బీజేపీ కనుసన్నల్లో ఎన్నికల కమిషన్‌ | Ktr comments over congress and bjp | Sakshi
Sakshi News home page

బీజేపీ కనుసన్నల్లో ఎన్నికల కమిషన్‌

Published Fri, May 3 2024 5:10 AM | Last Updated on Fri, May 3 2024 5:10 AM

Ktr comments over congress and bjp

మోదీ, అమిత్‌ షా విద్వేష ప్రసంగాలపై చర్యలు తీసుకునే ధైర్యం లేదు: కేటీఆర్‌ 

వారు ప్రచారంలో దేవుడిని, మతాన్ని ప్రస్తావించడం నేరమే అయినా నోటీసులేవి? 

రేవంత్‌రెడ్డి ప్రసంగాలేమైనా ప్రవచనాలు, సుభాషితాలు, సూక్తులా? 

మేం 27 ఫిర్యాదులు చేసినా ఈసీ స్పందించలేదు 

రాజ్యాంగాన్ని అపహాస్యం చేసేలా ఎన్నికల కమిషన్‌ వైఖరి 

కేసీఆర్‌ బస్సుయాత్రతో కాంగ్రెస్, బీజేపీలకు దడ పుట్టిందని వ్యాఖ్య 

ఓయూ సర్క్యులర్‌ ఫోర్జరీ చేసిన రేవంత్‌పై కేసు నమోదు చేయాలని డిమాండ్‌ 

కాంగ్రెస్, బీజేపీలకు ప్రజలు ఓటుతో బుద్ధి చెప్పాలని పిలుపు 

సాక్షి, హైదరాబాద్‌: కేంద్ర ప్రభుత్వం స్వయం ప్రతిపత్తి కలిగిన సంస్థలను కూడా గుప్పిట పెట్టుకుని ఆడిస్తోందని.. ఈడీ, సీబీఐ వంటి దర్యాప్తు సంస్థలతో పాటు ఎన్నికల కమిషన్‌ కూడా బీజేపీ కనుసన్నల్లో పనిచేస్తోందని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీ రామారావు ఆరోపించారు. బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ ఎన్నికల ప్రచారంపై 48 గంటల నిషేధంతో ఎన్నికల కమిషన్‌ వైఖరి బయటపడిందని విమర్శించారు. గురువారం బీఆర్‌ఎస్‌ కార్యాలయం తెలంగాణ భవన్‌లో కేటీఆర్‌ మీడియాతో మాట్లాడారు. వివరాలు ఆయన మాటల్లోనే.. 

‘‘జాతులు, మతాల ఆధారంగా స్వయంగా ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా వైషమ్యాలు రెచ్చగొడుతూ విద్వేషపూరిత ప్రసంగాలు చేస్తున్నారు. ప్రత్యర్థి పార్టీలను తిడుతూ అధికారిక సోషల్‌ మీడియా ఖాతాల ద్వారా బీజేపీ విషం చిమ్ముతోంది. బీజేపీ కాకుండా ఇతరులు అధికారంలోకి వస్తే.. సంపదను ఎక్కువ పిల్లలున్న ముస్లింలకు దోచిపెడతారంటూ వారు వ్యాఖ్యలు చేస్తున్నా ఈసీ నుంచి ఉలుకూపలుకూ లేదు.

 ఆ వ్యాఖ్యలపై 20వేల మందికిపైగా పౌరులు ఈసీకి ఫిర్యాదు చేసినా చర్యలు తీసుకునే ధైర్యం లేక.. మోదీకి బదులుగా బీజేపీ అధ్యక్షుడు నడ్డాకు నోటీసులు ఇచ్చింది. ఎన్నికల్లో దేవుడు, మతాన్ని ప్రస్తావించడం నేరమని తెలిసీ.. అమిత్‌ షా, పలువురు బీజేపీ నేతలు శ్రీరాముడి ఫొటో పట్టుకుని ఓట్లు అడుగుతున్నారు. అయినా వారికి నోటీసులు, చర్యలు లేవు. వ్యక్తిత్వ హననాలు, వ్యక్తిగత దూషణలు ఈసీకి కనిపించడం లేదు.

 కేసీఆర్‌పై రాకెట్‌ వేగంతో చర్యలు తీసుకున్న ఎన్నికల కమిషన్‌ నిజంగా స్వతంత్ర సంస్థ అయితే.. మోదీ, రేవంత్‌లపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు? రాజ్యాంగాన్ని అపహాస్యం చేసేలా ఈసీ వైఖరి ఉంది. ఒక పార్టీ, కొందరు నాయకులు ఆధీనంలో ఉన్నట్టు కనిపిస్తోంది. 

