
సాక్షి, అమరావతి: రైతులపై పైసా భారం పడకుండా వైఎస్సార్ ఉచిత పంటల బీమా అమలుకు రాష్ట్ర ప్రభుత్వం సన్నద్ధమైంది. దిగుబడి ఆధారిత పంటలకు ఇన్సూరెన్స్ కంపెనీలు ఖరారు కాగా వాతావరణ ఆధారిత పంటలపై కంపెనీలు ముందుకు రాకపోవడంతో గతంలో మాదిరిగానే నష్ట పరిహారం భారాన్ని పూర్తిగా భరించి చెల్లించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ముందుకొచ్చింది. మూడేళ్లుగా ఈ–క్రాప్ డేటా ఆధారంగా వైఎస్సార్ ఉచిత పంటల బీమా పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తోంది.
టీడీపీ హయాంలో ఐదేళ్లలో 30.85 లక్షల మందికి రూ.3,411.20 కోట్ల బీమా పరిహారం మాత్రమే చెల్లించగా 6.19 లక్షల మందికి ఎగ్గొట్టారు. వైఎస్సార్ సీపీ ప్రభుత్వం వచ్చాక గత సర్కారు ఎగ్గొట్టిన రూ.715.84 కోట్ల బకాయిలతో కలిపి మూడేళ్లలో 44.66 లక్షల మంది రైతులకు రూ.6,884.84 కోట్ల పరిహారాన్ని అందచేసింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వ పారదర్శక విధానాలకు గుర్తింపుగా ఈ క్రాప్ డేటా ప్రామాణికంగా రైతులందరికీ పంటల బీమా వర్తింపచేసేలా ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజనలో కేంద్ర ప్రభుత్వం మార్పులు తెచ్చింది. 2022–23 సీజన్ నుంచి ప్రధాని ఫసల్ బీమాతో వైఎస్సార్ ఉచిత పంటల బీమాను అనుసంధానించి అమలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించింది.
ఆర్బీకేల్లో ఈ–క్రాప్ డేటా
గ్రామం, మండలం, జిల్లా యూనిట్‌గా నోటిఫై చేసిన దిగుబడి ఆధారిత 17 పంటలు, వాతావరణ ఆధారిత 8 పంటల బీమా కవరేజ్ కోసం సెపె్టంబర్‌లో ఇన్సూరెన్స్ కంపెనీలను టెండర్లకు ఆహ్వానించారు. దిగుబడి ఆధారిత పంటల కవరేజ్ కోసం బిడ్డింగ్‌లో పాల్గొన్న ఎల్–1 కంపెనీల్లో 18 కంపెనీలను ఎంపిక చేసి 9 క్లస్టర్లను అప్పగించారు. సామాజిక తనిఖీల్లో భాగంగా ఈ క్రాప్ డేటాను ఈనెల 31వ తేదీ వరకు ఆర్బీకేల్లో ప్రదర్శించనున్నారు.
రైతుల నుంచి వచ్చే అభ్యంతరాలను పరిశీలించిన తర్వాత తుది జాబితాను నవంబర్ 2వ తేదీన ప్రదర్శిస్తారు. తుది జాబితా ఆధారంగానే నోటిఫై చేసిన దిగుబడి ఆధారిత పంటల కవరేజ్ కోసం రాష్ట్ర ప్రభుత్వ వాటాతో పాటు రైతుల వాటా మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఆయా ఇన్సూరెన్స్ కంపెనీలకు చెల్లిస్తుంది. వాతావరణ ఆధారిత పంటల కవరేజ్ కోసం ఇన్సూరెన్స్ కంపెనీలు ముందుకు రాకపోవడంతో గతంలో మాదిరిగానే డాక్టర్ వైఎస్సార్ ఉచిత పంటల బీమా పథకం కింద క్‌లైమ్స్ చెల్లించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ముందుకొచ్చింది.
Comments
Please login to add a commentAdd a comment