సాక్షి, అమరావతి: దేశమంతా ప్రశంసిస్తున్న వైఎస్సార్ ఉచిత పంటల బీమా పథకంపై నిత్యం కాకి లెక్కలతో ఎల్లో మీడియా నినదిస్తుండగా రైతుల ముసుగులో టీడీపీ నేతలు రభస చేస్తున్నారు. రైతులపై పైసా భారం లేకుండా ఉచిత పంటల బీమాను అమలు చేయడంతోపాటు గత సర్కారు హయాంతో పోలిస్తే రెట్టింపు ప్రయోజనాన్ని వైఎస్సార్ సీపీ ప్రభుత్వం చేకూరుస్తోంది.
తాజాగా ఈనెల 8వ తేదీన మరోసారి రైతన్నలకు పరిహారాన్ని అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధం కావడంతో ఉలిక్కిపడ్డ రామోజీ యథావిధిగా బురద జల్లేందుకు ఉపక్రమించారు! పరిహారంపై రైతులెవరూ అభ్యంతరం చెప్పకున్నా పచ్చ ముఠాలను రోడ్లపైకి తీసుకొచ్చి పొలిటికల్ డ్రామాలకు తెరతీశారు! ఉరవకొండలో ఆందోళనకు ఉసిగొల్పారు! వారిలో సగం మంది టీడీపీ నాయకులే ఉన్నట్లు రామోజీ అత్యుత్సాహంతో తన పత్రికలోనే ప్రచురించారు!!
వారం గడువిస్తే వచ్చిన అభ్యంతరాలు 123
ఖరీఫ్ 2022 సీజన్‌కు సంబంధించి 10.20 లక్షల మందికి రూ.1,117.21 కోట్ల పంటల బీమా పరిహారం మంజూరైంది. గత నెల 28వ తేదీ నుంచి ఆర్బీకేల్లో జాబితాలను ప్రదర్శిస్తున్నారు. పంటల విస్తీర్ణం, పరిహారం మంజూరుపై అభ్యంతరాల స్వీకరణకు ఈ నెల 4వ తేదీ వరకు వారం రోజుల పాటు గడువు ఇవ్వగా వచ్చిన అభ్యంతరాల సంఖ్య 123 మాత్రమే. అంటే 0.0001 శాతం కూడా లేదు. ఇక వాటిలో కూడా అత్యధికం సాంకేతికపరమైన అంశాలకు సంబంధించినవే. అంటే మంజూరైన బీమా పరిహారంపై రైతులకే కాదు రైతు సంఘాలకూ అభ్యంతరాలు లేవనే కదా అర్థం!
‘అనంత’లో అత్యధిక పరిహారం
టీడీపీ నేతలు రోడ్డెక్కి రభస చేసిన అనంతపురం జిల్లాకే అత్యధిక పరిహారం మంజూరు కావడం గమనార్హం. ఒక్క అనంతపురం జిల్లాలో 1.37 లక్షల మందికి రూ.212.94 కోట్ల పరిహారం మంజూరైంది. ఇక రాయలసీమలోని 8 జిల్లాలను పరిశీలిస్తే 7.72 లక్షల మందికి రూ.835.08 కోట్ల పరిహారం మంజూరైంది. మంజూరైన పరిహారంలోనే కాదు.. లబ్ది దారుల్లో అత్యధికులు రాయలసీమ రైతన్నలే ఉన్నారు.
అనంతపురం జిల్లాలో దిగుబడి ఆధారిత పత్తి, కంది, వరి, జొన్న, మొక్కజొన్న, మిరప పంటలకు బీమా వర్తింప చేశారు. పంట కోత ప్రయోగాల ఆధారంగా పత్తి పంటకు ఎన్నడూ లేనివిధంగా రూ.43.26 కోట్ల పరిహారం మంజూరు చేశారు. వాతావరణ ఆధారిత బీమాను బత్తాయి, దానిమ్మ, టమాటా, వేరుశనగ పంటలకు వర్తింప చేసి రూ.169.68 కోట్లు మంజూరు చేశారు. ఇందులో బత్తాయికి రూ.102.64 కోట్లు, వేరు శనగకు రూ.65.60 కోట్లు, టమాటాకి రూ.1.44 కోట్ల పరిహారాన్ని మంజూరు చేశారు.
బత్తాయికీ బీమా రక్షణ
గతంలో పంటల బీమా అందని ద్రాక్షే! అధిక ప్రీమియం చెల్లించలేక లక్షలాది మంది రైతులు విపత్తుల బారిన పడి ఏటా రూ.వేల కోట్ల పెట్టుబడిని నష్టపోయేవారు. కనీసం బీమా చేయించుకున్న వారికైనా పరిహారానికి దిక్కులేని దుస్థితి గత సర్కారు హయాంలో నెలకొంది. ఏళ్ల తరబడి పడిగాపులు కాస్తే అరకొరగా విదిల్చేవారు. అదికూడా ఏ పంటకు ఎంత పరిహారం వస్తుందో తెలియదు.
ఇప్పుడు పైసా భారం పడకుండా రైతులకు ఎలాంటి వ్యయ ప్రయాసలకు తావులేకుండా నోటిఫై చేసిన ప్రతీ పంటకు, సాగు చేసే ప్రతీ దఎకరాకు ఈ– క్రాప్ ఆధారంగా ఉచిత పంటల బీమా అమలవుతోంది. గతంలో బీమా పరిధిలో లేని బత్తాయి తదితర పంటలకు సైతం బీమా రక్షణ కల్పిస్తున్నారు.
బాబు బకాయిలనూ చెల్లించారు..
టీడీపీ హయాంలో ఐదేళ్లలో 30.85 లక్షల మందికి రూ.3,411.20 కోట్ల పరిహారం ఇవ్వగా వైఎస్సార్ సీపీ ప్రభుత్వం వచ్చాక ఇప్పటి వరకు 44.28 లక్షల మందికి రూ.6,684.84 కోట్ల బీమా పరిహారాన్ని నేరుగా రైతుల ఖాతాలకు జమ చేసింది. తాజాగా పంపిణీ చేయనున్న పరిహారాన్ని కూడా కలిపితే మొత్తం 54.48 లక్షల మందికి రూ.7,802.05 కోట్లు అందినట్లవుతుంది.
తద్వారా టీడీపీ హయాంతో పోలిస్తే అదనంగా 23.63 లక్షల మంది లబ్ధి పొందగా పరిహారం పరంగా రూ.4,390.85 కోట్లు అదనంగా ప్రయోజనం చేకూరుతోంది. 40 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నానని తరచూ చెప్పుకునే చంద్రబాబు అధికారంలో ఉండగా ఏనాడూ రైతులకు ఉచిత పంటల బీమా కల్పించాలనే ఆలోచన చేసిన పాపాన పోలేదు. టీడీపీ సర్కారు 6.19 లక్షల మందికి ఎగ్గొట్టిన రూ.715.84 కోట్ల పంటల బీమా పరిహారాన్ని సైతం చెల్లించి రైతుల సంక్షేమం పట్ల చిత్తశుద్ధిని చాటుకున్న ఘనత సీఎం వైఎస్ జగన్‌కే దక్కుతుంది.
Comments
Please login to add a commentAdd a comment