‘సంక్షేమ ఫలాలు అందని అర్హులెవరైనా ఉంటే వెతికి మరీ వారికి నేరుగా అందిస్తుంటే ఎవరైనా అభినందించాలిగానీ ఈనాడు మాత్రం పనిగట్టుకుని బురద జల్లే ప్రయత్నం చేస్తోంది. వాస్తవాలు తెలుసుకోకుండా బటన్ నొక్కిన ఏడాదికి ఖాతాల్లో సొమ్ము అంటూ తప్పుడు కథనాన్ని వండివార్చింది’.. అంటూ వ్యవసాయ శాఖ శుక్రవారం ఓ ప్రకటనలో ఖండించింది. రైతులపై పైసా భారం పడకుండా నోటిఫైడ్ పంటలను సాగుచేసిన ప్రతీ ఎకరాకు డాక్టర్ వైఎస్సార్ ఉచిత పంటల బీమా పథకం కింద రాష్ట్ర ప్రభుత్వం 2019 నుంచి బీమా కల్పిస్తోంది. ఈ–క్రాప్‌లో నమోదు ప్రామాణికంగా ఈ పథకాన్ని అమలుచేస్తున్నారు. అర్హత పొందిన వారికి తరువాత ఏడాది సీజన్ ప్రారంభమయ్యేలోగా పరిహారం చెల్లిస్తున్నారు. ఇలా గడిచిన నాలుగేళ్లుగా 44.66 లక్షల మందికి రూ.6,684.84 కోట్ల బీమా పరిహారం చెల్లించారు.
గతంలో ఎన్నడూ లేని విధంగా ఖరీఫ్–2021 సీజన్‌లో అర్హత పొందిన 15.61 లక్షల మంది రైతులకు గతేడాది జూన్ 14న రూ.2,977.82 కోట్లు జమచేసింది. ఒక సీజన్‌కు సంబంధించి ఇంత పెద్ద మొత్తంలో పరిహారం అందించడం చరిత్రలో ఇదే తొలిసారి. సీఎం వైఎస్ జగన్ ఆదేశాల మేరకు అర్హులైన ఏ ఒక్కరూ మిగిలిపోకూడదనే ఉద్దేశంతో పరిహారం అందని వారి నుంచి, ఆర్బీకేల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. క్షేత్రస్థాయి పరిశీలన అనంతరం అర్హత సాధించిన మేరకు ప్రభుత్వం నిధులు కూడా విడుదల చేసింది. అయితే, కొన్ని సంశయాత్మక ఖాతాలున్నాయన్న ఆరోపణల నేపథ్యంలో పునఃపరిశీలన చేశారు.
అందులో అర్హత పొందిన వారికి సంబంధించిన విస్తీర్ణానికి గతంలో ఏమైనా చెల్లింపులు జరిగాయా లేదా అని కూడా పునఃపరిశీలన చేశారు. ఒకటి రెండుసార్లు క్షేత్రస్థాయిలో పునఃపరిశీలన తర్వాత అన్ని వి«ధాలుగా అర్హత పొందిన వారి జాబితాలను సామాజిక తనిఖీల్లో భాగంగా ఆర్బీకేల్లో ప్రదర్శించారు. ఇలా అర్హత పొందిన 9 వేల మందికి ఈనెల 14న రూ.90 కోట్లు జమచేశారు. తొలుత అర్హత పొందిన వారిలో వీరు కేవలం 0.2 శాతం మాత్రమే. వాస్తవాలిలా ఉంటే.. సాంకేతిక కారణాలతో ప్రత్యేక పరిస్థితుల్లో జరిగిన జాప్యాన్ని మాత్రమే లెక్కలోకి తీసుకుని బీమా పరిహారం ఏడాదికి జమచేసినట్లుగా వాస్తవాలను మరుగున పరిచేలా ప్రచురించిన వార్తను ఖండిస్తున్నట్లు వ్యవసాయ శాఖ స్పెషల్ కమిషనర్ హరికిరణ్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment