సాక్షి, అమరావతి: పచ్చ పత్రిక ఈనాడు విషపు రాతలు విపత్తులకంటే ప్రమాదకరంగా ఉన్నాయి. నిత్యం ఉషోదయంతో అబద్ధాలు నినదించే రామోజీకి క్షేత్ర స్థాయిలో వ్యవసాయ సంస్కరణల యజ్ఞం కనిపించట్లేదు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి వ్యవసాయంలో తీసుకొచ్చి విప్లవాత్మక మార్పులకు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ప్రశంసలు దక్కుతున్నాయి.
రైతులపై పైసా భారం పడకుండా డాక్టర్ వైఎస్సార్ ఉచిత పంటల బీమా పథకం అమలు చేస్తున్నారు. వాస్తవానికి రైతులకు అన్ని రకాలుగా దగా చేసింది చంద్రబాబు ప్రభుత్వమే. టీడీపీ హయాంలో సగటున 20.28 లక్షల మంది రైతుల పంటలకు మాత్రమే బీమా కవరేజ్ ఉండేది. అదీ సకాలంలో చెల్లించేవారు కాదు. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ఈ నాలుగేళ్ల పాలనలో 1.66 కోట్ల మంది రైతులకు బీమా కల్పించారు.
ఒక్క 2022–23 సంవత్సరంలోనే 54.11 లక్షల మందికి పంటల బీమా రక్షణ క ల్పించారు. ఇది ఓ రికార్డు. పంట కోత ప్రయోగాల ఆధారంగా వేసే దిగుబడి అంచనాకంటే.. వాస్తవ దిగుబడులు ఏమాత్రం తగ్గినా తదుపరి సీజన్ ప్రారంభం కావడానికి ముందే వైఎస్ జగన్ ప్రభుత్వం బీమా పరిహారం చెల్లిస్తోంది. ఈవేమీ పట్టని ఈనాడు ఉచిత బీమాపై అసత్య కథనంతో విషం కక్కింది.
వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ఈ– క్రాప్ నమోదు ఆధారంగా వైఎస్సార్ ఉచిత పంటల బీమాకు 2020 –21 సంవత్సరంలో రూ. 1,739 కోట్లు, 2021 –22 లో రూ. 2,978 కోట్ల పరిహారాన్ని ప్రభుత్వం రైతులకు చెల్లించింది. అదీ.. నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లోనే జమ చేసింది. గడిచిన నాలుగేళ్లలో ఉద్యాన పంటలకు రూ.423.73 కోట్లు పెట్టుబడి రాయితీని రైతుల ఖాతాల్లో జమ చేసింది. మామిడి పంట నష్టపోయిన 4,197 రైతులకూ రూ. 4.97 కోట్లు పెట్టుబడి రాయితీ అందించింది.
రబీ 2022–23 సీజన్‌కి పంటల బీమా కింద పంటలను నోటిఫై చేయలేదన్న మాటాఉత్త అబద్ధమే. వైఎస్సార్ ఉచిత పంటల బీమా అమలుకు 2022–23 రబీలో ఈ– క్రాప్ నమోదు పూర్తయిన రైతుల వివరాలను కేంద్ర ప్రభుత్వానికి, బీమా కంపెనీలకు ఈ ఏడాది మార్చిలోనే పంపించింది. నేషనల్ క్రాప్ ఇన్సూ్యరెన్స్ పోర్టల్‌లో నోటిఫికేషన్ డిజిటైజేషన్ కూడా పూర్తయింది. కేంద్ర ప్రభుత్వ సాంకేతిక బృందం రైతువారీ వివరాల పరిశీలన తర్వాత పీఎంఎఫ్‌బీవై పోర్టల్‌లో రబీ డేటా ప్రదర్శిస్తుంది.
పంటల బీమాను సరళతరం చేసింది కూడా వైఎస్సార్‌సీపీ ప్రభుత్వమే. బీమా అన్నది రైతుకు గుది బండగా మారకుండా, బ్యాంకు రుణంతో సంబంధం లేకుండా ఈ–క్రాప్‌లో నమోదైతే చాలు ప్రతి ఎకరాకూ బీమా వర్తింపజేస్తోంది. రైతుపై భారం లేకుండా పూర్తి ప్రీమియంను రాష్ట్ర ప్రభుత్వమే చెల్లిస్తోంది. బీమా కంపెనీలు గడువులోగా పరిహారం చెల్లించేలా పర్యవేక్షిస్తోంది. వైఎస్సార్ ఉచిత పంటల బీమాను కేంద్ర ప్రభుత్వం కూడా ప్రశంసించింది.
రాష్ట్రంలో రైతులకు బీమా పరిహారాన్ని తదుపరి సీజన్ ప్రారంభానికి ముందే చెల్లిస్తోంది. మిర్చి పంటకు బీమాను గతంలో మాదిరిగానే యథాతథంగా అమలు చేస్తోంది. వైఎస్సార్ ఉచిత పంటల బీమా పథకం కింద మిర్చి పంట సాగు చేసి నష్టపోయిన రైతులకు సకాలంలో పరిహారం చెల్లిస్తోంది. 2019–20లో 58,968 మంది రైతులకు రూ.90.24 కోట్లు, 2020–21లో 19,983 మంది రైతులకు రూ.36.02 కోట్లు, 2021–22లో 70,229 మంది రైతులకు రూ.439.78 కోట్లు చెల్లించింది. 2023–24లో బీమాకు మిర్చి పంట కవరేజీపై ప్రత్యేక దృష్టి పెట్టింది.
బీమా కవరేజ్, పరిహారం ఇలా..
తెలుగుదేశం పార్టీ పాలనలో ఐదేళ్లలో 74.37లక్షల మంది రైతులకు బీమా కవరేజ్ అయింది. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత గడిచిన నాలుగేళ్లలో 1.67 కోట్ల మంది రైతులు బీమా కవరేజ్ పరిధిలోకి వచ్చారు. టీడీపీ హయాంలో 2.32 కోట్ల ఎకరాలకు బీమా కవరేజ్ కల్పిస్తే, ఈ నాలుగేళ్లలో వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం 3.24 కోట్ల ఎకరాలకు బీమా కవరేజ్ కల్పించింది. టీడీపీ హయాంలో 30.85 లక్షల మందికి రూ.3,411 కోట్ల బీమా పరిహారం ఇస్తే.. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ఇప్పటివరకు 44.66 లక్షల మందికి రూ.6,488.84 కోట్ల బీమా పరిహారం అందజేసింది.
బీమా కవరేజ్ పొందిన రైతులు, విస్తీర్ణం (లక్షల ఎకరాల్లో) ఇలా..
Comments
Please login to add a commentAdd a comment