ఆ మాటలేమైనా ప్రవచనాలా? 
‘నిరోధ్‌లు, పాపడాలు అమ్ముకోండి..’అంటూ కాంగ్రెస్‌ నేత చేసిన వ్యాఖ్యలను తప్పుపడుతూ కేసీఆర్‌ ఒక్క మాట మాట్లాడితే.. 48 గంటల పాటు మాట్లాడకుండా గొంతు నొక్కారు. బీఆర్‌ఎస్‌ నుంచి సీఎం రేవంత్‌పై ఎనిమిది ఫిర్యాదులు.. మంత్రులు ఉత్తమ్, పొన్నం ప్రభాకర్, జూపల్లి కృష్ణారావు, కొండా సురేఖ తదితరుల వ్యాఖ్యలపై 27 ఫిర్యాదులు చేసినా ఈసీ స్పందించలేదు. ఏప్రిల్‌ 10న తుక్కుగూడ సభలో రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఈసీకి ప్రవచనాలు, సుభాíÙతాలు, సూక్తుల్లా కనిపించాయా? రేవంత్‌ మాటలను ఉటంకించడానికి సంస్కారం అడ్డువస్తోంది. అలాంటి వ్యాఖ్యలపై ఈసీ చర్యలేవి? 

కూడబలుక్కుని నిషేధం పెట్టారు 
కేసీఆర్‌ బస్సుయాత్రతో కాంగ్రెస్, బీజేపీలకు దడ పుట్టింది. ప్రజలు కేసీఆర్‌కు బ్రహ్మరథం పడుతున్నారనే వార్తలు, నిఘా సంస్థల నివేదికలు వారికి కంటగింపుగా మారాయి. బీఆర్‌ఎస్‌కు 8 నుంచి 12 సీట్లు వస్తాయని సర్వేలు చెప్తుండటం, జన స్పందన చూసి కాంగ్రెస్, బీజేపీ నేతలకు నిద్ర పట్టడం లేదు. దీంతో బడే భాయ్‌ మోదీ, చోటే భాయ్‌ రేవంత్‌ కూడబలుక్కుని కేసీఆర్‌ ప్రజల వద్దకు వెళ్లకుండా నిషేధం పెట్టారు. 

ఈ అప్రజాస్వామిక ప్రయత్నాలకు ప్రజలు ఓటుతో బుద్ధి చెప్పాలి. స్వేచ్ఛాయుత వాతావరణంలో, పారదర్శకంగా వ్యవహరించాల్సిన ఎన్నికల కమిషన్‌.. కేసీఆర్‌ ప్రచారాన్ని నిషేధించింది. కొందరిని మాత్రం ప్రజలు, ప్రత్యర్థుల మీదకు అచ్చోసిన ఆంబోతుల్లా వదిలేసింది.

రేవంత్‌పై క్రిమినల్‌ కేసు పెట్టాలి 
హాస్టళ్ల మూసివేతపై ఉస్మానియా యూనివర్సిటీ చీఫ్‌ వార్డెన్‌ గతేడాది ఇచ్చిన సర్క్యులర్, స్టాంప్‌ను ఫోర్జరీ చేసి ‘ఎక్స్‌’ఖాతాలో పోస్ట్‌ చేసిన సీఎం రేవంత్‌రెడ్డిపై క్రిమినల్‌ కేసు పెట్టాలి. ఉస్మానియా వర్సిటీ చీఫ్‌ వార్డెన్‌ ఇచ్చిన సర్క్యులర్‌ను బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ ‘ఎక్స్‌’లో పోస్ట్‌ చేశారు. దాంతో ఓయూ చీఫ్‌ వార్డెన్‌కు రిజి్రస్టార్, సదరన్‌ డిస్కం నుంచి నోటీసులు ఇప్పించారు. అంతటితో ఆగకుండా గత ఏడాది చీఫ్‌ వార్డెన్‌ ఇచ్చిన సర్క్యులర్‌ను రేవంత్‌ పోస్ట్‌ చేసి ప్రజలను తప్పుదోవ పట్టించారు. 

రేవంత్‌ ఫోర్జరీ డాక్యుమెంట్‌ను ‘ఎక్స్‌’లో పోస్ట్‌ చేసిన బీఆర్‌ఎస్‌ సోషల్‌ మీడియా కన్వీనర్‌ మన్నె క్రిషాంక్‌ను పోలీసులు అరెస్టు చేశారు. క్రిషాంక్‌ పెట్టిన సర్క్యులర్‌ తప్పు అని ఓయూ అధికారులు నిరూపిస్తే.. చంచల్‌గూడ జైలుకు వెళ్లేందుకు నేను సిద్ధం. రేవంత్‌పై ఓయూ విద్యార్థులు చేసిన ఫిర్యాదుపై పోలీసులు కేసు నమోదు చేయాలి. ఈసీ నిజంగా స్వతంత్ర సంస్థ అయితే రేవంత్‌పై చర్యలు తీసుకోవాలి’’అని కేటీఆర్‌ డిమాండ్‌ చేశారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement