పంటల బీమా మొత్తాలను రైతు ఖాతాల్లో జమచేయాలి
ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు 18, 19 తేదీల్లో ఉద్యమం
గ్రామ సచివాలయాల్లో ‘సామూహిక రాయబారాలు’ పేరుతో వినతిపత్రాలు
ఆంధ్రప్రదేశ్ రైతు, వ్యవసాయ కార్మిక, కౌలురైతుల సంఘాల రాష్ట్ర కమిటీల సంయుక్త సమావేశం పిలుపు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో పాలకపార్టీ ఉచిత పంటల బీమాను మార్చే సాకుతో బీమా భారాన్ని రైతులపై వేసే యోచన విరమించుకోవాలని ఆంధ్రప్రదేశ్ రైతు, వ్యవసాయ కార్మిక, కౌలురైతుల సంఘాల సంయుక్త సమావేశం ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. విజయవాడలో నిర్వహించిన సంయుక్త సమావేశం వివరాలను ఏపీ రైతుసంఘం రాష్ట్ర కార్యదర్శి కె.ప్రభాకరరెడ్డి, ఏపీ వ్యవసాయ కార్మికసంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వి.వెంకటేశ్వర్లు, ఏపీ కౌలురైతుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం.హరిబాబు మంగళవారం మీడియాకు విడుదల చేశారు.
రాష్ట్రంలో గత ప్రభుత్వం అమలు చేసిన ఉచిత పంటల బీమాను మార్చేందుకు టీడీపీ ప్రభుత్వం ప్రయతి్నస్తోందన్నారు. రైతుల భాగస్వామ్యం పేరుతో బీమా ప్రీమియం భారాన్ని రైతులపై వేసేందుకు ఈ ప్రభుత్వం ఆలోచిస్తోందని చెప్పారు. కరువు, వరదలు, తుపాన్లు వంటి ప్రకృతి వైపరీత్యాలతో పంటలు నష్టపోయే రైతులను ఆదుకునేందుకు ఉచిత పంటల బీమా అమలు చేయాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉందన్నారు. ఈ విషయాన్ని మరిచి రైతులపై భారం వేసే ప్రయత్నాలు చేస్తే రైతు ఉద్యమం తప్పదని చెప్పారు.
ఈ విషయమై గ్రామస్థాయి నుంచి రాష్ట్రస్థాయి వరకు ఉద్యమం చేపడతామని, రాష్ట్ర ప్రభుత్వంపై వత్తిడి తెచ్చేందుకు రైతులు, కౌలురైతులు కదులుతారని తెలిపారు. రైతు, కౌలురైతు, వ్యవసాయ కార్మిక సంఘాల సమన్వయంతో ఈ నెల 18, 19 తేదీల్లో గ్రామ సచివాలయాల్లో ‘సామూహిక రాయబారాల’ పేరుతో వినతిపత్రాలు సమర్పించనున్నట్లు చెప్పారు.
2023లో కరువు, తుపాన్లతో దెబ్బతిన్న పంటలకు పంటల బీమా పరిహారం రైతుల ఖాతాల్లో వేయాలని, కౌలు రైతులకు కూడా పంటల బీమా పరిహారం ఇవ్వాలని, రైతు సేవా (రైతు భరోసా) కేంద్రాలను బలపర్చాలని, విత్తనాలు, ఎరువులు, పురుగుమందులను రైతుసేవా కేంద్రాల ద్వారా అందించాలని, పెండింగులో ఉన్న ఉపాధి బిల్లులను వెంటనే ఇవ్వాలనే ప్రధాన డిమాండ్లతో వినతిపత్రాలు ఇస్తామని వారు వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment