సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న డాక్టర్ వైఎస్సార్ ఉచిత పంటల బీమా పథకాన్ని దేశంలోనే అత్యుత్తమ పంటల బీమా పథకంగా కేంద్ర ప్రభుత్వం గుర్తించింది. ఈ – క్రాప్ ప్రామాణికంగా యూనివర్సల్ కవరేజ్ కల్పిస్తున్న ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అని ప్రకటించింది. రైతులపై పైసా కూడా భారం పడకుండా నోటిఫైడ్ పంటలకు 100 శాతం బీమా కల్పిస్తున్న రాష్ట్రమని ఏపీపై ప్రశంసలు కురిపించింది.
ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన (పీఎంఎఫ్‌బీవై)పై చత్తీస్‌ఘడ్‌లోని రాయపూర్‌లో గురువారం ప్రారంభమైన జాతీయ స్థాయి వర్కుషాపులో ‘ఇన్నోవేషన్ కేటగిరి’ కింద ఉత్తమ బీమా పథకంగా వైఎస్సార్ ఉచిత పంటల బీమా పథకాన్ని ఎంపిక చేశారు. ఈమేరకు కేంద్ర వ్యవసాయశాఖ కార్యదర్శి మనోజ్ ఆహూజా చేతుల మీదుగా రాష్ట్ర వ్యవసాయశాఖ ప్రత్యేక కమిషనర్ చేవూరు హరికిరణ్ ప్రత్యేక ప్రశంసా పత్రాన్ని అందుకున్నారు.
44 నెలల్లో రూ.6,684.84 కోట్ల పరిహారం..
నోటిఫై చేసిన పంటలకు సంబంధించి సాగు చేసిన ప్రతి ఎకరాకూ ఈ– క్రాప్, ఈ –కేవైసీ ప్రామాణికంగా ఖరీఫ్ 2020 నుంచి రాష్ట్ర ప్రభుత్వం ఉచిత పంటల బీమా పథకాన్ని అమలు చేస్తోంది. గతంలో గరిష్టంగా 25.86 లక్షల హెక్టార్లలో పంటలకు బీమా కవరేజ్ కల్పించగా ప్రస్తుతం ఏకంగా 60 లక్షల హెక్టార్లలో కవరేజ్ వర్తింపచేశారు. 2018–19 సీజన్‌లో గరిష్టంగా రూ.1263 కోట్ల పరిహారం చెల్లించగా ఖరీఫ్ 2021 సీజన్‌కు సంబంధించి రికార్డు స్థాయిలో రూ.2,977.82 కోట్ల పరిహారం అందించారు.
44 నెలల్లో 44.28 లక్షల మంది రైతులు రూ.6,684.84 కోట్ల పరిహారాన్ని అందుకున్నారు. ఈ – క్రాప్ ప్రామాణికంగా యూనివర్సల్ కవరేజ్ కల్పించేందుకు కేంద్రం ముందుకు రావడంతో 2022–23 సీజన్ నుంచి పీఎంఎఫ్‌బీవైతో అనుసంధానించి వైఎస్సార్ ఉచిత పంటల బీమా పథకాన్ని అమలు చేస్తున్నారు. ఖరీఫ్ 2022 సీజన్‌కు సంబంధించి ఇప్పటికే నూరు శాతం ఈ – క్రాప్‌తో పాటు 97 శాతం ఈ – కేవైసీతో రికార్డు సృష్టించారు.
ఏపీ స్ఫూర్తితో మార్పులు: అహూజా
ఆంధ్రప్రదేశ్‌ను స్ఫూర్తిగా తీసుకుని జాతీయ స్థాయిలో ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజనలో పలు మార్పులు చేసినట్లు కేంద్ర వ్యవసాయ శాఖ కార్యదర్శి మనోజ్ ఆహూజా వెల్లడించారు. పంటల బీమా అమలులో ఏపీ దేశానికే ఆదర్శంగా నిలిచిందని వర్కుషాప్‌లో ఆయన ప్రశంసించారు. రైతులపై పైసా భారం పడకుండా మొత్తం రాష్ట్ర ప్రభుత్వమే భరించడం నిజంగా గొప్ప ఆలోచనన్నారు. నాలుగేళ్లుగా వైఎస్సార్ ఉచిత పంటల బీమా పథకాన్ని విజయవంతంగా అమలు చేస్తున్నారని ప్రశంసించారు.
ఏపీ ప్రభుత్వం సాధించిన విజయాన్ని కేంద్రం గుర్తించిందన్నారు. ఏపీ తరహాలోనే సీజన్ ముగియకుండానే బీమా పరిహారాన్ని అర్హత కలిగిన రైతుల ఖాతాల్లో నేరుగా జమ చేసేలా కసరత్తు జరుగుతోందన్నారు. పంటల బీమా పథకంతో పాటు రైతు సంక్షేమ కార్యక్రమాల అమలులో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ అంకితభావాన్ని అభినందిస్తున్నట్లు తెలిపారు. వర్కుషాప్‌లో రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారులు, బీమా కంపెనీల ప్రతినిధులు, వివిధ ప్రభుత్వ విభాగాల ప్రతినిధులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment