుగా పంటల బీమాకు నోచుకునే రైతులను వేళ్లమీద లెక్కించవచ్చు. గతేడాది ఒక్క రైతు కూడా పరిహారం పొందిన పాపానపోలేదు. బీమా విషయమై అన్నదాతలకు అవగాహన కల్పించడంలో అధికారుల వైఫల్యమే ఈ పరిస్థితికికారణం. గతంలో ప్రీమియం చెల్లించిన రైతులు చేతికంది వచ్చిన పంటను నష్టపోయినప్పటికీ నేటికీ పరిహారం అందని దుస్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. జిల్లాలో ఏటా2.74 లక్షలహెక్టార్లలో పంటలు సాగవుతున్నాయి. నాలుగున్నర లక్షలమంది రైతులున్నారు. ఐదేళ్లుగా వరుసగా ప్రకృతి విపత్తుల బారినపడి రైతులు నిలువునా నష్టపోయారు. అవగాహన లేమి వల్ల రైతులు ప్రీమియం చెల్లించకపోవడంతో దెబ్బతిన్న పంటలకు బీమా దక్కని పరిస్థితి నెలకొంది. కాగా 2012-13లో కూడా ఇదే రీతిలో పంటలు విపత్తుల బారిన పడి నాశనమయ్యాయి. ఆ ఏడాది జిల్లాలో వరిసాగు చేసిన విస్తీర్ణంలో 6,128.71 ఎకరాలకు సంబం ధించి 9865 మంది రైతులు పంటల బీమా కింద ఎకరాకు రూ.320 చొప్పున ప్రీమియం చెల్లించారు. ఈ లెక్కన రైతులు రూ.32,93,522 చెల్లించారు. అదే విధంగా 89.77 ఎకరాలకు సంబంధించి 131 మంది రైతులు ఎకరాకు రూ.933 చొప్పున రూ.2,65,854 ప్రీమియం మొత్తాన్ని చెల్లించారు. ఈ లెక్కన ఆ ఏడాది 6217.98 ఎకరాల కోసం 9996 మంది రైతులు రూ.35,59,376 చెల్లించారు.
బీమా చేయించుకుంటే పంటలు దెబ్బతింటే వరికి ఎకరాకు రూ.26,520, చెరకకు ఎకరాకు రూ.72,040చొప్పున బీమా పరిహారం చెల్లిస్తారు. ఈ లెక్కన దెబ్బతిన్న 9996 మంది రైతులకు 6217.98 ఎకరాలకు సంబంధించి రూ.16,25,33,389 బీమా సొమ్ము చెల్లించాల్సి ఉంది. కానీ నేటికి ఒక్కపైసా కూడా మంజూరు కాని దుస్థితి నెలకొంది. జిల్లాలో 39 మండలాల పరిధిలో ఈ రైతులుంటే కేవలం మూడే మూడు మండలాల పరిధిలో పంటలు దెబ్బతిన్న రైతులకు మాత్రం బీమా సొమ్ము మంజూరు చేశారు. ఈ విధంగా వి.మాడుగుల మండలంలో 2921 మంది రైతులకు 1273.51 ఎకరాలకు రూ.9,54,287లు, బుచ్చెయ్యపేటలో 2952 మంది రైతులకు 1114.89 ఎకరాలకు 30,46,882, రాంబిల్లి మండలంలో 17 మంది రైతులకు 24.37 ఎకరాలకు రూ.6,46,292 చొప్పున మొత్తం ఈ మూడు మండలాలపరిధిలోని రైతులకు రూ.3,74,66,659లు మంజూరు చేస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. ఈ మండలాల్లో ప్రీమియం చెల్లించిన రైతుల జాబితాలను ఆధార్, పట్టాదార్ పా్‌స్ పుస్తకాలు ఇతర వివరాలను సమర్పించాల్సిందిగా ఏడాది క్రితంప్రభుత్వం కోరినట్టు వ్యవసాయ శాఖాధికారులు చెబుతున్నారు.
కానీ ఏ ఒక్క రైతుకు పైసా కూడా నేటికీ విడుదల చేయని దుస్థితి. ఇన్స్యూరెన్స్ కంపెనీలు బీమాసొమ్ము విడుదల చేసినా ప్రభుత్వం మాత్రం చెల్లించకుండా కాలయాపన చేస్తోందనే విమర్శలు ఉన్నాయి. ఈ మూడు మండలాల రైతులే కాదు..జిల్లావ్యాప్తంగా ప్రీమియం సొమ్ము చెల్లించిన రైతులు కూడా బీమా సొమ్ము కోసం కళ్లల్లో ఒత్తులేసుకుని నాలుగేళ్లుగా కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం బాధిత రైతులకు బీమా సొమ్ము చెల్లించడంతో పాటు కనీసం రబీలోనైనా పంటల బీమాపై అన్నదాతలకు అవగాహన కల్పించాలని కోరుతున్నారు.
ధీమాలేని బీమా
Published Thu, Nov 19 2015 11:14 PM | Last Updated on Mon, Oct 1 2018 2:09 PM