రాష్ట్ర ప్రభుత్వ విన్నపానికి అంగీకారం
రాష్ట్రంలో ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన అమలుకు ఏర్పాట్లు
వచ్చే వానాకాలం సీజన్ నుంచి అమలు చేసే అవకాశం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలోనూ ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన పథకం అమలులోకి రానుంది. వచ్చే వానాకాలం సీజన్ నుంచి ఈ పథకాన్ని రాష్ట్రంలో అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఈ మేరకు అనుమతి కోరుతూ కేంద్రానికి లేఖ రాసింది. దీనికి కేంద్రం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చినట్టు వ్యవసాయశాఖ వర్గాలు తెలిపాయి. వచ్చే సీజన్ నుంచి అమలు చేయాలంటే తక్షణమే పథకాన్ని అమలు చేసే కంపెనీలను టెండర్ల ద్వారా ఆహ్వానించాలి. దీనికి నోటిఫికేషన్ జారీ చేయాలి.
అయితే ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున ఇప్పుడు టెండర్ నోటిఫికేషన్ ఇవ్వాలంటే ఎన్నికల కమిషన్ అనుమతి తప్పనిసరి. పంటల బీమా పథకం ప్రారంభం అనేది ఎంతోమంది రైతులను ప్రభావితం చేయనున్నందున ఈసీ అనుమతి లేనిదే ముందుకు సాగలేమని అధికారులు చెబుతున్నారు. ఒకవేళ ఈసీ అనుమతి ఇవ్వకుంటే ఈ పథకం వచ్చే సీజన్ నుంచి అమలు అయ్యే అవకాశాలు తక్కువగానే ఉన్నాయని అంటున్నారు.
క్లస్టర్ల వారీగా అమలు
గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన పథకం రైతులకు అనుకూలంగా లేదన్న భావనతో ఈ పథకం నుంచి 2020లో బయటకు వచ్చింది. అయితే ఏదో ఒక పంటల బీమా పథకం ఉండటమే మేలన్న భావన కొందరు రైతుల్లో ఉంది. దీంతో చివరకు కాంగ్రెస్ ప్రభుత్వం పాత పథకాన్నే అమలు చేయనుంది. దీంతో ప్రకృతి వల్ల పంట నష్టపోయిన రైతులకు పరిహారం అందుతుందని అధికారులు చెబుతున్నారు. ఈ పథకాన్ని క్లస్టర్ల వారీగా అమలు చేయనున్నారు. గతంలో అప్పటి ప్రభుత్వం ఆరు క్లస్టర్లు ఏర్పాటు చేసింది. ఆ ప్రకారమే ఈసారి కూడా ముందుకు సాగే అవకాశాలున్నాయి.
ప్రీమియం ఇలా...
వానాకాలం సీజన్‌లో సాగుచేసే ఆహారధాన్యాల పంటలకు 2 శాతం ప్రీమియం రైతులు చెల్లించాలి.
– పత్తి, మిర్చి సహా ఇతర వాణిజ్య, వాతావరణ ఆధారిత పంటలకు మాత్రం 5 శాతం రైతులు ప్రీమియం చెల్లించాలి.
అయితే జిల్లాలను బట్టి, అక్కడి వాతావరణ పరిస్థితులను బట్టి ప్రీమియం రేటు మారుతుండేది. అయితే ఈసారి రైతు వాటా ప్రీమియం ప్రభుత్వమే చెల్లిస్తుందని ఇప్పటికే పలువురు మంత్రులు ప్రకటించారు. కాబట్టి రైతులంతా ఈ పథకంలోకి వస్తారు. మరోవైపు ఈ పథకాన్ని అమలు చేసేందుకు జిల్లా, రాష్ట్రస్థాయిలో కమిటీలు ఏర్పాటు కానున్నాయి. దీనికి అధికారులు కసరత్తు చేస్తున్నారు.
బీమా అమలుకు సూచనలు
పంటల బీమా పథకం రాష్ట్రంలో అమలు చేయాలంటే ప్రభుత్వం కొన్ని చర్యలు చేపట్టాలని పలువురు అధికారులు, వ్యవసాయ నిపుణులు సూచిస్తున్నారు.
– బీమా కంపెనీలు ప్రీమియం ధరలను ఏటేటా భారీగా పెంచుతుంటాయి. ఈ పద్ధతి మార్చాలి.
– కంపెనీలు పూర్తిస్థాయిలో మౌలిక సదుపాయాలు, సిబ్బందిని ఏర్పాటు చేసుకోవడం లేదు. జిల్లా స్థాయిలో అధికారులు ఉండటం లేదు. దీంతో రైతులకు బీమాపై అవగాహన కల్పించే పరిస్థితి లేకుండా పోయింది.
– కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు బీమా ప్రీమియం చెల్లించిన మూడువారాల్లోగా రైతులకు పరిహారం ఖరారు చేయాలి. గతంలో నెలల తరబడి ఆలస్యం చేయడంతో రైతులు తీవ్రంగా నష్టపోయేవారు.
– రైతుల ఫిర్యాదులు వినడానికి, పరిష్కరించడానికి కచ్చితమైన యంత్రాంగం జిల్లా, రాష్ట్రస్థాయిలో నెలకొల్పాలి.
– చిన్నచిన్న అంశాలను ఆధారం చేసుకొని పంటల బీమాను రైతులకు అందకుండా చేస్తున్నారు. ఇది పథకం అమలును నీరుగారుస్తుంది.
– వివిధ దశల్లో విధిస్తున్న షరతులు, నిబంధనల కారణంగా బీమా నష్టపరిహారం పొందడం గగనంగా మారింది. వీటిని మార్చాలి.
Comments
Please login to add a commentAdd a comment