రైతుల భాగస్వామ్యంలో నూతన పంటల బీమా విధానం
ఐఏఎస్ అధికారులు పొలంబాట పట్టి, రైతులతో మాట్లాడాలి
ఖరీఫ్ సాగు ప్రణాళిక, సాగునీటి విడుదలపై సమీక్షలో సీఎం
సాక్షి, అమరావతి: ప్రస్తుతం ఉన్న ఉచిత పంటల బీమా పథకం స్థానంలో మళ్లీ పాత విధానంలో క్రాప్ ఇన్సూ్యరెన్స్ తీసుకురావాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. రైతు భాగస్వామ్యం లేకుండా పంటల బీమా స్వరూపాన్నే మార్చేశారని, ఇక నుంచి సాగు చేసే ప్రతీ రైతుకు భాగస్వామ్యం ఉండేలా పంటల బీమా విధానాన్ని పునరుద్ధరించాలని చెప్పారు.
ఖరీఫ్ పంటల సాగులో వ్యవసాయ శాఖ సన్నద్దతపై బుధవారం సచివాలయంలో వ్యవసాయ, ఇరిగేషన్ అధికారులతో సీఎం సమీక్షించారు. ఈ సందర్భంగా అధికారులు సాగునీటి విడుదల ప్రణాళికను సీఎం చంద్రబాబుకు వివరించారు. గోదావరి డెల్టాకు జూన్ 1న నీరు విడుదల చేశామని, ఈ రోజు (బుధవారం) పట్టిసీమ, పుష్కర, తాటిపూడి, పురుషోత్తంపట్నం ద్వారా నీటి విడుదల ప్రారంభించామని చెప్పారు.
పులిచింతలలో నీటి లభ్యత లేదని, పట్టిసీమ ద్వారా వచ్చే నీటి ద్వారానే కృష్ణా డెల్టాకు సాగు నీరు ఇస్తామన్నారు. జూన్‌లో హీట్ వేవ్ ఉన్నప్పటికీ, ప్రస్తుతం వర్షాలు ఆశించిన స్థాయిలో ఉన్నాయన్నారు. రాష్ట్రంలో సగటున 50 శాతం అదనపు వర్షపాతం నమోదైందని, కేవలం 45 మండలాల్లోనే లోటు వర్షపాతం ఉందన్నారు. సీజన్‌లో ఇప్పటి వరకు 4,14,490 ఎకరాలు సాగు జరగాల్సి ఉండగా 3,04,604 ఎకరాల్లో పంటలు సాగయ్యాయన్నారు.
ఏపీలోనే రైతుల అప్పులెక్కువ
దేశంలో ఎక్కువ అప్పులు ఉండే రైతులు ఆంధ్రప్రదేశ్‌లోనే ఉన్నారని సీఎం చంద్రబాబు అన్నారు. ఈ పరిస్థితి మారాలన్నారు. ప్రభుత్వ సబ్సిడీలు, పాలసీల ద్వారా సాగు ఖర్చులు తగ్గాలన్నారు. గతంలో క్రమం తప్పకుండా సాయిల్ టెస్ట్‌లు నిర్వహించి, రైతులకు పోషకాలు అందించే వాళ్లమన్నారు. రాయలసీమ జిల్లాల్లో సబ్సిడీపై పెద్ద ఎత్తున డ్రిప్, స్ప్రింక్లర్లు ఇచ్చామని చెప్పారు. ప్రాజెక్టుల నిర్వహణలో మళ్లీ ఉత్తమ విధానాలు అమలు చేయాలని సూచించారు. జీరో బడ్జెట్ నాచురల్ ఫార్మింగ్‌ను మళ్లీ ప్రోత్సíßæంచాలన్నారు.
డ్రోన్లతో పురుగు మందుల పిచికారీపై అధ్యయనం చేయాలని, వాటి వినియోగంపై రైతులకు అవగాహన కల్పించాలని చెప్పారు. పంటలకు అధికంగా పురుగు మందులు కొట్టే విధానాలకు స్వస్తి పలకాలన్నారు. ఏ తెగులుకు ఏ మందు కొట్టాలి అనే విషయంలో అధికారులు రైతులకు సమాచారం ఇవ్వాలని సూచించారు. అన్ని పంట కాలువల్లో యుద్ధ ప్రాతిపదికన గుర్రపు డెక్క తొలగించాలని ఆదేశించారు. కృష్ణా నది నీటిని రాయలసీమకు ఎక్కువగా ఉపయోగించి, వృధాగా పోయే గోదావరి వరద నీటిని సద్వినియోగం చేసుకుని కృష్ణా డెల్టాకు నీరు ఇవ్వాలని అధికారులకు సూచించారు.
ఆక్వా, హార్టికల్చర్‌కు మరింత ప్రాధాన్యం ఇవ్వాలని చెప్పారు. తీవ్ర నష్టాల్లో ఉన్న రైతులకు మళ్లీ భరోసా కల్పించేలా అధికారులు పని చేయాలని ఆదేశించారు. ఐఏఎస్ అధికారులు సైతం సచివాలయం నుంచి పొలాలకు వెళ్లి, రైతులతో నేరుగా మాట్లాడాలన్నారు. ఈ సమీక్షలో మంత్రి అచ్చెన్నాయుడు, వ్యవసాయ, ఉద్యాన, ఇరిగేషన్ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment